లంచం డిమాండ్ చేసిన అధికారికి నాలుగేళ్లు జైలు
లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు పట్టుబడిన అధికారికి కరీంనగర్ జిల్లా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 8 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పును వెలువరించారు.
దిశ, కరీంనగర్ లీగల్ : లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు పట్టుబడిన అధికారికి కరీంనగర్ జిల్లా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 8 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పును వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు అదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం ముత్యంపెల్లి గ్రామానికి చెందిన ఐలి సురేందర్ గ్రామంలో ఫెర్టిలైజర్ షాపు నిర్వహిస్తుండగా షాపు నిర్వహణకు ఇబ్బంది కలిగించకుండా ఉండడంతో పాటు ఆఫీషియల్ గా ఫేవర్ చేయడానికి డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ తొగరి పోచయ్య రూ. 4 వేలు డిమాండ్ చేయగా సురేందర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
కాగా 2013 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన బాధితుడు సురేందర్ పోచయ్య కు లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కోర్టులో చార్జి షీటు దాఖలు చేయగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిషోర్ కుమార్ సాక్షులను విచారించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి నిందితుడు పోచయ్య నేరం చేసినట్లు రుజువు కావడంతో నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 8 వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.