రెస్టారెంట్ లో దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్
మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 3 వ తేదీ రాత్రి సమయంలో మిస్టర్ టి రెస్టారెంట్లో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ ఫణిందర్ తెలిపారు.
దిశ, ఆదిలాబాద్ : మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 3 వ తేదీ రాత్రి సమయంలో మిస్టర్ టి రెస్టారెంట్లో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ ఫణిందర్ తెలిపారు. ఈ మేరకు మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఇందులో దొంగతనం చేసిన వ్యక్తి కుంబోజు రాజేష్ ను, అతనికి సహకరించిన బాలుడుని అదుపులోకి తీసుకొని వారిద్దరి నుంచి రూ.5 వేల నగదు, రెండు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో రెండో వ్యక్తి అయిన బాలుడు అదే రెస్టారెంట్లో వర్కర్ గా పని చేస్తున్నాడని పేర్కొన్నారు. అతని సహకారంతోనే కుంబోజు రాజేష్ మిస్టర్ టీ రెస్టారెంట్లో పదిహేను వేల రూపాయలు దొంగతనం చేసినట్లు సీఐ తెలియజేశారు. దొంగతనం చేసిన డబ్బులను వారి జల్సాలకు ఖర్చు పెట్టుకోగా, మిగిలిన డబ్బులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా ఈ కేసులో కుంబోజు రాజేష్ ను రిమాండ్ కు పంపించినట్లు పేర్కొన్నారు. మైనర్ బాలుడిని జువెనైల్ హోం కు పంపించినట్టు చెప్పారు.
వ్యాపారస్తులకు, దుకాణదారులకు పోలీసు వారి సూచన
వ్యాపారస్తులు ఎవరూ కూడా తమ దుకాణాల కౌంటర్లో డబ్బులు ఉంచి రాత్రిపూట తాళం వేసుకొని వెళ్లొద్దన్నారు. కౌంటర్లో ఉన్న డబ్బులు అన్నీ తీసుకొని వెళ్లాలని కోరారు. గత నెలలో సాగర్ సూపర్ మార్కెట్లో జరిగిన దొంగతనంలో కూడా ఆ షాప్ లో పనిచేసే వర్కర్ దొంగతనం చేశారని తెలిపారు. ఆ కేసును ఛేదించి అతన్ని రిమాండ్ చేశామని అన్నారు. విలేకరుల సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ రమణయ్య, కానిస్టేబుల్ కరీం, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.