భద్రాద్రి రాముని కల్యాణానికి ప్రత్యేక తలంబ్రాలు.. ఎలా చేస్తారో తెలుసా..?
దేశవ్యాప్తంగా నేడు రామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
దిశ వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా నేడు శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాగా దక్షణాదిలో సీతారాముడు కొలువైన పుణ్యక్షేత్రం భద్రాచలం. ఇక ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా భద్రాద్రి రాముని కళ్యాణానికి దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే కనులవిందుగా జరిగే కళ్యాణ రామయ్య కళ్యాణంలో వినియోగించే తలంబ్రాలకు ఓ ప్రత్యేకత ఉంది.
ఈ తలంబ్రాలను రామ భక్తులు గోటితో ఒలిచి ఆలయానికి సమర్పిస్తారు. ఆ తలంబ్రాలనే స్వామివారి కల్యాణంలో వాడతారు. ఈ పుణ్యకార్యంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్టాలకు చెందిన రామభక్తులు పాల్గొంటారు. రామభక్తులు బృందాలుగా ఏర్పడి 40 నుంచి 45 రోజులపాటు ప్రత్యేకంగా సాంప్రదాయ పద్ధతుల ద్వారా వరి సాగు చేస్తారు. అనంతరం భక్తితో పంటను కోసి, నూర్పిడి చేసి వడ్లుగా మారుస్తారు.
ఇక ఆ వడ్లను గోటితో ఒలిచి బియంగా తాయారు చేస్తారు. ఆలా తాయారు చేసిన బియ్యాన్ని రామ భక్తులు భద్రాచలానికి కాలినడకన వచ్చి రామాలయ దేవస్థానానికి సమర్పిస్తారు. కాగా భక్తులు సమర్పించిన బియ్యాన్ని సీతారాముల కళ్యాణంలో తలంబ్రాలుగా వాడతారు. ఇలా గోటితో తలంబ్రాలను తాయారు చెయ్యడం ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తుంది.