విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. సకాలంలో స్పందించిన సహచర విద్యార్థులు

స్థానిక ఎన్ఆర్ పేటలోని ఎస్వీఆర్కే కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఫలితాలు వచ్చి 5 నెలలు గడిచినా ఇంత వరకు విద్యార్థులకు ఒరిజినల్‌ మెమోలు అందించకపోవడంతో ఓ విద్యార్థి మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఏలూరులో శనివారం చోటుచేసుకుంది.

Update: 2024-10-05 13:05 GMT

దిశ, ఏలూరు: స్థానిక ఎన్ఆర్ పేటలోని ఎస్వీఆర్కే కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఫలితాలు వచ్చి 5 నెలలు గడిచినా ఇంత వరకు విద్యార్థులకు ఒరిజినల్‌ మెమోలు అందించకపోవడంతో ఓ విద్యార్థి మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఏలూరులో శనివారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని ఐఐటీ, నీట్‌, ట్రిపుల్ ఐటీలలో చేరిన విద్యార్థిని విద్యార్థుల ఇంటర్మీడియట్ ఒరిజినల్‌ మెమోలు సమర్పణకు ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది. విద్యార్థులను ఆయా విద్యాసంస్థలు ఒరిజినల్‌ మెమోలు ఇవ్వాలని అడుగుతున్నాయి. అయితే ఏలూరు లోని ఎస్వీ ఆర్కే కళాశాల యాజమాన్యం మాత్రం ఆ సర్టిఫికెట్ ఇచ్చేందుకు విద్యార్థులను అధిక ఫీజు చెల్లించాలని అడిగినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే నీట్‌లో ర్యాంకు సాధించిన ఓ విద్యార్థి తన సర్టిఫికెట్స్ ఇవ్వాలని గత 15 రోజులుగా ప్రతి రోజు ఎస్వీఆర్కే కళాశాల యాజమాన్యాన్ని అడుగుతున్నా సర్టిఫికెట్ తమ దగ్గర లేవని, ఆ విద్యార్థికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా పోయినట్టు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. దీంతో చెల్లుబోయిన అచ్యుత్ యాదవ్ అనే ఆ విద్యార్థి మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన సహచర విద్యార్థులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు, వైఎస్ఆర్సిపి యువజన నాయకులు ఎస్వీఆర్కే కళాశాల వద్దకు చేరుకొని భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ యాజమాన్య ప్రతినిధులను, ఆందోళన కారులను అదుపులోకి తీసుకుని అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. త్రీ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News