ఒడిశాలో కిడ్నాప్.. బొమ్మలరామారంలో రెస్క్యూ

ఒడిశాలో కిడ్నాప్ కు గురైన బాలుడిని , రాచకొండ పోలీసు కమిషనరేట్

Update: 2024-10-10 14:00 GMT

దిశ, సిటీక్రైం : ఒడిశాలో కిడ్నాప్ కు గురైన బాలుడిని , రాచకొండ పోలీసు కమిషనరేట్ బొమ్మలరామారం పీఎస్ పరిధిలో రాచకొండ పోలీసులు సురక్షితంగా కాపాడి తల్లితండ్రుల చెంతకు చేర్చారు. గురువారం రాచకొండ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఒడిశా రాష్ట్రం కోమ్నా పోలీసు స్టేషన్ పరిధిలోని లహాండపల్లి ప్రాంతానికి చెందిన అర్జున్ భీమల్ దంపతుల ఐదు సంవత్సరాల కుమారుడిని కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన పై కోమ్నా పోలీసు స్టేషన్ లో పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. ఐదు సంవత్సరాల బాలుడిని కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్న దుర్యోధన్ బరిహా(30) పద్మిని మజ్జి(35)లను ట్రాక్ చేశారు. అయితే వారు ఒడిశా నుంచి తెలంగాణ రాష్ట్రాంలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉండొచ్చని సమాచారాన్ని ఒడిశా పోలీసులు రాచకొండ పోలీసులకు తెలిపారు.

సీపీ సుధీర్ బాబు ఎస్ఓటీ, ఐటీ సెల్, బొమ్మలరామారం పోలీసులతో ప్రత్యేక బ్రుందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దిగారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన లొకేషన్ నుంచి సాంకేతికంగా విశ్లేషించుకుని కిడ్నాపైన బాలుడు బొమ్మలరామారం పోలీసు స్టేషన్ పరిధిలోని తూంకుంట గ్రామంలోని ఇటుక బట్టీ సమీపంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, సురక్షితంగా బాలుడిని కాపాడి ఒడిశా పోలీసులకు అప్పగించారు. ఇద్దరు నిందితులను కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉండి ఆ తర్వాత బాలుడిని విక్రయించేందుకు ప్లాన్ చేశారని సమాచారం. ఒడిశా పోలీసులు సమాచారం అందించిన 24 గంటల్లోనే బాలుడిని కాపాడి, నిందితుల ఆచూకీని గుర్తించిన ఎస్ఓటీ, ఐటీ సెల్ అధికారులను సీపీ సుధీర్ బాబు అభినందించారు.


Similar News