402 ఎకరాల్లో హిందూ దేవాలయం.. విదేశాల్లో ఇండియా సంస్కృతిని చాటిన 'మిస్టరీ' టెంపుల్

హిందూ ధర్మం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. హిందూ దేవాలయాలు, సంస్కృతి సాంప్రదాయాలు మన దేశంలోనే కాకుండా విశ్వవ్యాప్తంగా ఎన్నోదేశాల్లో వేల ఏండ్ల క్రితమే వ్యాప్తిచెంది మన చరిత్ర వైభవాన్ని చాటి చెప్పాయి.

Update: 2022-12-26 11:29 GMT

దిశ, వెబ్ డెస్క్ :  హిందూ ధర్మం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. హిందూ దేవాలయాలు, సంస్కృతి సాంప్రదాయాలు మన దేశంలోనే కాకుండా విశ్వవ్యాప్తంగా ఎన్నోదేశాల్లో వేల ఏండ్ల క్రితమే వ్యాప్తిచెంది మన చరిత్ర వైభవాన్ని చాటి చెప్పాయి. పూర్వీకులు ఇతర దేశాలలో కూడా పెద్ద పెద్ద హిందూ దేవాలయాలను అక్కడక్కడ నిర్మించారు. నేటికీ విదేశాల్లో మన సంస్కృతికి సంబంధించిన చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి.

ముఖ్యంగా కంబోడియాలోని ఆంగ్ కోర్ వాట్ విష్ణు దేవాలయం గురించి తెలుసుకోవాలి. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా ప్రసిద్ది చెందింది. 12 వ శతాబ్దంలో సూర్యవర్మన్ అనే రాజు ఈ గుడిని నిర్మించారు. ప్రస్తుతం ఈ ఆలయం యునెస్కో గుర్తింపు కూడా పొందింది. ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఈ ఆలయం కూడా ఒకటిగా చేర్చారు.

ఈ మధ్య కాలంలోనే నాసా ఈ ఆలయానికి సంబంధించిన ఓ కొత్త విషయాన్ని కనిపెట్టింది. అది ఏంటంటే ప్రపంచానికే తెలియని అద్భుతమైన పెయింటింగ్‌లు ఈ ఆలయంలో ఉన్నాయని నాసా కనిపెట్టింది. ఆంగ్ కోర్ దేవాలయాన్ని కేవలం ఒక దేవాలయంగా చెప్పలేం. ఈ ఆలయం చుట్టూ ఎక్కడ చూసినా కొన్ని వందల సంఖ్యలో హిందూ సంస్కృతి ఉట్టిపడేలా ఆలయాలు దర్శనం ఇస్తాయి. అందుకే అంగ్ కోర్‌ను ఆలయాల నగరం అని పిలుస్తారు.


ఆలయాన్ని ఎవరు నిర్మించారు

పూర్వ కాలంలో ఈ ఆలయాన్ని 'యశోధర పూర్' అని పిలిచేవారు. ఈ విష్ణు ఆలయ నిర్మాణాన్ని సూర్యవర్మన్ ఖైమర్ అద్భుతమైన వాస్తు శిల్పంతో ప్రారంభించాడు కానీ పూర్తిచేయలేకపోయాడు. మధ్యలో ఆగిపోయిన ఆలయ పనులను సూర్యవర్మన్ ఖైమర్ మేనల్లుడు ధరణీంద్రవర్మన్ హయాంలో పూర్తి చేశారు. ఈ దేవాలయం 402 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ఆలయ నిర్మాణం చోళుల రాజవంశం దేవాలయాలను పోలి ఉంటుందని పండితుల అభిప్రాయం. ప్రపంచంలోనే అతి పెద్ద విష్ణు దేవాలయంగా పిలిచే ఈ ఆలయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు దర్శనం ఇస్తారు.

ఆలయం ప్రధాన గోపురం ఎత్తు దాదాపు 64 మీటర్లు, మిగిలిన ఎనిమిది గోపురాల ఎత్తు 54 మీటర్ల వరకు ఉండి నిచ్చెన ఆకారంలో ఆలయ నిర్మాణం ఉంటుంది. ఆలయ వెలుపల 190 మీటర్ల వెడల్పు కందకం, 30 మీటర్ల బహిరంగ ప్రదేశం ఉన్నాయి. ఇక ఈ ఆలయం గోడలపై అందమైన అప్సరసల చిత్రాలు, అసురులు, దేవతల మధ్య జరిగిన సాగర మధనం కథనాలు, హిందూ గ్రంథాలకు సంబంధించిన చిత్రాలు ఇలా ఎన్నో చూడొచ్చు. ఆంగ్ కోర్ వాట్ హిందూ దేవాలయంలో బౌద్ధ సన్యాసులు నివసించి దీన్ని బౌద్ధారామంగా మార్చే ప్రయత్నం చేశారని చరిత్ర చెబుతుంది.


Similar News