మానసిక ఒత్తిడితో విద్యార్ధుల సూసైడ్..

నిబంధనలకు విరుద్దంగా తరగతులు నిర్వహించడం, పరీక్షలు పెట్టడం, రిజల్ట్స్​ చూడటం, అనుకున్న స్థాయిలో మార్కులు రాని విద్యార్థుల పై ప్రత్యేక నిఘా పెట్టడం, సమయంతో సంబంధం లేకుండా నిత్యం చదివించడంతో విద్యార్ధులు మానసిక ఒత్తిడికి గురై సూసైడ్ చేసుకుంటున్నారు.

Update: 2024-10-23 03:02 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో : నిబంధనలకు విరుద్దంగా తరగతులు నిర్వహించడం, పరీక్షలు పెట్టడం, రిజల్ట్స్​ చూడటం, అనుకున్న స్థాయిలో మార్కులు రాని విద్యార్థుల పై ప్రత్యేక నిఘా పెట్టడం, సమయంతో సంబంధం లేకుండా నిత్యం చదివించడంతో విద్యార్ధులు మానసిక ఒత్తిడికి గురై సూసైడ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే కేవలం నారాయణ కాలేజీల్లోనే ఈ సంఘటనలు పునరావృతమవుతున్నాయని విమర్శలు ఉన్నాయి. అయినప్పటికి ఇంటర్‌మీడియట్ విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నారాయణ కాలేజీలు ఉమ్మడి రంగారెడ్డి, హైదారాబాద్ జిల్లాలో ఎన్ని ఉన్నాయి.. ఎన్ని కళాశాలలకు హాస్టల్స్ పర్మిషన్ ఉన్నాయనే వివరాలు ఇవ్వడంతో అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారనే టాక్ వినబడుతుంది. ఇంటర్మీడియట్ అధికారులు కేవలం కాలేజీ నడిపించుకోవడానికే అనుమతినిస్తారు. కానీ హాస్టల్స్ అనుమతి ఎవరిస్తారనేది పెద్దగా ప్రశ్నగా మారిపోయింది. ఇలాంటి అనుమతిలేని కాలేజీ హాస్టల్‌లలో తల్లిదండ్రులు విద్యార్థులను చేర్పించి వారి భవిష్యత్తుకు భరోసా లేకుండా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చదువు పేరుతో మానసిక ఒత్తిడి..

మేము చదువు చెప్పినట్లు ఏ విద్యాసంస్థ చదువు చెప్పదనే విధంగా నారాయణ జూనియర్ కాలేజీలు రాష్ట్రంలో ప్రచారం చేసుకుంటూ ప్రజలను తమవైపు తిప్పుకునేలా ఆకర్షనీయమైన కోర్సులు పెడుతున్నట్లు డబ్బాలు కొట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీటికి ఆకర్షితులైన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను కాలేజీలలో చేర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కళాశాలల యాజమాన్యం అనునిత్యం చదవాలని ఒత్తిడి చేస్తుండడంతో వారు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చదువుకుని తల్లిదండ్రులకు భరోసా కల్పించాల్సిన విద్యార్ధులు ఒత్తిడిని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నట్లు తెలిసింది.

విధులకు ప్రభుత్వ అధికారులు దూరం..

కార్పొరేట్ స్థాయి పరిధిలో జరిగే హై స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ నిబంధనలకు లోబడి పనిచేస్తున్నాయా లేదా అనేదాని పై విద్యాశాఖాధికారుల పర్యవేక్షణ కొరవడింది. కేవలం నెల నెలా మామూళ్లు, ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర ప్రైవేట్ విద్యా సంస్థల ద్వారా చందాలు వసూళ్లు చేయడం అధికారులకు అలవాటుగా మారిపోయిందని తెలిసింది. వీటికి అలవాటు పడ్డ కొందరు అధికారులు ఆ సంస్థలు చేసే తప్పిదాలు, లోపాలను ఎత్తిచూపించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 95 నారాయణ జూనియర్ కాలేజీలున్నట్లు తెలుస్తుంది. ఇందులో కేవలం 32 కాలేజీలకే ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి అనుమతి ఉందని అధికారులు తెలిపారు. మిగిలినవి గుర్తింపు లేని కళశాలలేనని తెలుస్తోంది. అయితే ఏ కాలేజీకి పర్మిషన్ ఉంది.. ఏ కాలేజీ వద్ద హాస్టల్స్ వసతి ఉన్నాయనే సమాచారం లేదు. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నిఘా పెట్టి అనుమతిలేని కళశాలల పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థులు సూసైడ్ చేసుకున్న ఘటనలు..!

1. అబ్ధుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామంలోని నారాయణ జూనియర్ బాయ్స్ కాలేజీలో గీరీష్ అనే విద్యార్థి మృతి చెందాడు. చదువు ఒత్తిడి భరించలేక కాలేజీ నుంచి పారిపోయేందుకు ప్రహరీ గోడ దూకే సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడిక్కడ మృతిచెందాడు.

2. శేరిలింగంపల్లి మండల మాదాపూర్‌లోని నారాయణ జూనియర్ బాయ్స్ కాలేజీలో వైభవ్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు.

3. కొత్తపేట్ మండల పరిధిలోని గర్ల్స్ క్యాంపస్‌లో సెంకడ్ ఇయర్ విద్యార్ధి మృతిచెందారు.

4. కూకట్‌పల్లి మండలం బాచుపల్లి రెవెన్యూ పరిధిలోని నారాయణ జూనియార్ కాలేజీ విద్యార్థి అనుష్ సూసైడ్ చేసుకున్నాడు.


Similar News