తెలంగాణలో తగ్గనున్న సాగు భూమి

తెలంగాణలో సాగు భూమి తగ్గిపోతోంది. రెండు దశాబ్దాలుగా హెచ్ఎండీఏ పరిధిలో వ్యవసాయేతర భూముల వినియోగం పదింతలు పెరిగింది. వేలాదిగా లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. పారిశ్రామీ కరణ కూడా జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం సులభతర వాణిజ్యంలో భాగంగా భూ మార్పిడికి మరింత వెసులుబాటు కల్పించనుంది. ఇప్పటి దాకా ఉన్న విధానాలను సరళతరం చేయనుంది. ఈ మేరకు తాజాగా జరిగిన రాష్ట్ర కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. ఫలితంగా అనేక మార్పులు సంభవించనున్నాయి. దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయేతర భూ మార్పిడిలో […]

Update: 2020-10-11 22:29 GMT

తెలంగాణలో సాగు భూమి తగ్గిపోతోంది. రెండు దశాబ్దాలుగా హెచ్ఎండీఏ పరిధిలో వ్యవసాయేతర భూముల వినియోగం పదింతలు పెరిగింది. వేలాదిగా లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. పారిశ్రామీ కరణ కూడా జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం సులభతర వాణిజ్యంలో భాగంగా భూ మార్పిడికి మరింత వెసులుబాటు కల్పించనుంది. ఇప్పటి దాకా ఉన్న విధానాలను సరళతరం చేయనుంది. ఈ మేరకు తాజాగా జరిగిన రాష్ట్ర కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. ఫలితంగా అనేక మార్పులు సంభవించనున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయేతర భూ మార్పిడిలో రెవెన్యూ అధికారుల విచక్షాణాధికారాలకు ప్రభుత్వం కోత పెట్టింది. నాలా చట్టానికి సవరణ చేస్తూ కేబినెట్ తీర్మానించింది. అధికారి విచక్షణాధికారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు మానవరహిత ఆమోదం తెలిపేటట్లుగా మార్పులు తీసుకొచ్చింది. ఈ మేరకు ఆర్వోఆర్ యాక్టులో సవరణలను సూచించింది. ధరణి పోర్టల్ ద్వారా సంబంధిత వివరాలను అందచేస్తూ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పించింది.

రేపటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు చట్ట సవరణ చేయనున్నారు. ఈ నిర్ణయం కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూరనుందని నిపుణుల అభిప్రాయం. వాళ్ల దరఖాస్తుల పరిష్కారానికి కాలయాపన జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు, రెవెన్యూ సిబ్బంది ప్రమేయం లేకుండానే మార్పిడి ‘ధరణి’ పోర్టల్ లోనే జరిగిపోయేట్లుగా సరికొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018లోనే అమల్లోకి తీసుకురావడం గమనార్హం.

పొరుగున ఉన్నదే ఇది…

ఆంధ్రప్రదేశ్ లో నాలా కన్వర్షన్ కూడా మీ సేవ కేంద్రాల ద్వారానే నిర్వహిస్తున్నారు. సీసీఎల్ఏ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్రపునీత ఈ మేరకు వెసులుబాటు కల్పించారు. ఎంటర్ప్రెన్యూర్ల ను ప్రోత్సహించేందుకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణాలు, పల్లెల్లో వేర్వేరుగా ఓటీసీ ట్యాక్స్ లను నిర్ధారించారు. రిజిస్ట్రేషన్ విలువలో పట్టణాలకు రెండు శాతం, ఇతర ప్రాంతాలకు మూడు శాతం చెల్లించి మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసి, ఫీజు చెల్లిస్తే మార్పిడి జరిగినట్లుగానే భావించాలి. మూడు నెలలకోసారి రెవెన్యూ అధికారులు సమీక్షిస్తారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే నోటీసులు జారీ చేస్తారు.

తెలంగాణలో ప్రస్తుతం…

ఎవరైనా తన వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకోవాలంటే నాలా చట్టం 2006 కింద మీ సేవ ద్వారా ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి తహశీల్దార్ ఆఫీసుకి ఆన్లైన్లో ఫార్వార్డ్ అవుతుంది. అప్పుడు అర్జీదారు మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్, ఈసీ, ఆ భూమి తనదే అని తెలిపే ఆధార పత్రాలు, ఇతర లింక్ డాక్యుమెంట్లు, అది పట్టా భూమి అని నిర్ధారించి పాత ఫోలియో పహాణీలు సమర్పించాలి. మండల సర్వేయర్ మోఖాపై పరిశీలన చేస్తారు.

అనంతరం తహశీల్దార్ సమగ్ర విచారణ నివేదికని ఆర్డీఓకు సమర్పిస్తారు. అప్పుడు ఆర్డీఓ మోఖాపై పరిశీలన చేసి, అది వ్యవసాయ భూమి అయితే 3%, లేదా అప్పటికే దానిపై వ్యవసాయేతర కార్యకలాపాలు ఉంటే పెనాల్టీ కలుపుకొని 4.5% మార్కెట్ వ్యాల్యూయేషన్తో ఫీజు చెల్లించమని డిమాండ్ నోటీసు ఇస్తారు. అర్జీదారు ఆ పన్ను మొత్తం చెల్లిస్తే వారికి నాలా చట్టం 2006 ప్రకారం అనుమతి లభిస్తుంది.

ఇప్పుడేమో ఇష్టారాజ్యంగా…

ఇప్పుడు పచ్చటి పొలాల మధ్య కూడా వ్యవసాయేతర వినియోగానికి అవకాశం లభిస్తుంది. పక్కవాళ్లతో ఎలాంటి సంబంధం లేకుండా ఏ రీతినైనా వినియోగించుకునే వెసులుబాటు కార్పొరేట్, పారిశ్రామిక శక్తులకు లభించనుందని రెవెన్యూ నిపుణుల అభిప్రాయం. మానవరహితంగానే ధరణి పోర్టల్ లోనే పూర్తిస్థాయిలో మార్పిడి జరిగిపోతుంది. ఏ అధికారి ప్రమేయం ఉండదని నిర్ణయించారు. క్షేత్ర స్థాయి పరిశీలనేదీ ఉండదన్న మాట. ఎక్కడైనా వెంఛర్లు రావచ్చు. ఏ ప్రాంతంలోనైనా పరిశ్రమలు రావడానికి అవకాశాలు ఉన్నాయంటున్నారు. భూ సేకరణ చట్టంలోనూ పరిమితులు ఉన్నాయి.

రాష్ట్రం మొత్తం భూభాగంలో భూ సేకరణ పరిమితి కర్నాటకలో ఒక్క శాతం, ఆంధ్రప్రదేశ్ లో 10 శాతం, తెలంగాణలో 10 శాతంగా ఉంది. వ్యవసాయేతర వినియోగంలో అపరిమితం చేయడం వల్ల భవిష్యత్తులో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లనుందని నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. భూ వినియోగం సాగుకైతే ఎంతటికైనా మంచిదే. ఇతర వినియోగంలో పరిమితులను నిర్ధేశించుకోకపోతే భావితరాలకు ప్రమాదం వాటిల్లుతుందన్నారు. షరతులను పెట్టుకోకపోతే సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది.

Tags:    

Similar News