హుజురాబాద్ ఎఫెక్ట్.. కేసీఆర్ కొత్త ‘పథకం’.. వారి ఖాతాల్లోకి రూ. 10 లక్షలు.!

దిశ, హుజురాబాద్ : రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం తీసుకువచ్చిన దళిత బంధు ప్రపంచంలోనే ఒక గొప్ప పథకమని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ […]

Update: 2021-07-19 08:04 GMT

దిశ, హుజురాబాద్ : రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం తీసుకువచ్చిన దళిత బంధు ప్రపంచంలోనే ఒక గొప్ప పథకమని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు. ఎన్నో ప్రభుత్వాలు, నాయకులు మారినా.. దళితుల బతుకులు మాత్రం మారలేదని, అందుకే సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. దేశంలో ఉన్న బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కలలు కనే వారని, ఆ కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నాడన్నారు. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని మొదటిసారిగా హుజురాబాద్‌లో ప్రవేశపెట్టడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం ఒక గొప్ప పథకమని.. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందన్నారు.

కేసీఆర్‌కు ఇష్టమైన జిల్లా కరీంనగర్ అని.. అందుకే హుజరాబాద్ నుంచే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయన్నారు. గతంలో రైతుల సంక్షేమం కోసం తీసుకు వచ్చిన రైతుబంధు పథకాన్ని సైతం హుజురాబాద్ నుంచే ప్రారంభించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. దేశంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను తీసుకువస్తున్నారని తెలిపారు. ఈ పథకం అమలుకు నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి ఒక ఐఏఎస్ అధికారి వచ్చి అర్హులను గుర్తిస్తారని, నేరుగా అర్హులైన దళిత కుటుంబం ఖాతాలో రూ. 10 లక్షలు ప్రభుత్వం జమ చేస్తుందన్నారు.

అయితే, ఈ ఎన్నికలు ఈటల రాజేందర్ కోరుకున్న ఎన్నికలే అన్నారు. నియోజకవర్గంలో ఈటల దేనికోసం పాదయాత్ర చేస్తున్నాడో ప్రజలు ప్రశ్నించాలన్నారు. గత 18 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. కేవలం సొంత ఆస్తులను పెంచుకోవడం తప్ప నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. నియోజకవర్గంలో ఏ ఒక్క నిరుపేదకు కూడా ఈటల డబుల్ బెడ్ రూమ్ అందించలేక పోయాడన్నారు. అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి చేయలేని ఈటల ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు.

Tags:    

Similar News