కారులో దర్జాగా వెళ్లి టవర్ల బ్యాటరీల చోరీ.. ఇద్దరి అరెస్టు
కారులో దర్జాగా వెళ్లి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి: కారులో దర్జాగా వెళ్లి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. త్రీ టౌన్ సీఐ భాను ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా తాతానగర్‌కు చెందిన మాదాసు వినోద్, నాగర్ కర్నూల్ జిల్లా సిర్సినగండ్లకు చెందిన గార్లపాటి భాస్కర్ రెడ్డి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. సిద్దిపేట రంగధాంపల్లి చౌరస్తా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో మోటార్ బైక్ నడుపుతున్న వ్యక్తి పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వ్యక్తిని పట్టుకొని విచారించగా బీఎస్‌ఎన్‌ఎల్ టవర్స్ వద్ద బ్యాటరీలు దొంగతనం చేసిన కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపాడు. పోలీసులు లోతుగా విచారించగా తన స్నేహితుడు కూడా కారులో వెనుక వస్తున్నట్లు తెలిపాడు.
ఇద్దరం కలిసి దొంగతనాలకు వెళ్లుతున్నామన్నాడు. మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా గతంలో ఇద్దరు కలిసి కరీంనగర్ ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్‌లో పీడి యాక్ట్‌లో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలై మళ్లీ దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపాడు. సిద్దిపేట జిల్లా పరిధిలోని బందారం గ్రామంలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ నుండి బ్యాటరీలను, కోహెడ మండలంలోని రామచంద్రాపూర్ గ్రామంలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ బ్యాటరీలను దొంగలించి హైదరాబాద్‌లో అమ్మిన్నట్లు తెలిపారు. ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ భానుప్రకాష్ తెలిపారు. నిందితుల వద్ద కారు, పల్సర్ వాహనం, రూ.50వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు శ్రీనివాస్ ఆశోక్, వేణుగోపాల్‌లను సీఐ అభినందించారు.