ఐపీఎస్, ఆర్మీ ఆఫీసర్ ను అంటూ లక్షలు దోచిండు.. చివరికి ఏమైందంటే..?
నకిలీ ఐపీఎస్ అవతారమెత్తి అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిని శంషాబాద్ జోన్ ఎస్వోటీ అధికారులు మాదాపూర్ పోలీసులతో కలిసి మంగళవారం రాత్రి అరెస్టు చేశారు.
దిశ తెలంగాణ బ్యూరో/శేరిలింగంపల్లి: నకిలీ ఐపీఎస్ అవతారమెత్తి అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిని శంషాబాద్ జోన్ ఎస్వోటీ అధికారులు మాదాపూర్ పోలీసులతో కలిసి మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. నిందితుని నుంచి 7.65 దేశవాళీ పిస్టల్, 9 బుల్లెట్లతో పాటు నాలుగు మ్యాన్ ప్యాక్‌లు, ఐపీఎస్ అధికారుల యూనిఫాంపై ఉండే చిహ్నాలు, తెలంగాణ, ఢిల్లీ పోలీసు అధికారి పేరిట తయారు చేసుకున్న ఏడు గుర్తింపు కార్డులతోపాటు పదివేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీనివాస్‌రావు బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం భీమవరం జిల్లా చిక్కాల గ్రామానికి చెందిన నాగరాజు కార్తిక్ రఘువర్మ ఎలియాస్ కార్తిక్(25)కు చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలన్నది కల. భీమవరంలోని ఎస్ఆర్కే కాలేజీ నుంచి 2016లో బీఏ పూర్తి చేసిన కార్తిక్ ఆ తరువాత హైదరాబాద్ వచ్చాడు. సనత్‌నగర్‌లోని పాషా ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పని చేస్తూ పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు రాశాడు. అయితే పరీక్షల్లో అర్హత సాధించలేకపోయాడు. ఆ తరువాత ట్రావెల్స్‌కు చెందిన ఇన్నోవా కారుతో ఉడాయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సనత్ నగర్ పోలీసులు కార్తిక్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆరునెలల తరువాత బెయిల్‌పై బయటకు వచ్చిన కార్తిక్ కొన్నాళ్లపాటు మహారాష్ర్టలో బోర్వెల్ ఆపరేటర్‌గా ఉద్యోగం చేశాడు.
2018లో హైదరాబాద్ తిరిగి వచ్చి వరిస్టా ఇన్ఫోకామ్ కంపెనీ యజమాని రాధాకృష్ణ వద్ద కారు డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరాడు. మూడు నెలల తరువాత యజమానికి చెందిన కారుతో ఉడాయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పంజగుట్ట పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు రిమాండ్ చేశారు. మళ్లీ బెయిల్‌పై వచ్చిన కార్తిక్ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో ఉన్న ఎక్స్పర్ట్ సెక్యూరిటీ సర్వీసెస్‌లో గార్డుగా చేరాడు. అక్కడ కార్తిక్‌కు మాజీ ఆర్మీ అధికారి బిక్కుదర్ దాస్‌తో పరిచయం ఏర్పడింది. ఇలా పరిచయమైన దాస్ నుంచి ఆర్మీ ఆఫీసర్ల ర్యాంకులు, యూనిఫాం, వాళ్లు ధరించే బ్యాడ్జీలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాడు. అనంతరం పారస్ఎఫ్ రెజిమెంట్ మేజర్ ర్యాంకులో యూనిఫాం తయారు చేయించుకున్నాడు.
స్వస్థలానికి వెళ్లి..
