లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ : (యూపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సీ.. )
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఉత్తమ విమానాశ్రయం పురస్కారం
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఉత్తమ విమానాశ్రయం పురస్కారం:
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వే ద్వారా ఉత్తమ విమానాశ్రయం అవార్డుకు ఎంపికైంది. 2022 కి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 15 నుంచి 25 మిలియన్ల వార్షిక ప్రయాణీకుల విభాగంలో ఈ అవార్డు లభించింది. వరుసగా 9 ఏళ్లు హైదరాబాద్ విమానాశ్రయం గ్లోబల్ టాప్ - 3 విమానాశ్రయాల్లో ఒకటిగా నిలుస్తోంది.
సౌరశక్తితో వెలిగే తొలి ఒడిశా గ్రామంగా సగసాహి:
ఒడిశాలో సౌర విద్యుత్ ను మాత్రమే వినియోగించుకునే తొలి గ్రామంగా సగసాహి నిలిచింది. ఇక్కడి సుందర్‌గఢ్ జిల్లాలోని మారుమూల గ్రామమైన సగసాహిలో ప్రతి ఇంటికీ, కార్యాలయానికి 24 గంటలూ సౌర విద్యుత్ అందించేలా సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశామని ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇకపై ఇక్కడ ఉన్న 90 నివాసాలు, 10 వేల లీటర్ల నీటి సరఫరా వ్యవస్థ, 70 వీధి దీపాలు సౌర విద్యుత్‌ను పొందనున్నాయని తెలిపారు.
విజయవంతంగా ఉపగ్రహ ధ్వంసం: ఇస్రో
భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న మేఘ - ట్రోపికస్ - 1 (ఎంటీ 1) ఉపగ్రహాన్ని విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ఇస్రో ప్రకటించింది. సుమారు పదేళ్ల పాటు సేవలందించిన ఈ ఉపగ్రహం సాయంత్రం 4.30 నుంచి 7.30 మధ్య భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనంతరం దానికదే విడిపోయి పసిఫిక్ మహాసముద్రం పైన గగనతలంలో కాలి బూడిదైంది. యునైటెడ్ నేషన్స్ స్పేస్ డెబ్రిస్ ఏజెన్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు ఉపగ్రహాలను అంతరిక్షంలోనే ధ్వంసం చేసే సత్తా అమెరికా, రష్యా, చైనాలతో పాటు భారత్‌కే ఉందని తెలిపారు. భూమిపై వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు 2011 అక్టోబర్ 12న ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో ఇస్రో ఈ ఉపగ్రహాన్ని పంపగా 2021 తర్వాత ఇది పూర్తిగా నిలిచిపోయింది. గంటకు 27 వేల కి.మీ వేగంతో కక్ష్యలో తిరుగుతున్న మేఘాను ధ్వంసం చేసి.. ఉపగ్రహాలను కూల్చే సత్తా ఇస్రోకు ఉందని నిరూపించుకుంది.
నేపాల్ అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్:
నేపాల్ నూతన అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రామ్ చంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. ప్రధాని పుష్ప కుమార్ దహాల్ ప్రచండ నేతృత్వంలోని 8 పార్టీల కూటమి ఆయనకు మద్దతుగా నిలిచింది. 550 మంది అసెంబ్లీ సభ్యుల్లో 518 మంది, 332 మంది ఎంపీల్లో 313 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేల్లో 352 మంది, ఎంపీల్లో 214 మంది పౌడెల్‌కు ఓటు వేశారు. మాజీ ప్రధాని కె.పి శర్మ నేతృత్వంలోని సీపీఎన్ - యూఎంఎల్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన సుభాష్ చంద్ర నెబ్ మాంగ్ ఓడిపోయారు. ప్రస్తుత అధ్యక్షురాలు బిద్యా దేవీ భండారీ పదవీ కాలం మార్చి 12 తో ముగియనుంది. 2008లో గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాత నేపాల్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది మూడోసారి.
అమెరికాలో జిల్లా జడ్జిగా తొలి భారతీయ అమెరికన్ మహిళ:
అమెరికాలోని మసాచు సెట్స్‌లో తొలి భారతీయ అమెరికన్ మహిళా జడ్జిగా తెజల్ మెహతా నియమితులయ్యారు. అయెర్ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. గత కొంతకాలం ఇదే న్యాయస్థానంలో సహ న్యాయమూర్తిగా ఆమె విధులు నిర్వర్తించారు.
చైనా రక్షణ బడ్జెట్ 225 బిలియన్ డాలర్లు:
చైనా తన రక్షణ బడ్జెట్‌ను భారీగా 7.2 శాతం పెంచింది. ఇది యువాన్లలో 1.55 ట్రిలియన్లు కాగా డాలర్లలో 225 బిలియన్లు, చైనా రక్షణ బడ్జెట్‌ను పెంచడం వరుసగా ఇది 8వ సారి. చైనా ఆర్థిక వృద్ధి రేటు కంటే రక్షణ బడ్జెట్ పెంపు రేటు అధికంగా ఉండి. గతేడాది 7.1 శాతం పెంపుతో 1.45 ట్రిలియన్ల (230 బిలియన్ డాలర్ల) బడ్జెట్‌ను ఆమోదించింది. యువాన్‌తో పోలిస్తే డాలర్ విలువ ఈ ఏడాది పెరిగిన నేపథ్యంలో 225 బి.డాలర్లకు చేరినట్లు చైనా అధికార పత్రిక తెలిపింది. ప్రపంచంలో అమెరికా రక్షణ బడ్జెట్ 2023 ఏడాదికి 816 బి.డాలర్లు. ఆ తర్వాత స్థానం చైనాదే కావడం గమనార్హం.