‘తెలుగు రాష్ట్రాల్లో జల జగడం.. రావు గోపాల్ రావు, అమ్రీష్​పురి నాటకాలు’

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం ఒక పెద్ద డ్రామా అని, రాజకీయాల కోసమే నీళ్ల సెంటిమెంట్‎ను రెచ్చగొడుతున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఇద్దరి నాటకాలు రక్తి కట్టిస్తున్నాయని, సీఎం కేసీఆర్ రావు గోపాల్​రావు, జగన్ అమ్రీష్​పురి తరహాలో నాటకాలాడుతున్నారని విమర్శించారు. గాంధీభవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇద్దరు సీఎంలు ఇరు ప్రాంతాల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారన్నారు. రాయలసీమకు వెళ్లినప్పుడు ఆ ప్రాంతాన్ని రతనాల […]

Update: 2021-07-03 07:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం ఒక పెద్ద డ్రామా అని, రాజకీయాల కోసమే నీళ్ల సెంటిమెంట్‎ను రెచ్చగొడుతున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఇద్దరి నాటకాలు రక్తి కట్టిస్తున్నాయని, సీఎం కేసీఆర్ రావు గోపాల్​రావు, జగన్ అమ్రీష్​పురి తరహాలో నాటకాలాడుతున్నారని విమర్శించారు. గాంధీభవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇద్దరు సీఎంలు ఇరు ప్రాంతాల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారన్నారు. రాయలసీమకు వెళ్లినప్పుడు ఆ ప్రాంతాన్ని రతనాల సీమగా చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని ఈ సందర్భంగా వివరించారు. ఏపీలో జగన్‌ను గెలిపించేందుకు కేసీఆర్ డబ్బులు పంపారని ఆరోపించారు. నీళ్ల వివాదాలు ఇంత స్థాయిలో ఉంటే ఏడేండ్ల నుంచి ఎందుకు మాట్లాడలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్‌ను ఎందుకు పిలిచారని ప్రశ్నించారు.

కేసీఆర్, జగన్ రాజకీయ నాటకాలకు ప్రజలు బలి కావొద్దని, ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుని ఇప్పుడు ఎందుకు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. గతంలో విజయసాయిరెడ్డి ఏకంగా కేసీఆర్​కాళ్లు మొక్కాడని శ్రవణ్ గుర్తు చేశారు. ఇవన్నీ ప్రజలు మరిచిపోలేదని, ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసి రెండేండ్లు అవుతుందని, ఇన్ని రోజులు సైలెంట్​ ఉండి ఇప్పుడు ఎందుకు ఎగిరిపడుతున్నారన్నారు.

పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టు 20 శాతం కూడా పనులు కాకుండానే వంద శాతం ఎస్టిమేట్లు పెంచారని, కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కృష్ణా బేసిన్‌‌లో ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తి చేసేవారని దాసోజు విమర్శించారు. కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులను పూర్తి చేస్తే జగన్ జలదోపిడి చేసినా ఇబ్బంది ఉండేది కాదని, జగన్ జల దోపిడి చేయకపోతే కేసీఆర్‌కు రాష్ట్రంలో ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టే అవకాశం ఉందని, అందుకే ప్రాజెక్టులు పూర్తి చేయకుండా జగన్‌కు అవకాశం కల్పించారని శ్రవణ్ ఆరోపించారు. జల వివాదాలతో ఇద్దరు సీఎంలూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని, కృష్ణా ట్రిబ్యునల్‌ను ఎందుకు ఏర్పాటు చేయించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కూడా జల వివాదాలను వేడుకల చూస్తుందని, చాట్ల తవుడు పోసి కొట్లాట పెట్టుతుందన్నారు దాసోజు శ్రవణ్.

Tags:    

Similar News