తొర్రూర్ లో విషాదం.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్ఎంపీ డాక్టర్..!
ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆర్ఎంపీ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన తొర్రూర్ మండల పరిధిలో శనివారం జరిగింది.
దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆర్ఎంపీ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన తొర్రూర్ మండల పరిధిలో శనివారం జరిగింది. ఎస్ఐ లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తొర్రూర్ మండల కేంద్రానికి చెందిన ఎస్.కే జామాలొద్దిన్ (46) ఆర్ఎంపీ డాక్టర్ గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కుటుంబ పోషణ నిమిత్తం గత కొంతకాలంగా అప్పులు చేస్తూ వచ్చాడు. దీంతో అప్పు సుమారు రూ .15 లక్షలకు చేరింది. అప్పు తీర్చలేననే ఆందోళనతో గతంలో పలుమార్లు ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు.
ఇది ఇలా ఉండగా జామాలొద్దిన్ శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయి, తాను చనిపోతున్నానని తన కోసం వెతకొద్దని భార్య గౌసియా బేగంకు మెసేజ్ పెట్టాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు జామాలొద్దిన్ ఆచూకీ కోసం వెతికారు. కాగా స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని మృతి చెంది ఉన్న మృతదేహాన్ని గుర్తించిన మార్కెట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. జామాలొద్దిన్ మృతదేహంగా గుర్తించి పోస్ట్ మార్టంకు తరలించారు. భార్య గౌసియా బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.