కరెంట్ అఫైర్స్: 2022

అంతర్జాతీయం :జి -20 లోగోను విడుదల చేసిన మోడీ..Latest Telugu News

Update: 2022-11-14 13:49 GMT

అంతర్జాతీయం:


జి -20 లోగోను విడుదల చేసిన మోడీ:

జి-20 కూటమికి భారత్ నేతృత్వానికి సంబంధించి లోగోను, ఇతివృత్తాన్ని, వెబ్‌సైట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో ఆవిష్కరించారు.

ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రాధాన్యత గల అంశాలతో కూడిన ఎజెండా రూపకల్పనకు, జి-20 సమావేశానికి నేతృత్వం భారత్‌కు ప్రత్యేక అవకాశం అందిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. జి -20 లోగో ఇతి వృత్తం భారతదేశ సందేశం ప్రాధాన్యాలను ప్రతిబింబిస్తాయని పేర్కొంది.

ప్రపంచంలో శక్తివంతమైన కూటమిగా పేరుగాంచిన జి-20 పాలనా పగ్గాలను డిసెంబర్ 1న ఇండోనేసియా నుంచి భారత్ స్వీకరించింది.

2022 జి-20 సమావేశం నవంబర్ 15,16 తేదీల్లో ఇండోనేషియాలోని బాలిలో జరుగనుంది.

2023లో సమావేశాన్ని భారత్ లో నిర్వహించనున్నారు.


జి-20 సభ్య దేశాలు:

అర్జెంటీనా

ఆస్ట్రేలియా

బ్రెజిల్

కెనడా

చైనా

ఫ్రాన్స్

జర్మనీ

ఇండియా

ఇండోనేషియా

ఇటలీ

జపాన్

రిపబ్లిక్ ఆఫ్ కొరియా

మెక్సికో

రష్యా

సౌదీ అరేబియా

దక్షిణాఫ్రికా

టర్కీ

యునైటెడ్ కింగ్‌డమ్

యూఎస్ఏ

యూరోపియన్ యూనియన్



మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా అరుణా మిల్లర్:

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఓ మహిళ చరిత్ర సృష్టించారు.

తెలుగు నేపథ్యం ఉన్న అరుణా మిల్లర్ (58) మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు.

భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే తొలిసారి.

ఆమెతో పాటు పలువురు భారతీయ అమెరికన్లు ఆయా రాష్ట్రాల చట్టసభల్లోనూ ఉనికి చాటుకున్నారు.

డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన అరుణ గతంలో మేరీలాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్ సభ్యురాలిగా ఉన్నారు.


ప్రకృతి పరిరక్షణకు దేశాలన్నీ సహకరించాలి: ఆంటోనియో గుటెరస్

పర్యావరణంలో ప్రతికూల మార్పులను నివారించేందుకు అన్ని దేశాలు తక్షణం ఏకమవ్వాల్సిన ఆవశ్యకతను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు.

దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగకపోతే వినాశనం తప్పదని హెచ్చరించారు.

ప్రస్తుతం పర్యావరణ పరమైన నరకం దిశగా ప్రపంచం పరుగులు పెడుతున్నట్లు అనిపిస్తోందని అన్నారు.

ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్ వేదికగా జరుగుతున్న కాప్ - 27 సదస్సులో గుటెరస్ ప్రసంగించారు.

కర్బన ఉద్గారాల తగ్గింపు దిశగా ధనిక, పేద దేశాల మధ్య కొత్త ఒప్పందం అవసరమని ఆయన పిలుపునిచ్చారు.

సంపన్న దేశాల్లో 2030 కల్లా, ఇతర దేశాల్లో 2040 కల్లా బొగ్గు వినియోగం నిలిచిపోయేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పర్యావరణంలో ప్రతికూల మార్పులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధానంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అత్యంత ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరాలుగా 2015 - 22

భూతాపం 2022 లో రికార్డు స్థాయికి చేరుకుందని, వాతావరణ మార్పులు ప్రపంచాన్ని మరింత అతలాకుతలం చేస్తున్నాయని ప్రపంచ వాతావరణ విభాగం (డబ్ల్యూఎంవో) పేర్కొంది.

ఆ సంస్థ కాప్ - 27 సదస్సు సందర్భంగా డబ్ల్యూఎంఓ ప్రొవిజనల్ గ్లోబల్ క్లైమేట్ 2022 నివేదికను విడుదల చేసింది.

ఇందులో పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచ ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపునకు పరిమితం చేయాలన్న పారిస్ ఒప్పందం లక్ష్యం నీరుగారే అవకాశం ఉందని తెలిపారు.

పారిశ్రామిక విప్లవం (1850-1900) పూర్వం నాటి సగటుతో పోలిస్తే 2022లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.15 డిగ్రీ సెంటీగ్రేడ్ మేర పెరిగి ఉండొచ్చని నివేదిక అంచనా వేసింది.

దీని ప్రకారం 1901 తర్వాత అత్యంత ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరాలుగా గత ఎనిమిదేళ్లు (2015 -2022) రికార్డు అని పేర్కొంది.


ప్రపంచంలోని మూడో వంతు హిమనీ నదాలకు ముప్పు: యునెస్కో

పెరుగుతున్న ఉష్ణోగ్రతలను కట్టడి చేయకపోతే ప్రపంచ వారసత్వ జాబితాలోని మూడో వంతు హిమనీ నదాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని యునెస్కో అధ్యయనం వెల్లడించింది.

పూర్వ పారిశ్రామిక యుగంతో పోల్చితే భూగోళ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్‌కు మించి పెరగకుంటే మిగిలిన మూడింట రెండో వంతు హిమనీ నదాలను కాపాడవచ్చని తెలిపింది.

ఇది కాప్ (కాన్ఫరెన్స్ ఆఫ్ పారీస్) -27 ప్రతినిధులకు పెద్ద సవాల్ అని తెలిపింది.

ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు కూటమి విజయం:

ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని మతతత్వ కూటమి ఘన విజయం సాధించింది.

పార్లమెంట్ (నెసెట్) లోని 120 స్థానాలకుగాను ఈ కూటమి 64 స్థానాలను సాధించి అధికారానికి అవసరమైన మెజారిటీ సాధించింది.

కొద్ది రోజులుగా రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటున్న దేశంలో త్వరలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడనుంది.

నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ 32 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది.

ప్రధాని పీఠాన్ని కోల్పోనున్న లాపిడ్ నేతృత్వంలోని యశ్ ఆటిడ్ పార్టీ 24 స్థానాలను సాధించింది.

మతతత్వ జియో నిజం పార్టీ 14 స్థానాలను పొంది మూడో స్థానంలో నిలిచింది.

కెనడాలో హిందూ వారసత్వ మాసంగా నవంబర్:

నవంబర్ నెలను హిందూ వారసత్వ మాసంగా అధికారికంగా గుర్తిస్తున్నట్లు కెనడా ప్రకటించింది.

బహుళ సంస్కృతుల దేశ పురోగతిలో హిందూ వర్గం పాత్ర ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

నవంబర్ నెలను హిందూ వారసత్వ మాసంగా ప్రకటించాలంటూ అధికార లిబరల్ పార్టీకి చెందిన చంద్ర ఆర్య ప్రైవేట్ మెంబర్ మోషన్ ను మే నెలలో హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రవేశపెట్టారు.

సెప్టెంబర్ 29న సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

=================================

జాతీయం:


ఈడబ్ల్యూఎస్ కోటాను సమర్థించిన రాజ్యాంగ ధర్మాసనం:

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లపై సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.

విద్య, ఉద్యోగాల్లో వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో చేసిన 103వ రాజ్యాంగ సవరణకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3-2తో ఆమోదముద్ర వేసింది.

ధర్మాసనంలోని మెజార్టీ సభ్యులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ జె.బి.పార్దీవాలాలు, ఈడబ్ల్య్యూఎస్‌ను ఒక ప్రత్యేక వర్గంగా పరిగణించడం సహేతుకమైన వర్గీకరణగా పేర్కొన్నారు.

ఈ సవరణ.. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని తెలిపారు.

ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు విద్య, ఉద్యోగావకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019లో కేంద్రం 103వ రాజ్యాంగ సవరణ చేసింది.

దీనికి పార్లమెంటు ఉభయసభలు అదే ఏడాది జనవరిలో ఆమోదం తెలిపాయి.

ఈ సవరణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 40 పిటిషన్లు దాఖలయ్యాయి.

అత్యుత్తమ యాజమాన్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్:

భారత్‌లో ఉద్యోగులు పనిచేయడానికి అత్యుత్తమ సంస్థగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది.

ఆదాయాలు, లాభాలు, మార్కెట్ విలువ పరంగా దేశంలో అతి పెద్ద సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది.

ఫోర్బ్స్ వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ 2022 ప్రకారం.. దేశీయంగా తొలి స్థానంలో ఉన్న రిలయన్స్, ప్రపంచంలో 20వ స్థానంలో నిలిచింది.

800 కంపెనీలతో రూపొందించిన ఈ జాబితాలో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం అమెజాన్ 14, డెకాథ్లాన్ 15వ స్థానాల్లో నిలిచాయి.

మెర్సిడెస్ బెంజ్, కోక-కోలా, హోండా, యమహా, అరామ్ కో వంటి సంస్థల కన్నా రిలయన్స్ మెరుగైన స్థానం పొందింది.

భారత్ నుంచి స్థానం పొందినవి:

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ - 137

బజాజ్ - 173

ఆదిత్య బిర్లా గ్రూప్ - 240

హీరో మోటో - 333

ఎల్ అండ్ టీ -354

ఐసిఐసిఐ బ్యాంక్ - 365

హెచ్‌సీఎల్ టెక్ - 455

ఎస్‌బిఐ - 499

అదానీ ఎంటర్ ప్రైజెస్ - 547

ఇన్ఫోసిస్ - 668

====================

నియామకాలు:


లా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ రితురాజ్ అవస్థి నియామకం:

కర్ణాటక హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థిని లా కమిషన్ ఛైర్ పర్సన్ గా నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.

జస్టిస్ కేటీ శంకరన్, ప్రొఫెసర్ ఆనంద పలివాల్, ప్రొఫెసర్ డీపీ వర్మ, ప్రొఫెసర్ రాకా ఆర్య, ఎం. కరుణానిధిలు కమిషన్ సభ్యులుగా నియమితులైనట్లు ఆయన తెలిపారు.

యూబీఐ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా శ్రీనివాసన్ వరదరాజన్‌

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నాన్ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా శ్రీనివాసన్ వరదరాజన్ ను మూడేళ్ల కాలానికి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నియామకం తక్షణం అమల్లోకి వచ్చేలా నవంబర్ 7వ తేదీతో ఒక నోటిఫికేషన్‌ను కేంద్రం విడుదల చేసింది.

దక్షిణ మధ్య రైల్వే జీఎంగా అరుణ్ కుమార్ జైన్:

కేంద్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వేకు పూర్తి స్థాయి జనరల్ మేనేజరు (జీఎం)ను నియమించింది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్ (ఐఆర్ఎస్ఎస్ఈ) 1986 బ్యాచ్‌కు చెందిన జైన్ ఏప్రిల్ 1 నుంచి దక్షిణ మధ్య రైల్వే జోన్ ఇంఛార్జి జీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు జీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

రాజ్యసభ హౌస్ కమిటీ ఛైర్మన్ గా సీఎం రమేశ్:

రాజ్యసభ సభ్యులను ఇళ్లు కేటాయించడానికి ఉద్దేశించిన హౌస్ కమిటీ ఛైర్మన్ గా ఏపీకి చెందిన భాజపా సభ్యుడు సీఎం రమేశ్ నియమితులయ్యారు.

=============================

అవార్డులు:

ఝాన్సీ రాణికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు:

నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు 2021 ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న మిర్యాల ఝాన్సీరాణి అందుకున్నారు.

కరోనా కష్టకాలంలోనూ దేశవ్యాప్తంగా రోగులకు అనుపమానమైన సేవలందించిన 51 మంది నర్సులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కగా ..తెలుగు రాష్ట్రాల నుంచి ఝాన్సీ రాణి ఒక్కరే నిలిచారు.

సమాజం కోసం నర్సింగ్ వృత్తిలో ఉన్న వారు చేస్తున్న సేవలకు గుర్తింపుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ 1973లో ఈ అవార్డును ప్రారంభించింది.


రైతు సాధికార సంస్థకు ఫ్యూచర్ ఎకానమీ నాయకత్వ అవార్డు:

ఆంధ్రప్రదేశ్‌లో ఆరేళ్లుగా ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న రైతు సాధికార సంస్థకు ప్రతిష్టాత్మక గ్లోబల్ ఫ్యూచర్ ఎకానమీ నాయకత్వ అవార్డు లభించింది.

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈజిప్టులో జరుగుతున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ - 27 (కాప్ - 27) సదస్సులో ఈ అవార్డును ప్రకటించి అందించాలని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న సంస్థలకు ఫ్యూచర్ ఎకానమీ ఫోరం ఆధ్వర్యంలో ఏటా అవార్డులు అందిస్తారు.

========================

రాష్ట్రీయం:

ఇన్నోవేషన్ ఫర్‌యులో తెలంగాణ మహిళలకు చోటు:

తెలంగాణకు చెందిన ఐదుగురు స్టార్టప్స్ స్థాపించిన మహిళలకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది.

విజయవంతమైన 75 మంది మహిళా వ్యవస్థాపకుల వివరాలతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ 'ఇన్నోవేషన్ ఫర్ యు' పేరుతో కాఫీ టేబుల్ బుక్ ను విడుదల చేసింది.

తెలంగాణ నుంచి చోటు దక్కిన వారు:

అంత్యేష్టి ఫ్యునరల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు - శ్రుతి రెడ్డి రాపోలు

ఆటోక్రసీ మెషినరీ ప్రైవేటు లిమిటెడ్ వ్యవస్థాపకురాలు - సంతోషి బుద్ధిరాజు

గరుడాస్త్ర ఏరో ఇన్వెంటివ్ సొల్యూషన్స్ వ్యవస్థాపకురాలు - సీఈఓ శ్వేత గెల్లా

నేచర్స్ బయో ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు - ప్రతిభా భారతి

నియో ఇన్వెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు - సీఈఓ శ్రీవల్లి శిరీషలకు చోటు దక్కింది.

=====================

స్పోర్ట్స్:

'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' గా కోహ్లి

- నామినేట్ అయిన తొలిసారే ఎంపిక

- అక్టోబర్ నెలకు గానూ అవార్డు గెలుచుకున్న కింగ్

దుబాయ్: ఈ మధ్య కాలంలో తన మార్కు ఆటతో ఆకట్టుకున్న కింగ్ విరాట్ కోహ్లి అక్టోబర్ నెల 2022 కు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ సోమవారం వెల్లడించింది. కాగా కోహ్లితో పాటు దక్షిణాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రాజా అవార్డు కోసం పోటీ పడ్డారు.

33 ఏళ్ల కోహ్లి అక్టోబర్ నెలలో 4 టీ20 మ్యాచుల్లో 150 స్ట్రైక్ రేట్‌తో 205 పరుగులు చేశాడు. దీనిలో తాజాగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సూపర్-12లో పాకిస్తాన్‌పై చేసిన 82 పరుగుల ఇన్నింగ్స్ కూడా ఉంది. ఈ ఇన్నింగ్స్‌ను ఏ క్రికెట్ అభిమాని కూడా మర్చిపోలేరు. కోహ్లి కూడా తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇదేనని పేర్కొన్నాడు.

కాగా అవార్డు గెలుచుకోవడంపై విరాట్ హర్షం వ్యక్తం చేశారు. 'అక్టోబర్ నెలకు గానూ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ దిమంత్‌గా నిలవడం గొప్ప గౌరవంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల మద్దతు, ప్యానెల్ ఎంపిక నా సంతోషాన్ని రెట్టింపు చేస్తున్నాయి' అని కోహ్లి తెలిపారు.

తనతో పాటు నామినేట్ అయిన ప్లేయర్స్‌కు, తన తోటి ఆటగాళ్లకి, తనకు మద్దతుగా నిలిచిన వారికి అవార్డును అంకితం చేస్తున్నట్లు చెప్పారు. తనదైన ఆట తీరుతో భారత జట్టు సెమీస్ చేరడంలో కోహ్లి కీలకంగా వ్యవహరించాడు. తాజా టీ20 వరల్డ్ కప్ లో ఆడిన ఐదు మ్యాచుల్లో 123 సగటుతో 246 పరుగులతో విరాట్ టాప్‌లో ఉన్నాడు. దీనిలో 3 అర్థసెంచరీలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : గుడ్‌న్యూస్... తెలంగాణలో మరో నోటిఫికేషన్ రిలీజ్?


Similar News