ఆ తరువాత స్వస్థలానికి వెళ్లి బంధువులు, స్నేహితులతో తాను పారస్ఎఫ్ రెజిమెంట్‌కు మేజర్‌గా సెలెక్ట్ అయినట్టు చెప్పుకొన్నాడు. అనంతరం సైనిక్ డిఫెన్స్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి స్థానిక యువకుల నుంచి డబ్బు వసూలు చేస్తూ ట్రైనింగ్ ఇవ్వటం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన పోడూర్ పోలీసులు విచారణ జరుపగా కార్తిక్ నకిలీ ఆఫీసర్ అని వెల్లడైంది. దాంతో అతనిపై కేసులు పెట్టిన పోడూర్ పోలీసులు జైలుకు రిమాండ్ చేశారు. ఆ తరువాత కొన్నాళ్లకు కార్తిక్బెయిల్పై విడుదలయ్యాడు.
2020లో మళ్లీ హైదరాబాద్‌కు
2020లో హైదరాబాద్‌కు తిరిగొచ్చిన కార్తిక్ ఆర్థికంగా స్థిరపడ్డ మధుసూదన్‌రావు అనే వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజాలని పథకం వేశాడు. ముగ్గురు సహచరులతో కలిసి బంజారాహిల్స్‌లోని మధుసూదన్‌రావు వద్దకు వెళ్లి తమను తాము ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన పోలీసు అధికారులుగా పరిచయం చేసుకున్నాడు. మధుసూదన్‌రావు ఇంట్లో సోదాలు జరిపినట్టు నటించి లక్ష రూపాయలతో ఉడాయించాడు. ఈ మేరకు పంజగుట్ట స్టేషన్లో కార్తిక్‌తోపాటు అతని సహచరులపై కేసులు నమోదయ్యాయి.
కిడ్నాప్‌లు
ఆ తరువాత కార్తిక్ తన సహచరులతో కలిసి శ్రీసాయి అంబులెన్స్ సర్వీసెస్ యజమాని శ్రీనివాస్ ముదిరాజ్ ఆయన కుమారుడు సాయి నిఖిల్‌ను కిడ్నాప్ చేశాడు. తమను తాము ఇంటెలిజెన్స్ అధికారులమని చెప్పి వారి నుంచి యాభైవేల రూపాయలు తీసుకుని విడిచిపెట్టాడు. ఈ మేరకు బాధితులు ఫిర్యాదు చేయగా ఆర్సీపురం పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేశారు. ఆ తరువాత తనను తాను ఆర్మీ కల్నల్‌గా చెప్పుకొన్న కార్తిక్ మియాపూర్ మదీనాగూడలో ఐ హెల్త్‌కేర్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా కూడా హాజరయ్యాడు. దీనికోసం ఆస్పత్రి యాజమాన్యం నుంచి లక్షా 30వేల రూపాయలు కూడా తీసుకున్నాడు. వచ్చింది నకిలీ ఆఫీసర్ అని తెలిసి ఆస్పత్రి వర్గాలు ఫిర్యాదు చేయగా మియాపూర్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.
ఆ తరువాత తనకు పరిచయం ఉన్న అనిల్‌కుమార్ అనే వ్యక్తి చెప్పిన మేరకు సహచరులైన దీపక్‌కుమార్, పైలా స్వామి సత్యనారాయణతో కలిసి తమను తాము పోలీసు అధికారులుగా చెప్పుకొని కూకట్‌పల్లిలోని ఫోరం మాల్ వద్ద నుంచి దిలీప్‌కుమార్ అనే వ్యక్తిని కారులో కిడ్నాప్ చేశాడు. అతన్ని సూర్యాపేట బస్టాండ్ వద్దకు తీసుకెళ్లి దేశవాళీ పిస్టల్‌తో బెదిరించి దగ్గరున్న లక్షా 90వేల రూపాయల నగదును దోచుకుని అక్కడే విడిచిపెట్టి పరారయ్యాడు. ఈ మేరకు కేపీహెచ్‌బీ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో కార్తిక్‌ను అరెస్టు చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు రిమాండ్ చేశారు.
