ప్రీతిది హత్యా.. ఆత్మహత్యా.. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఏముంది..?

రాష్ట్రంలో సంచలనం సృష్టించి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ సిద్ధమైంది.

Update: 2023-03-04 04:51 GMT

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని ప్రీతి విషాదాంతంలో మిస్టరీ మరికొన్ని గంటల్లో వీడనుంది. ఆమెది హత్యనా? ఆత్మహత్యా? అన్నది తేలనుంది. ఇటీవల జరిగిన ప్రీతి మృతి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. సీనియర్ సైఫ్ వేధింపులు భరించలేక ప్రీతి ఆత్మహత్య చేసుకుందంటూ వరంగల్ కమిషనర్ రంగనాథ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే, ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్య అని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ప్రీతి పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారింది. తాజాగా ప్రీతికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక వరంగల్ పోలీసుల చేతికి అందినట్టు విశ్వసనీయ సమాచారం.

ఆ ఇంజక్షనే కారణమా..?

ఫోరెన్సిక్ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం సక్సీనైల్కొలిన్ అన్న ఇంజక్షనే కారణం అని తెలుస్తోంది. సాధారణంగా కండరాలను రిలాక్స్ చెయ్యటానికి దీనిని ఉపయోగిస్తారు. ప్రీతి చనిపోయిన తరువాత ఆమెకు చెందిన అనస్తీషియా ఎమర్జెన్సీ కిట్ నుంచి పోలీసులు ఈ ఇంజక్షన్‌కు చెందిన ఖాళీ సీసాను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

దీంతో పాటు ఫెంటానైల్ అనే మందు ఖాళీ సీసాను కూడా సీజ్ చేశారు. దీనిని సర్జరీ తరువాత పెయిన్ రిలీఫ్ కోసం ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే ప్రీతి రక్తపు నమూనాలు సేకరించి టాక్సాలాజీ పరీక్ష నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపించారు. అక్కడ జరిపిన పరీక్షల్లో సక్సీనైల్కొలిన్ ఇంజక్షనే ప్రీతి మరణానికి కారణమని వెళ్లడయినట్టు విశ్వసనీయ సమాచారం.

కాగా, టాక్సాలాజి పరీక్షపై ఇప్పటికే ప్రీతి సోదరుడు అనుమానాలు వ్యక్తం చేశాడు. చికిత్సలో భాగంగా వైద్యులు ప్రీతి శరీరంలోని రక్తం మొత్తాన్ని రీసైకిల్ చేశారని చెప్పాడు. రక్తం పూర్తిగా మార్చిన తరువాత నమూనాలు తీసుకున్నట్టు తెలిపాడు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రీతి మరణానికి అసలు ఏది కారణం అన్నది ఎలా వెళ్లడవుతుందని ప్రశ్నించాడు. తాజాగా పోలీసుల చేతికి అందిన పోస్టుమార్టం నివేదికలోని వివరాలు వెల్లడైతే ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.

ఇక, కాకతీయ మెడికల్ కాలేజ్‌కు చెందిన వైద్య విద్యార్థిని ప్రీతి.. సీనియర్ సైఫ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అనస్థిషీయా డిపార్ట్ మెంట్‌కు చెందిన ప్రీతి.. పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో దాదాపు 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రీతి మరణించింది.  

Tags:    

Similar News