పంపుసెట్ల సర్వీస్ వైర్లు చోరీ
వ్యవసాయ పంపుసెట్లకు అమర్చుకున్న సర్వీస్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన శంకరపట్నం మండలంలో చోటు చేసుకుంది.
దిశ, శంకరపట్నం : వ్యవసాయ పంపుసెట్లకు అమర్చుకున్న సర్వీస్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన శంకరపట్నం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన పాలేటి చిన్న కనకయ్య, పాలేటి భిక్షపతి, చింతం నాగయ్య అనే రైతులు ఎస్సారెస్పీ కాలువ వద్ద ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ పంపుసెట్ల సర్వీస్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.
జనవరి ఒకటి నుంచి కాల్వకు నీరు రానున్న నేపథ్యంలో వ్యవసాయ పంపుసెట్ల వద్ద కు వెళ్లి పరిశీలించుకునేసరికి సర్వీస్ వైరు కనిపించకపోవడంతో లబోదిబోమన్నారు. అసలే ఆర్థిక కష్టాలలో ఉన్న రైతులకు దొంగల బెడద కూడా ఎక్కువైందని, గతంలో పలుమార్లు వ్యవసాయ పంపుసెట్లతో పాటుగా స్టార్టర్ డబ్బాలను ఎత్తుకెళ్లిన సంఘటనలు ఉన్నాయని పోలీసులు ఓ కన్నేసి ఉంచాలని రైతులు వేడుకుంటున్నారు. ముగ్గురు రైతులకు చెందిన దాదాపు 6 వేల రూపాయల విలువగల కేబుల్ వైర్ లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు.