లోపభూయిష్టంగా పట్టాల పంపిణీ.. తలలు పట్టుకున్న జర్నలిస్టులు

ఎన్నికల వేళ మాజీ మంత్రి జర్నలిస్టులకు వేసిన ఎరకు తెర పడింది.

Update: 2024-10-09 01:40 GMT

దిశ, కరీంనగర్ బ్యూరో: ఎన్నికల వేళ మాజీ మంత్రి జర్నలిస్టులకు వేసిన ఎరకు తెర పడింది. అధికారమే పరమావధిగా అహంకారంతో వ్యవహరించిన తీరు జర్నలిస్టు కుటుంబాలను అభాసుపాలు చేసింది. అడ్డదిడ్డంగా హడావిడిగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి 13 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎగరేసుకుని వెళదాం అని అనుకున్న వ్యూహం బెడిసి కొట్టింది. పట్టాల పంపిణీ రోజు నుంచే ప్రశ్నార్థకంగా మారిన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు వివాదం పరిష్కారానికి నోచుకోకుండా 10 నెలల పాటు ఆశతో ఎదురుచూసిన జర్నలిస్టు కుటుంబాల ఆశలను అడియాసలు చేసింది. ఆడబిడ్డల పేరు మీద పట్టాలు ఇస్తామంటే పండగ చేసుకున్నట్లుగా భావించి ఏ అడ్డు ఉండదనుకున్న వారికి నిరాశే మిగిలింది. జర్నలిస్టులకు అవి చట్టవిరుద్ధంగా ఇవ్వడమే కాక అక్రమాలు జరిగాయని నిరూపణ కావడంతో ప్రభుత్వం పట్టాలను రద్దు చేయగా.. ఆశల పల్లకిలో ఊరిగేన జర్నలిస్టులు తమను దగా చేసింది ఎవరని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.

అవహేళన చేసిన పట్టాల పంపిణీ

పెడతానంటే ఆశ.. కొడతాను అంటే భయం ఇది మానవుడి సహజ గుణం. దానిని ఆసరా చేసుకున్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఐదేళ్లలో అదిగో.. ఇదిగో ఇళ్ల స్థలాలు అంటూ జర్నలిస్టుల్లో ఆశలు రేపి చివరకు జర్నలిస్టులను అభాసుపాలు చేశారు. ఎన్నికల నోటిపికేషన్‌కు ఒక్కరోజు ముందు పట్టాల పంపిణీ పేరిట చేసిన హడావిడి జర్నలిస్టు కుటుంబాలను ఆగం చేసి ఆందోళనకు కారణం అయింది. ఇళ్ల స్థలాలపై జర్నలిస్టుల ఆశను ఆసరా చేసుకున్న మాజీ మంత్రి అడుగడుగున అవహేళనకు గురి చేశారు. ఇళ్ల స్థలాల పేరిట డబుల్ బెడ్ రూం పట్టాలు అందజేసిన మంత్రి కేటాయించిన స్థలానికి సంబందించిన శాఖ నుంచి ఎన్‌వోసీ తీసుకోకుండానే పట్టాలు పంపిణీ చేయగా.. అక్కడ నిర్మాణమే లేని ఇళ్లకు డబుల్ బెడ్ రూం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన పట్టా సర్టిఫికేట్‌లో కనీసం సర్వే నంబరు లేకపోవడం ఆయనకు జర్నలిస్టుల‌పై ఉన్న నిబద్ధతకు నిదర్శనం. కాగా, మాజీ మంత్రి ప్రతిచర్య జర్నలిస్టులను ఆశ్చర్యానికి గురిచేసినప్పటికీ చిరకాల కోరిక నెరవేరుతుందనే ఆశ వారిలో అనుమానం, ఆలోచన లేకుండా చేసింది. ఇప్పుడు అదే అంశం జర్నలిస్టులను హేళనకు గురిచేసి అవమానపరచినంత పని చేసింది.

పట్టాలు జర్నలిస్టులకా.. బలహీనవర్గాల మహిళలకా

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం అని చెప్పుకున్న మాజీ మంత్రి బలహీన వర్గాలు ఇస్తున్నామంటూ చేసిన ఆర్భాటం మేథావులను సైతం అయోమయంలో పడేసింది. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు జీవో లేనందున బీపీఎల్ కోటా కింద కేటాయిస్తున్నామన్న మాజీ మంత్రి నాన్ లోకల్ వారికి ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించడం అంతు చిక్కని రహస్యం మారింది. అలాంటి పరిస్థితుల్లో అక్రమాలు జరిగాయని కొంతమంది జర్నలిస్టులు ప్రశ్నించగా.. నేను జర్నలిస్టులకు ఇవ్వడం లేదు బీపీఎల్ కోటా కింద ఇచ్చాను. నా ఇష్టం వచ్చిన వారికి ఇస్తాను అంటు చెప్పడం తన బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తుండగా, మాట మీద నిలబడాల్సిన మాజీ మంత్రి మాట మార్చి ఇప్పుడు జర్నలిస్టుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు మాజీ మంత్రి ఇళ్ల స్థలాలు ఎవరికి ఇచ్చారనేది స్పష్టం చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆందోళన బాటపట్టిన జర్నలిస్టులు

జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళ బాటపట్టిన జర్నలిస్టులు ఆ అంశంపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్లు దాఖలు చేసిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం స్టే ఇచ్చినట్లు సమాచారం. ఇక మరోవైపు మాజీ మంత్రి మాటలు నమ్మి ఇళ్ల నిర్మాణం కోసం రూ.లక్షలు వెచ్చించి ఇప్పుడు పట్టాలు రద్దు కావడంతో జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారు. అసలే చాలీచాలని జీతాలతో కాలం వెల్లదీస్తున్న విలేకరులు పండుగ పూట పరేషాన్‌లో పడిపోయారు. ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నారంటే భార్యా పిల్లలతో వెళ్లి పట్టాలు తీసుకున్నాం.. నేడు కుటుంబ సభ్యులకు ఏమని చెప్పేది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Similar News