పాలేరుపై దామోదర్‌రెడ్డి కన్ను..!
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు మాజీ మంత్రి తుమ్మల మళ్లీ టీఆర్ఎస్‌లో యాక్టివ్ అవుతుండగా… కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసేందుకు మూడేళ్లు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటుండటం గమనార్హం. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నిర్ణయంతో ఇటు జిల్లా కాంగ్రెస్‌లో, అటు పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. వాస్తవానికి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం, […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు మాజీ మంత్రి తుమ్మల మళ్లీ టీఆర్ఎస్‌లో యాక్టివ్ అవుతుండగా… కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసేందుకు మూడేళ్లు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటుండటం గమనార్హం. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నిర్ణయంతో ఇటు జిల్లా కాంగ్రెస్‌లో, అటు పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. వాస్తవానికి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం, ఎదుగుదల అంతా కూడా నల్గొండ జిల్లాతోనే ముడిపడి ఉంది.
తన సోదరుడు రాంరెడ్డి వెంకటరెడ్డి హయాంలో కాంగ్రెస్ కంచుకోటగా వర్ధిల్లిన పాలేరు నియోజకవర్గం నుంచే తన రాజకీయ పునఃప్రస్థానాన్ని ఆరంభించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పాలేరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలందరికీ టచ్‌లోకి వెళ్తున్నారు. త్వరలోనే కూసుమంచిలో నివాసం ఏర్పాటు చేసుకుని కార్యకర్తలు, నాయకులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని కూడా చెబుతున్నారంట. శుక్రవారం పాలేరు నియోజకవర్గంలోని కొంతమందిని ఆయన పలుకరిస్తూ వెళ్లారు. ఈ పరిణామం నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనియాంశంగా మారింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డితో పాటు తుమ్మలతోనూ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి రాజకీయంగా పోరాటం చేయాల్సి వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తమవుతోంది.
అభిమానం పొందుతాడా..?
దామోదర్‌రెడ్డి సోదరుడు రాంరెడ్డి వెంకటరెడ్డి 2009, 2014 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. ఆయన హయాంలో పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా వర్ధిల్లింది. 2016లో వెంకటరెడ్డి ఆకస్మిక మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి సుచరితరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా, తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత మంత్రిగా నియోజకవర్గంపై తుమ్మల తనదైన ముద్రవేశారు. దీంతో వెంకటరెడ్డి అనుచరుల్లో కొంతమంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా, మరికొంతమంది కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు.
2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కందాళ ఉపేందర్‌రెడ్డి తుమ్మలను ఓడించి సంచలనం సృష్టించారు. కందాళతో కలిసి పనిచేసిన వెంకటరెడ్డి అనుచరులు.. ఆ తర్వాత కందాళ తీసుకున్న నిర్ణయంతో టీఆర్ఎస్ వైపు నడిచారు. నాటి నుంచి కాంగ్రెస్ నియోజకవర్గంలో నామమాత్రంగా మారిపోయింది. ఉనికి కోల్పోయిందనే చెప్పాలి. పాత- కొత్త టీఆర్ ఎస్ అంటూ వర్గ రాజకీయాలు జోరుగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో దామోదర్‌రెడ్డి ఏ మేరకే సక్సెస్ అవుతాడో చూడాలి..