బంజారాహిల్స్ బాలికపై అత్యాచారం ఘటన.. గవర్నర్ సీరియస్
బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఎల్‌కేజీ బాలిక (4)పై ప్రిన్సిపాల్ డ్రైవర్ రజనీ కుమార్ అత్యాచారానికి పాల్పడిన ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఎల్‌కేజీ బాలిక (4)పై ప్రిన్సిపాల్ డ్రైవర్ రజనీ కుమార్ అత్యాచారానికి పాల్పడిన ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన గవర్నర్ దారుణానికి పాల్పడిన వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై అత్యాచారం కేసుతో పాటు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత కూడా డ్రైవర్ రజినీ కుమార్‌ను కాపాడే ప్రయత్నం చేశారని ప్రిన్సిపాల్ మాధవిపై ఆరోపణలు రావడంతో ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యంత విషాదకరమైన ఈ ఘటనపై గురువారం గవర్నర్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటలపైన గవర్నర్ గతంలోనూ సీరియస్ అయ్యారు. గతంలో జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనతో పాటు పలు నేరాలపై ఆమె స్పందించారు. వాటికి సంబంధించిన పూర్తి నివేదికలను ఇవ్వాలని కోరారు. తాజాగా రాష్ట్ర రాజధానిలో చిన్నారిపై జరిగిన అఘాయిత్యం ఘటనపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.