తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్షవాహనంపై మలయప్పస్వామి
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు మలయప్పస్వామి కల్పవృక్షవాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు.
దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మాత్సవాల్లో భాగంగా నేడు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ తిరుమాఢ వీధుల్లో కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ.. భక్తులకు అభయప్రదానం చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులంతా కల్పవృక్ష వాహనసేవను చూసి తరించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకూ స్నపన తిరుమంజనం, రాత్రి 7 గంటల నుంచి సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు.
రేపు గరుడసేవ
రేపు శ్రీవారికి టీటీడీ గరుడవాహన సేవ(garuda vahana seva) నిర్వహించనుంది. మోహినీ అవతారం(mohini avataram)లో స్వామివారు గరుడవాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. గరుడవాహనసేవ నేపథ్యంలో తిరుమలకు భక్తుల తాకిడి అధికంగా ఉండనున్న నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. రేపు సాయంత్రం 6.30గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ స్వామివారు గరుడవాహనంపై విహరిస్తారని తెలిపింది. సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.
సోమవారం తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నట్లు టీటీడీ తెలిపింది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూలైన్లు ఉండగా.. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తెలిపింది. నిన్న 86 వేలమందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు.