ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు
జగనన్న అమ్మ ఒడి పేద విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఆర్థిక సాయం చేసేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు.
జగనన్న అమ్మ ఒడి
పేద విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఆర్థిక సాయం చేసేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తారు.
లబ్ధిదారుల కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఉండాలి.
విద్యార్థుల హాజరు కనీసం 75 శాతం ఉండాలి.
స్వచ్ఛంద సంస్థల ద్వారా చదువుకుంటున్న అనాధ పిల్లలు, వీధి బాలలు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తారు.
ఎంతమంది పిల్లలున్నా, ఒక్కో లబ్ధిదారునికి రూ.15 వేలు మాత్రమే ఇస్తారు.
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ:
పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ఈ పథకం తెచ్చారు.
ఈ పథకం కింద ఒక్కో కుటుంబం ఏడాదికి రూ. 5 లక్షల వరకు పూర్తిగా ఉచిత వైద్యం పొందొచ్చు.
పుట్టుకతో చెవుడు ఉన్న చిన్నారులకైతే రూ.12 లక్షల వరకు వైద్య బీమా వర్తిస్తుంది.
క్యాన్సర్ బాధితులకు రూ. 5 లక్షలకు మించి ఎంత వ్యయమైనా ప్రభుత్వమే భరిస్తుంది.
ఈ పథకం కింద హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లోనూ కొన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు అవకాశం ఉంది.
చికిత్స తర్వాత కోలుకునేవారికి ఆరోగ్య సమస్య తీవ్రతను బట్టి రోజుకు రూ. 225 నుంచి రూ. 5వేల వరకు సాయం అందిస్తారు.
అర్హతలు:
లబ్ధిదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలకు మించకూడదు.
మాగాణి భూమి 12 ఎకరాల లోపు లేదా మెట్ట గానీ, మెట్ట, మాగాణి కలిపి గానీ 35 ఎకరాల లోపు ఉన్న వారికి వర్తిస్తుంది.
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు, పెన్షన్దారులకు వర్తించదు.
నాలుగు చక్రాల వాహనం ఒకటికి మించి ఉండకూడదు.
మున్సిపాలిటీలో మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణానికి మించిన భవనం ఉండకూడదు.
వైఎస్ఆర్ పెన్షన్ కానుక
60 ఏళ్లు దాటిన వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్లు, డప్పు కళాకారులు, హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులు, కుష్ఠు వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నెలవారీ పెన్షన్ అందిస్తారు.
కేటగిరిని బట్టి రూ. 2250 నుంచి రూ.10వేల వరకు పెన్షన్ ఇస్తారు.
అర్హతలు:
కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఉండాలి.
మాగాణి భూమి 3 ఎకరాల లోపు లేదా మెట్ట గానీ, మెట్ట, మాగాణి కలిపి గానీ 10 ఎకరాల లోపు ఉన్న వారికి వర్తిస్తుంది.
వైఎస్ఆర్ కాపు నేస్తం
కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన కుటుంబాల ఆర్థిక స్వావలంబన కోసం ఈ పథకం తెచ్చారు.
ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఐదేళ్లపాటు రూ.75వేల సాయం అందిస్తారు.
అర్హతలు:
కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలై ఉండాలి.
కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలకు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలకు మించకూడదు.
మాగాణి భూమి 3 ఎకరాల లోపు, లేదా మెట్ట గానీ, మెట్ట, మాగాణి కలిపి గానీ 10 ఎకరాల లోపు ఉన్న వారికి వర్తిస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి భవనం ఉండకూడదు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు, నాలుగు చక్రాల వాహనం (ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్కు మినహాయింపు ఉంది) ఉన్నవారు అనర్హులు.
పేదలకు ఇళ్లు:
ఇళ్ల స్థలాలు లేని పేద కుటుంబాలకు ఉచితంగా ఇంటి స్థలం, పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఈ పథకం తెచ్చారు.
ఈ పథకం కింద అర్హులైన వారికి 1.5 సెంట్ల భూమిని కేటాయిస్తారు.
అర్హతలు:
రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇల్లు గాని, ఇంటి స్థలం గానీ ఉండకూడదు.
ఇతర కేంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల లబ్ధిదారులకు వర్తించదు.
వ్యవసాయ భూమి 2.5 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్టకు మించి ఉండకూడదు.
వార్షిక వ్యక్తిగత ఆదాయం పట్టణాల్లో రూ. 3 లక్షలకు మించరాదు.
గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి.
జగనన్న చేదోడు
సొంత షాపు ఉన్న రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లకు ఆర్థిక చేయూతను ఇచ్చేందుకు ఈ పథకం పెట్టారు.
లబ్ధిదారులకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.
అర్హతలు:
బీసీ వర్గానికి చెందిన రజకులు, నాయీ బ్రాహ్మణులు, అన్ని కులాలకు చెందిన దర్జీ పనిచేసేవారు అర్హులు.
