జల్​పల్లి లో యువకుడి ఆత్మహత్య..?

హిజ్రాతో లైంగిక సంబంధం కొనసాగిస్తున్న ఆటో డ్రైవర్​తో రాత్రంతా తిరిగాక వెళ్లిపోమన్నందుకు తీవ్ర మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పహాడిషరీఫ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది.

Update: 2023-05-09 17:03 GMT

దిశ, బడంగ్​పేట్​: హిజ్రాతో లైంగిక సంబంధం కొనసాగిస్తున్న ఆటో డ్రైవర్​తో రాత్రంతా తిరిగాక వెళ్లిపోమన్నందుకు తీవ్ర మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పహాడిషరీఫ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. ఇది ఇలా ఉండగా తమ కుమారుడిది ముమ్మాటికి హత్యే అంటూ మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పహాడిషరీఫ్​ ఇన్​స్పెక్టర్​ విశ్వనాథ్​ తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్​నగర్​ ప్రాంతానికి చెందిన మొహమ్మద్​ అజహర్​ (23), వృత్తి రిత్యా ఆటో డ్రైవర్​. జల్​పల్లికి చెందిన హిజ్రా సోఫియా బకాష్​ (25) తో గత 9 నెలలుగా లైంగిక సంబంధం కొనసాగిస్తున్నాడు.

హిజ్రా సోఫియా బకాష్​ జల్​పల్లిలో నాలుగు రోజుల క్రితం ఓ గది అద్దెకు తీసుకుంది. దీంతో ఈ నెల 8వ తేదీన అజహర్​ హిజ్రా సోఫియా ఇంటికి వచ్చాడు. రాత్రి 10గంటలకు వారిద్దరు కలిసి ఆటోలో బయటికి వెళ్లారు. 9వ తేదీన తెల్లవారు జామున 4.30గంటలకు తిరిగి ఇంటికి చేరుకున్నారు. దీంతో అప్పటి వరకు బాగానే ఉన్న హిజ్రా సోఫియా ఇక నువ్వు ఇంటికి వెళ్లి పోవాలని అజహర్​పై కోపడింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని అజహర్​పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అజహర్​ ఆమె ఉండే గదిలోకి వెళ్లి డోర్​ను పెట్టుకున్నాడు.

10 నిమిషాల వరకు అజహర్​ బయటికి రాకపోవడంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్​కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం కనిపించింది. తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే అజహర్​ మృతి చెంది ఉండడం కనిపించింది. మృతుని తండ్రి ఆన్వర్ ఫిర్యాదు మేరకు పహాడిషరీప్ పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. తమ కుమారుడిది ముమ్మాటికి హత్యేనంటూ మృతుని తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ కేసును పహాడిషరీఫ్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News