లిక్కర్ స్కాం దర్యాప్తులో ED పకడ్బందీ ప్లాన్.. అధికారుల బృందంలో తరచూ మార్పులు!

ఢిల్లీ లిక్కర్ స్కాంను దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

Update: 2022-09-21 00:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంను దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వ్యాపారవేత్తలను ప్రశ్నిస్తున్నారు. వీరితో సంబంధం ఉన్న అధికార పార్టీకి చెందిన పలువురి ఆఫీసులు, నివాసాల్లోనూ సోదాలు చేస్తున్నారు. ఈ నెలలో రెండు వారాల వ్యవధిలోనే మూడుసార్లు రెయిడ్ చేసిన ఈడీ టీమ్‌లు పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తున్నాయి. ఒక టీమ్‌లో ఉన్న సిబ్బందిని మరోసారి ఇంకో టీమ్‌లోకి మారుస్తూ సమాచారం బైటకు పొక్కకుండా ఈడీ కేంధ్ర కార్యాలయం, హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఒకసారి రెయిడ్‌కు వెళ్ళిన తర్వాత ఆ టీమ్‌లోని సభ్యులంతా మారిపోతున్నారు. దీంతో ఒక రెయిడ్‌కు మరో రెయిడ్‌కు లింకు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది.

సోదాలు చేస్తున్న ఈడీ సిబ్బందిలో ఎక్కువగా ఢిల్లీ, ముంబాయి రాష్ట్రాల నుంచి ఈ అవసరం కోసం తాత్కాలికంగా డిప్యూటేషన్‌పై సమకూర్చుకుంటున్నది. స్థానికంగా ఉన్నవారిని వీలైనంతగా దూరం పెట్టింది. అదుపులోకి తీసుకున్నవారిని ప్రశ్నించేందుకు కూడా రెయిడ్‌లో పాల్గొన్నవారితో సంబంధం లేకుండా ఇతర అధికారులు రంగంలోకి దిగుతున్నారు. స్థానికంగా ఉన్న ఈడీ సిబ్బందికి మీడియాతో సంబంధాలు ఉంటాయనే ఉద్దేశంతో పకడ్బందీగా ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నది. దీంతో సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, నగదు తదితర వివరాలేవీ బైటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నది. అధికారికంగా సైతం ఎలాంటి వివరాలను వెల్లడించడంలేదు. నోటీసులు జారీ చేయడం మొదలు ఎంక్వయిరీకి పిలిపించుకునేంత వరకు ఎక్కడా సమాచారం లీక్ కాకుండా వ్యవహరిస్తున్నది.

ఐటీ శాఖలోనూ అదే తరహా వ్యూహం

గత కొంతకాలంగా హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ సోదాలకు కీలక ప్రాంతాలుగా మారాయి. లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచడంతో పాటు పలు వ్యాపార సంస్థలకు సంబంధించిన ఆదాయ వివరాలను పరిశీలించేందుకు ఐటీ కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్, ఇంజనీరింగ్ కంపెనీలపై ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఇప్పుడు లిక్కర్ స్కాం వ్యవహారంలో ఐటీ సహకారాన్ని ఈడీ కోరింది. ఆరోపణలు, అభియోగాలు, ఆర్థిక నేరాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిశితంగా దృష్టి పెట్టాయి. ఐటీ శాఖలో ఒకే రోజున దేశవ్యాప్తంగా 83 మంది ఉన్నతస్థాయి అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రానికి ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్‌గా సంజయ బహదూర్‌ను నియమించగా, చీఫ్ కమిషనర్‌గా శిశిర్ అగర్వాల్‌ను నియమించింది. విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలకు చీఫ్ కమిషనర్‌గా శ్రీపాద రాధాకృష్ణను నియమించింది.

హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రంపై ఈడీ, ఐటీ విభాగాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఇక్కడి నుంచి ఆన్‌లైన్ ద్వారా, ప్రజా ప్రతినిధుల ద్వారా వస్తున్న ఫిర్యాదులు, ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులకు ఇక్కడి లింకులున్నట్లు ప్రాథమిక వివరాలు వెలుగులోకి రావడంతో నిత్యం ఈ రెండు శాఖల బృందాలు రాష్ట్రంల సోదాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి ఇంతకాలం జాయింట్ డైరెక్టర్ ఉండగా ఇటీవలనే దీన్ని అదనపు డైరెక్టర్ హోదా కల్పించి గతంలో ఈ రాష్ట్రంపై పట్టు ఉన్న దినేష్ పరుచూరిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ మార్పు జరిగిన తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు బాగా పెరిగింది. ఇప్పుడు ఐటీ శాఖలోనూ ఉన్నతస్థానంలో మార్పులు చేసి భారీ స్థాయిలో బదిలీలు చేసినందున రానున్న రోజుల్లో ఆ శాఖ తరఫున ఎలాంటి సోదాలు జరుగుతాయన్నది కీలకంగా మారింది.

Also Read : లిక్కర్ స్కాంలో రోజుకో ట్విస్ట్.. వెలుగులోకి ఎంపీ సంతోష్ రావు లింకులు?

Tags:    

Similar News