శక్తిపీఠాలని దర్శించుకోలేకపోతున్నారా.. అయితే ఈ ఆలయాలకు వెళ్లిరండి..
చైత్ర నవరాత్రి ఉత్సవాలు ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
దిశ, ఫీచర్స్ : చైత్ర నవరాత్రి ఉత్సవాలు ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీని తర్వాత, ఏప్రిల్ 17న శ్రీ రామనవమి పండుగ అంటే రాంలాలా పుట్టినరోజు జరుపుకుంటారు. నవరాత్రి తొమ్మిది రోజులు దుర్గాదేవి వివిధ రూపాలను పూజిస్తారు. చైత్ర నవరాత్రులు ఉత్తరం నుండి దక్షిణం వరకు ప్రతి చోట వైభవంగా జరుపుకుంటారు. చైత్ర నవరాత్రి మొదటి రోజున హిందూ నూతన సంవత్సరాన్ని కూడా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజులలో, అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
ఇక చాలామంది అమ్మవారి శక్తిపీఠాన్ని సందర్శించలేకపోతుంటారు. అలాంటి వారు రాజధాని ఢిల్లీలోని అమ్మవారి ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడి పురాతన అమ్మవారి ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. నవరాత్రి సమయంలో ఈ ఆలయాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. మరి ఆ ఆలయాల విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఝండేన్‌వాలన్ ఆలయం..
ఈ ఆదిశక్తి దేవి ఆలయం ఢిల్లీలో చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ఝండేవాలన్ రోడ్‌లో ఉంది. ఈ ఆలయానికి ఝండేవాలన్ స్టేషన్ వద్ద బ్లూ లైన్ మెట్రో నుంచి దిగి కాలినడకన ఈ ఆలయానికి వెళ్లవచ్చు. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఉదయం, సాయంత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. షాజహాన్ హయాంలో ఇక్కడ జెండాలను సమర్పించేవారని, అందుకే ఈ ఆలయానికి ఝండేవాలన్ అని పేరు వచ్చిందని చెబుతారు.
కల్కా జీ ఆలయం
ఢిల్లీలోని పురాతన దేవాలయాలలో కల్కా జీ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో మహంకాళి భక్తులకు దర్శనం ఇస్తుంది. కల్కా జీ స్టేషన్ వద్ద వైలెట్ లైన్ మెట్రో నుండి దిగి నేరుగా ఆలయానికి వెళ్లవచ్చు. ఈసారి నవరాత్రి ఉత్సవాలను ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. పాండవులు ఈ ఆలయంలోని కాళికామాతను పూజించారని చెబుతారు.
ఛతర్పూర్ ఆలయం..
ఛతర్‌పూర్ ఆలయం కూడా ఢిల్లీలోని చాలా ప్రసిద్ధ దేవాలయం. ఈ ఆలయం కాత్యాయని తల్లికి అంకితం చేశారు. తల్లి కాత్యాయని తొమ్మిది మంది దేవతలలో ఆరవ స్థానంలో ఉంది. ఛతర్‌పూర్ ఆలయంలోనే కాత్యాయని దేవి ప్రధాన ఆలయం ఉందని, ఇది నవరాత్రి సమయంలో మాత్రమే తెరిచి ఉంటుందని చెబుతారు. ఇక్కడ మీరు ఛతర్పూర్ మెట్రో స్టేషన్ వద్ద పసుపు లైన్ మెట్రో నుంచి దిగి వెళ్ళవచ్చు. మెట్రో స్టేషన్ నుండి ఈ ఆలయం దూరం 1 నుండి 2 కి.మీ.