లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: 20-12-2022

ఐక్యరాజ్య సమితి సంఘం నుంచి ఇరాన్ బహిష్కరణ

Update: 2022-12-20 14:10 GMT

ఐక్యరాజ్య సమితి సంఘం నుంచి ఇరాన్ బహిష్కరణ:

స్త్రీ, పురుష సమానత్వం, మహిళా సాధికారత కోసం పాటుపడే 'అంతర్జాతీయ అంతర్ ప్రభుత్వ సంఘం' నుంచి ఇరాన్‌ను బహిష్కరించడానికి ఆర్థిక, సామాజిక మండలి(ఎకాసోక్)లో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఓటింగ్‌కి భారత్ గైర్హాజరైంది.

ఈ సంఘాన్ని మహిళల హోదా పరిరక్షక సంఘంగా వ్యవహరిస్తారు.

2022- 26 మధ్య కాలంలో సంఘ సభ్యత్వం నుంచి ఇరాన్‌ను బహిష్కరించడానికి అమెరికా ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానం ఐకాసోక్ ఆమోదం పొందింది.

రక్షణ రంగంలో భారత్ - అమెరికా ముందడుగు:

భారత్‌తో రక్షణ బంధాన్ని పటిష్ఠం చేసుకునేందుకు ఉపకరించే బిల్లును అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) ఆమోదించింది.

85800 కోట్ల డాలర్ల కేటాయింపులతో రూపొందించిన ఈ బిల్లు జాతీయ రక్షణ ప్రాధికార చట్టం(ఎన్‌డీఏఏ)గా మారింది.

దీనిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ సంతకం చేయనున్నారు.

రష్యా ఆయుధాలపై భారత్ ఆధారపడే అవసరం లేకుండా ఈ చట్టం తోడ్పడనుంది.

అత్యాధునిక ఆయుధాల రూపకల్పనకు సంయుక్త పరిశోధనకు, సైబర్ పోరాట సామర్థ్యాలను పెంపొందించడానికి ఇది వీలు కల్పిస్తుంది.

చైనా, రష్యా నుంచి పెరుగుతున్న పోటీని ఎదుర్కోవడానికి ఉపకరిస్తుందని సెనెట్ సాయుధ సర్వీసుల కమిటీ అధ్యక్షుడు జాక్ రీడ్ తెలిపారు.

జాతీయ ఉత్తమ సంఘంగా 'కామారెడ్డి సహకార సంఘం':

స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కార్యక్రమం మొదలై.. మూడు దశాబ్దాలు పూర్తయింది.

ఈ సందర్భంగా నాబార్డు, డీజీఆర్‌వీ జర్మనీ సహకారంతో ఏపీ మాస్, ఎనేబుల్ నెట్ వర్క్‌లు.. జాతీయ, రాష్ట్ర స్థాయి ఉత్తమ మహిళా సంఘాలకు అవార్డులు ప్రధానం చేయనుంది.

వివిధ రీజియన్ల పరిధిలో 2022 ఏడాదికిగాను అవార్డులకు ఎంపికైన మహిళా సంఘాల వివరాలను ఏపీ మాస్ సంస్థ ప్రకటించింది.

కామారెడ్డికి చెందిన కామారెడ్డి మండల సహకార సమాఖ్య క్రెడిట్ సొసైటీ జాతీయ స్థాయిలో ఉత్తమ సంఘంగా ఎంపికైంది.

డిసెంబర్ 17న హైదరాబాద్‌లో మంత్రి ఎర్రబెల్లి అవార్డులను అందజేయనున్నట్లు ఏపీ మాస్ సంస్థ తెలిపింది.

ఇక్రిసాట్ ఇంటర్నీకి ప్రతిష్టాత్మక పురస్కారం:

అమెరికాలోని అట్లాంటాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ శాస్త్ర, సాంకేతిక సదస్సులో హైదరాబాద్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది.

బయోకెమిస్ట్రీ విభాగంలో చేసిన పరిశోధనల్లో భాగంగా ఆయన సీతాఫలం చెట్టు ఆకుల ద్వారా చవగ్గా లభించే జీవ వైవిధ్య పురుగుమందును ఆవిష్కరించారు.

దీనికి సదస్సులో మూడో స్థానం లభించింది.

ఇంధన పరిరక్షణలో దక్షిణ మధ్య రైల్వేకు ఆరు పురస్కారాలు:

ఇంధన పరిరక్షణలో దక్షిణ మధ్య రైల్వే ఆరు అవార్డులను అందుకుంది.

జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేశారు.

రైల్వే స్టేషన్ల విభాగంలో ఇంధన పరిరక్షణ చర్యలకు కాచిగూడ స్టేషన్‌కు ప్రథమ బహుమతి లభించగా హైదరాబాద్ డీఆర్ఎం శరత్ చంద్రయాన్‌తో పాటు జోన్ ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పి.డి.మిశ్రా రాష్ట్రపతి నుంచి పురస్కారాలు అందుకున్నారు.

ఏపీఎస్ఈసీఎంకు పురస్కారం:

నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2022 లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల(ఎస్‌డీఏ) విభాగంలో ఏపీ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్(ఏపీఎస్ఈసీఎం) ప్రథమ పురస్కారం సాధించింది.

ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్, మిషన్ సీఈవో కె.చంద్రశేఖర్‌రెడ్డి అవార్డు అందుకున్నారు.

రెడ్కోకు జాతీయ పురస్కారం:

ఇంధన పొదుపు కార్యక్రమాల నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో)కు జాతీయ ఉత్తమ పురస్కారం లభించింది.

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సంస్థ రాష్ట్రానికి ఈ అవార్డు ప్రకటించిందని సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు.

జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ చేతుల మీదుగా రెడ్కో ఎండీ జానయ్యతో కలిసి సతీష్ రెడ్డి ఈ పురస్కారం అందుకున్నారు.

మాతా శిశు సంరక్షణలో తెలంగాణకు రెండు అవార్డులు:

మాతా శిశు సంరక్షణలో తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఉత్తమమైనవని కేంద్రం ప్రశంసించింది.

ఈ మేరకు జాతీయ ప్రసూతి ఆరోగ్య సదస్సులో రాష్ట్రానికి 2 అవార్డులు వచ్చాయి.

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్ వైఫరీ వ్యవస్థకు ప్రత్యేక అవార్డు లభించింది.

హైరిస్క్ గర్భిణులను గుర్తించి చికిత్స అందించడంలో రెండో స్థానం దక్కింది.

ఢిల్లీలో ఈ అవార్డుల్ని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ చేతుల మీదుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎస్.పద్మజ అందుకున్నారు.

సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో మూడో స్థానంలో తెలంగాణ:

సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానాన్ని ఆక్రమించగా.. ఏపీ 15వ స్థానానికి పరిమితమైంది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్‌టీపీఐ), సెజ్‌లలో ఉన్న సంస్థలు కలిపి రూ. 11,59,210 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేశాయి.

తొలి 5 స్థానాలు:

కర్ణాటక - రూ. 3,95,904 కోట్లు

మహారాష్ట్ర - రూ. 2,36,808 కోట్లు

తెలంగాణ - రూ. 1,80,617 కోట్లు

తమిళనాడు - రూ. 1,57,925 కోట్లు

ఉత్తరప్రదేశ్ - రూ.55,459 కోట్లు


Similar News