కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఫైర్.. వారికి బెయిల్ మంజూరు

న్యూఢిల్లీ: దేశరాజధానిలో గతేడాది చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసు విచారణలో ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. పింజ్రా థోడ్ కార్యకర్తలు నతాషా నర్వాల్, దేవంగన కలితా, మరో యాక్టివిస్టు ఆసిఫ్ ఇక్బాల్ తాన్హాలపై ‘ఉపా’ అభియోగాలు మోపడాన్ని తప్పుపట్టింది. ఒక్కరికి రూ. 50వేల వ్యక్తిగత పూచీకత్తు, ఇద్దరి ష్యూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులోని అంశాలను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం అసమ్మతిని అణచివేయడానికి ఉబలాటపడినట్టు అనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కుకు, తీవ్రవాద […]

Update: 2021-06-15 06:45 GMT

న్యూఢిల్లీ: దేశరాజధానిలో గతేడాది చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసు విచారణలో ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. పింజ్రా థోడ్ కార్యకర్తలు నతాషా నర్వాల్, దేవంగన కలితా, మరో యాక్టివిస్టు ఆసిఫ్ ఇక్బాల్ తాన్హాలపై ‘ఉపా’ అభియోగాలు మోపడాన్ని తప్పుపట్టింది. ఒక్కరికి రూ. 50వేల వ్యక్తిగత పూచీకత్తు, ఇద్దరి ష్యూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులోని అంశాలను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం అసమ్మతిని అణచివేయడానికి ఉబలాటపడినట్టు అనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కుకు, తీవ్రవాద కార్యకలాపాలకు మధ్య గీతను పాక్షికంగా విస్మరించినట్టు తెలుస్తున్నదని, ఇదే కొనసాగితే ప్రజాస్వామ్యానికే చేటు అని న్యాయమూర్తులు సిద్ధార్థ మృదుల్, అనుప్ జైరామ్ భంభానిల ధర్మాసనం అభిప్రాయపడింది. సిసలైన ఆధారల్లేకుండా అనుమానాలు, ఊహాగానాలతో ప్రభుత్వం దర్యాప్తునకు ఉపక్రమించడం సరికాదని స్పష్టం చేసింది.

ఈ కేసులో ఆధారాల్లేకుండా కేవలం ముందస్తు అనుమానాలతో దాఖలైన చార్జిషీటుతో తాము సంతృప్తిగా లేదని పేర్కొంది. ‘ఉపాలోని సెక్షన్ 15లో పేర్కొన్న ఉగ్రవాద కార్యకలాపాలకు విస్తృతమైన అర్థమున్నది, కొంత అస్పష్టతా ఉన్నది. కాబట్టి, తీవ్రవాద చర్యలను స్పష్టంగా పసిగట్టాలి. సాధారణ ఐపీసీ పరిధిలోకి వచ్చే నేరాలకూ ఉపాను వర్తింపజేయరాదు’ అని వివరించింది. సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ ఒక్కోసారి హింసాత్మక ఆందోళనలనూ తీవ్రవాదంగా పరిగణించలేమని తెలిపింది. ‘రెచ్చగొట్టే ఉపన్యాసాలు, దిగ్బంధనాలు, మహిళా కార్యకర్తలను ప్రేరేపించడం సహా రాజ్యాంగం అనుమతించిన ఇతర చర్యలకూ నిందితులు పాల్పడ్డారని అనుకుందాం. కానీ, అవి ఉగ్రవాద చర్యలుగా, కుట్రగా భావించి ఉపా వర్తింపజేయలేం. ఈ నిందితులు నిరసనలో పాల్గొనడం మినహా నేరాలకు పాల్పడినట్టు ప్రత్యేక ఆధారాలేవీ చార్జిషీటులో పేర్కొనలేదు’ అని పేర్కొంది. ప్రభుత్వాలు విచారణకు అనుమతించాయనే ఒకే కారణంగా ఉపా అభియోగాలను ట్రయల్ కోర్టు స్వీకరించరాదని ఈ సందర్భంగా హెచ్చరించింది. ఉపా కింద తీవ్రమైన శిక్షలుంటాయని, కాబట్టి స్వతంత్ర విచారణా దృక్పథాన్ని కోర్టులు ఏర్పరుచుకోవాలని సూచించింది.

Tags:    

Similar News