ఆరుగాలం కష్టపడితే ఏడ్పు మిగిలింది!

దిశ, రంగారెడ్డి: భూమిని నమ్ముకొని రైతులు వివిధ పంటలను సాగు చేస్తుంటారు. ఆరుగాలం కష్టపడితేగానీ, పూట గడవని పరిస్థితి రైతులది. ఇలాంటి రైతులకు వాతావరణమే ఒక వరం. ఆ వాతావరణం సహకరించకుంటే రైతుబతుకు ఛిద్రమైతుంది. అదంతా ఒక ఎత్తు అయితే.. చేతికి వచ్చిన పంటకు మార్కెట్ లేకపోతే రైతు కుదేలు కావడం ఖాయం. అదే పరిస్థితి ఇప్పుడు మామిడి రైతులకు ఎదురైంది. అకాల వర్షంతో మామిడి పంట నేలపాలైంది. ఇప్పుడు లాక్‌డౌన్‌తో మార్కెట్లు మూతపడిపోయాయి. దీంతో విక్రయాలు […]

Update: 2020-04-26 01:31 GMT

దిశ, రంగారెడ్డి: భూమిని నమ్ముకొని రైతులు వివిధ పంటలను సాగు చేస్తుంటారు. ఆరుగాలం కష్టపడితేగానీ, పూట గడవని పరిస్థితి రైతులది. ఇలాంటి రైతులకు వాతావరణమే ఒక వరం. ఆ వాతావరణం సహకరించకుంటే రైతుబతుకు ఛిద్రమైతుంది. అదంతా ఒక ఎత్తు అయితే.. చేతికి వచ్చిన పంటకు మార్కెట్ లేకపోతే రైతు కుదేలు కావడం ఖాయం. అదే పరిస్థితి ఇప్పుడు మామిడి రైతులకు ఎదురైంది. అకాల వర్షంతో మామిడి పంట నేలపాలైంది. ఇప్పుడు లాక్‌డౌన్‌తో మార్కెట్లు మూతపడిపోయాయి. దీంతో విక్రయాలు నిలిచిపోయాయి. తీవ్రంగా నష్టం వాటిల్లిందని మామిడి రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది కంటే దిగుబడి తక్కువే…

రంగారెడ్డి జిల్లాలో 22,577 ఎకరాల మామిడి పంట సాగులో ఉంది. గతేడాది 72 వేల మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి కాగా ఈ ఏడాది కేవలం 25 వేల నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మామిడిపూత ఆలస్యంగా రావడంతో దిగుబడి తగ్గుతుందని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఈ మామిడి పంటపై జిల్లాలో 4,622 మంది రైతులు ఆధారపడి ఉన్నారు. దిగుబడి లేక దిగాలు చెందుతున్న రైతులకు అకాల వర్షంతో మరింత నష్టాన్ని కలిగించింది.

జిల్లాలో 535 ఎకరాల్లో నష్టం….

రంగారెడ్డి జిల్లాలో 22,577 ఎకరాల విస్తీర్ణంలో మామిడి సాగు చేస్తున్నారు. ఇందులో 680 ఎకరాల్లో మామిడి పంట నష్టం కలిగిందని అధికారులు అంచనా వేశారు. అత్యధికంగా షాదనగర్ మండలంలో 165 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆ తర్వాత మంచాలలో 123, యాచారంలో 110, కడ్తల్ లో 105, కేశంపేటలో 40, తలకొండపల్లి లో 72, మహేశ్వరంలో 60, కందూకుర్ లో 5 ఎకరాల చొప్పున మామిడి పంటకు నష్టం జరిగింది. అత్యధికంగా సాగు కలిగిన మరో మండలం ఇబ్రహీంపట్నంలో నష్టం లేకపోవడం గమనార్హం.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో…

మామిడి పంటకు ధర లేదు. ఈ ఏడాది ఎకరాకు రూ. 20 వేలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని గ్రామాల్లో కోతుల బెడదతో మామిడి కాయలు పాడైన సంఘటనలున్నాయి. ప్రస్తుతం కరోనా దెబ్బతో మామిడి రైతులు విలవిలలాడుతున్నారు. ప్రతి ఏడాది వేసవిలో మామిడి పచ్చడికి కాయలు మార్కెట్లోకి ఏప్రిల్‌, మే నెలలోనే అందుబాటులోకి వస్తాయి. కానీ, ఇప్పటి వరకు మామిడి కాయలు అందుబాటులోకి రాలేదు.

కరోనా కాటేసింది: గోపాల్, మామిడి రైతు

‘చేతికి వచ్చిన మామిడిని మార్కెట్ కు తరలిద్దామని అనుకున్నాము. కానీ, కరోనా వైరస్ కారణంగా బయటికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దిగుబడి రావాలని పలుమార్లు పిచికారీ చేశాం. పెట్టుబడి వచ్చే అవకాశం లేదు. రాలిన కాయలను రూ.10 లకు 3 చొప్పున స్థానికంగా అమ్ముతున్నాం’.

ఈదురు గాలులతో మరింత నష్టం: కె. వీరయ్య, షాద్‌నగర్

షాద్‌నగర్‌లో 4 ఎకరాల్లో మామిడి తోట పెట్టాను. మామిడి పూత ఆలస్యంగా రావడంతో దిగుబడి పెద్దగా లేదు. దానికి తోడు ఈదురు గాలులతో కాయలన్నీ నేలపాలయ్యాయి. మార్కెట్ లేకపోవడంతో పెద్దగా విక్రయాలుండవు. రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి’

Tags: Rangareddy, mango farmers, losses, hoarding prices, investments

Tags:    

Similar News