విడుదలైన తరువాత
2022, జూలైలో జైలు నుంచి విడుదలైన తరువాత కార్తిక్ స్వస్థలానికి వెళ్లిపోయాడు. అక్కడ ఓ సెక్స్ వర్కర్‌ను తాను రాజమండ్రి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్నని బెదిరించి 50వేల రూపాయలను దోచుకున్నాడు. గంజాయి స్మగ్లింగ్ దందాలో ఉన్న శివ అనే వ్యక్తిని ఓ హోటల్‌కు తీసుకెళ్లి గదిలో నిర్భంధించి తాను పోలీస్అధికారినని చెప్పి ఇంటరాగేషన్ పేర చిత్రహింసలు పెట్టాడు. అతని నుంచి 30వేలు తీసుకుని వదిలిపెట్టాడు. ఆ తరువాత రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏలూరుకు చెందిన పలువురిని మోసం చేసిన మేకపాటి రవిశంకర్‌ను పట్టుకుని తనను తాను పోలీసు అధికారిగా చెప్పుకొని 2లక్షలు తీసుకున్నాడు.
అంతటితో ఆగకుండా న్యాయం చేసి డబ్బులు వాపసు ఇప్పిస్తానని బాధితులను నమ్మించి వారి నుంచి మరో 3లక్షల 70వేల రూపాయలు తీసుకున్నాడు. ఆ తరువాత రవిశంకర్కుటుంబసభ్యులను కలిసి అతను మోసం చేసిన వారు చంపాలని చూస్తున్నట్టు చెప్పాడు. ఎలాగైనా కాపాడాలని వాళ్లు కోరగా డబ్బు తీసుకుని రవిశంకర్‌ను ఎన్కౌంటర్ చేసినట్టు డ్రామా ఆడి దానిని వీడియో రికార్డింగ్ చేసి అతని చేతుల్లో మోసపోయిన వారికి చూపించాడు.
జైలు పరిచయంతో
జైల్లో ఉన్నపుడు పరిచయం అయిన యశ్వంత్ అనే ఖైదీ మిత్రుడు పాశ్వాన్‌ను కలిసిన కార్తిక్ అతను ఇచ్చిన సమాచారం మేరకు జనవరిలో జార్ఖండ్ రాష్ర్టం కుండా గ్రామానికి వెళ్లి దేశవాళీ పిస్టల్, బుల్లెట్లు కొని తిరిగి వచ్చాడు. మార్చిలో పోలీస్ యూనిఫాం, బ్యాడ్జీలు, వాకీటాకీ, పోలీస్ ఫ్లాష్‌లైట్ తదితర వాటిని మదీనా ప్రాంతంలో కొనుగోలు చేశాడు. దాంతోపాటు చేతులకు వేసే సంకెళ్లు, లాఠీలు, పిస్టల్ పౌచ్ తదితర వాటిని కూడా కొన్నాడు. ఆ తరువాత కుమార్ అనే వ్యక్తి చెప్పాడని ప్రసాద్ ను ఇన్స్పెక్టర్నని బెదిరించాడు. నీపై ఫిర్యాదులు ఉన్నాయని, చర్యలు తీసుకోకుండా ఉండాలంటే 14లక్షలు ఇవ్వాలని డిమాండ్చేశాడు.
చివరకు 30వేల రూపాయలు తీసుకున్నాడు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్లమంటూ సహచరులైన శ్రీశైలం, స్వామిలతో కలిసి గాంధీనగర్‌లో నివాసముంటున్న గోస్లా జ్యోత్స్నను కిడ్నాప్ చేసి జార్ఖండ్ రాష్ర్టం దేవ్ఘడ్ తీసుకెళ్లి 9లక్షల రూపాయలు వసూలు చేశాడు. రద్దీగా ఉండే బస్టాపులు, ఎయిర్‌పోర్టు, పబ్లిక్స్థలాల్లో మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తిరుగుతూ తనను తాను ఎస్వోటీ అధికారినని బెదిరిస్తూ పలువురి నుంచి డబ్బు వసూలు చేసేవాడు. కార్తిక్ గురించిన సమాచారాన్ని పక్కాగా సేకరించిన శంషాబాద్ ఎస్వోటీ, మాదాపూర్పోలీసులు కలిసి మంగళవారం రాత్రి అతన్ని అరెస్టు చేశారు.