బోసిపోయిన యాదాద్రి ఆలయం
దిశ ప్రతినిధి, నల్లగొండ :శ్రావణ మాసంలో మహిళలు వ్రతాలు, పూజలు అధికంగా చేస్తుంటారు. పెళ్లిళ్ల హడావిడి సైతం ఉంటుంది. ఆలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు భక్తులతో కళకళలాడుతుంటాయి. యాదాద్రి లక్ష్మీనారసింహుడి క్షేత్రం శ్రావణ మాసంలో కిటకిటలాడేది. కానీ కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో శ్రావణ మాసం తొలిరోజే యాదాద్రి క్షేత్రం బోసిపోయింది. మాములు రోజుల్లో వచ్చే భక్తుల రద్దీ సైతం కన్పించకపోవడంతో అధికారులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదు అవుతుండడంతో […]
దిశ ప్రతినిధి, నల్లగొండ :శ్రావణ మాసంలో మహిళలు వ్రతాలు, పూజలు అధికంగా చేస్తుంటారు. పెళ్లిళ్ల హడావిడి సైతం ఉంటుంది. ఆలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు భక్తులతో కళకళలాడుతుంటాయి. యాదాద్రి లక్ష్మీనారసింహుడి క్షేత్రం శ్రావణ మాసంలో కిటకిటలాడేది. కానీ కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో శ్రావణ మాసం తొలిరోజే యాదాద్రి క్షేత్రం బోసిపోయింది. మాములు రోజుల్లో వచ్చే భక్తుల రద్దీ సైతం కన్పించకపోవడంతో అధికారులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదు అవుతుండడంతో యాదాద్రి క్షేత్రానికి పూర్తిగా భక్తుల రద్దీ తగ్గిపోయింది. అత్యంత పవిత్రమాసంగా భావించే శ్రావణ మాసంలో ఆలయాల్లో గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవని అర్చకులు, పూజారులు అభిప్రాయపడుతున్నారు.
తొలిరోజు కన్పించని భక్తజనం
శ్రావణమాసంలో ప్రతి మంగళవారాన్ని భక్తులు ఎంతో ప్రీతీకరమైన రోజుగా భావిస్తుంటారు. దేవతలందరినీ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే సమస్త శుభాలు కలుగుతాయని భావిస్తుంటారు. అందులో భాగంగానే గౌరీదేవికి పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రావణ మాసం తొలిరోజు యాదాద్రి క్షేత్రంపై కొత్తగా పెళ్లి అయిన జంటలు పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ, పూలు, అక్షింతలు చల్లి పూజలు చేస్తారు. పెళ్లికాని యువతులు సైతం ఇలాంటి పూజలు చేస్తే మంచి వరుడు దొరుకుతాడని భక్తుల నమ్మకం.
ప్రత్యేక పూజలే కాదు.. మాముల దర్శనాలకు రాట్లే..
శ్రావణమాసంలో యాదాద్రి క్షేత్రంలో విపరీతమైన భక్తుల రద్దీ ఉంటుంది. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ విజృంభణ కారణంగా భక్తులు లేక బాలాలయం వెలవెలబోతోంది. కనీసం సాధారణ దర్శనాలకు కోసం భక్తులు లేక క్యూలైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
కరోనా వైరస్ భయంతోనే అధికశాతం..
యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ మహానగరానికి సమీపంలో ఉండడం.. నిత్యం నగరానికి రాకపోకలు సాగించేవారి సంఖ్య అధికంగా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతుండడం వల్ల ఆ ప్రభావం యాదాద్రి భువనగిరి జిల్లాపై పడింది. ఇదే సమయంలో యాదాద్రి క్షేత్రం చుట్టూ ఉన్న జిల్లాలోనూ కరోనా కేసుల భయంతో భక్తజనం యాదాద్రి క్షేత్రం వైపు రావడం లేదు.