సొంతంగా షాప్ ఉండాలి. వారి పేరు మీదే అది రిజిస్టరై ఉండాలి.
కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఉండాలి.
మాగాణి భూమి 3 ఎకరాల లోపు లేదా మెట్ట గానీ, మెట్ట, మాగాణి కలిపి గానీ 10 ఎకరాల లోపు ఉన్న వారికి వర్తిస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి విస్తీర్ణమున్న భవనం ఉండకూడదు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు, నాలుగు చక్రాల వాహనం(ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్కు మినహాయింపు ) ఉన్నవారు అనర్హులు.
వైఎస్ఆర్ నేతన్న నేస్తం:
చేనేత మగ్గాల మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు.
సొంత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 24 వేల సాయం అందజేస్తారు. కుటుంబంలో ఎన్ని చేనేత మగ్గాలున్నా, ఒక్క మగ్గానికి వర్తించే సాయమే ఇస్తారు.
అర్హతలు:
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులై ఉండాలి.
సొంత మగ్గంపై పనిచేస్తూ, దానిపై జీవనోపాధి పొందుతున్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
ప్రాథమిక చేనేత సంఘాలు, మాస్టర్ వీవర్ షెడ్లలో పనిచేసే చేనేత కార్మికులు అనర్హులు.
కనీసం ఏడాదిగా సొంత మగ్గంపై పనిచేస్తున్న వారై ఉండాలి.
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన:
ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు చేయూతను ఇచ్చేందుకు ఈ పథకం తెచ్చారు.
అర్హులైన విద్యార్థులకు అన్ని కోర్సులకు విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తారు.
వసతి దీవెన కింద వసతి, భోజన ఖర్చుల కోసం రూ.20 వేలు ఇస్తారు. పాలిటెక్నిక్ కోర్సు చేస్తున్నవారికి రూ.15వేలు, ఐటీఐ కోర్సు చేస్తున్నవారికి రూ.10 వేలు ఇస్తారు.
అర్హతలు:
కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల లోపు ఉండాలి.
కుటుంబానికి మాగాణి భూమి 10 ఎకరాల లోపు.. లేదా మెట్ట గానీ, మెట్ట, మాగాణి కలిపి గానీ 25 ఎకరాల లోపు ఉన్న వారికి వర్తిస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో 1500 చదరపు అడుగులకు మించి విస్తీర్ణమున్న భవనం ఉండకూడదు.
కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు (పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉంది), ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లు ఉండకూడదు.
వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్:
పెట్టుబడి సాయం అందించడం ద్వారా రైతుల ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
భూమి ఎంత ఉందన్నదానితో సంబంధం లేకుండా అర్హులైన రైతులకు పీఎం కిసాన్ కింద వచ్చే రూ.6 వేలతో కలిపి మూడు వాయిదాల్లో ఏడాదికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తారు.
భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
అర్హతలు:
కౌలు రైతులైతే 'పంట సాగుదారు హక్కు ఒప్పంద పత్రం' సమర్పించడం తప్పనిసరి. అటవీ భూములను సాగు చేస్తున్న కౌలుదారులు.. ఇనాం, డి-పట్టా, దేవాదాయ శాఖ భూములను సాగు చేస్తున్న రైతులు కూడా
అర్హులే.
లబ్ధిదారుని కుటుంబంలో పెళ్లి కాని పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నా, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా పథకం వర్తిస్తుంది.
వైఎస్ఆర్ చేయూత:
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కోసం ఈ పథకం తెచ్చారు.
ఈ పథకం కింద ఒక్కో కుటుంబంలో ఓ మహిళకు ఏడాదికి రూ.18,750 వేల చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల సాయం అందిస్తారు.
అర్హతలు:
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలై ఉండాలి.
కుటుంబ నెలవారీ ఆదాయం రూ.10వేల లోపు ఉండాలి.
మాగాణి భూమి 3 ఎకరాల లోపు.. లేదా మెట్ట గానీ, మెట్ట, మాగాణి కలిపి గానీ 10 ఎకరాల లోపు ఉన్నవారికే వర్తిస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి భవనం ఉండకూడదు.
విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లకు మించకూడదు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు, నాలుగు చక్రాల వాహనం (ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్కు మినహాయింపు ) ఉన్నవారు అనర్హులు.
వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటున్న వారు అనర్హులు.
వైఎస్ఆర్ వాహనమిత్ర:
స్వయం ఉపాధి కోసం కొత్తగా ఆటో, ట్యాక్సీ వంటివి కొనుక్కున్నవారికి ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకం పెట్టారు.
లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున సాయం చేస్తారు.
అర్హతలు:
2020, మే 16లోగా వాహనం కొనుగోలు చేసి ఉండాలి.
భార్య పేరిట వాహనం కొనుగోలు చేసి నడుపుతున్న వారు కూడా అర్హులే.
లబ్ధిదారులకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండటం తప్పనిసరి.
ట్రాక్టర్, లైట్ లోడెడ్ వాహనాలకు ఈ పథకం వర్తించదు.