రోడ్డు ప్రమాదంలో దాచారం సర్పంచ్ మృతి...
గ్రామపంచాయతీ పరిధిలో హరితహారం కార్యక్రమం మొక్కలు నాటేందుకు శనివారం స్థలసేకరణ పరిశీలించి ఇంటికి వెళుతున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రగాయాల పాలైన ఆత్మకూర్ ఎస్ మండల దాచారం గ్రామ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సయ్యద్ మహ్మద్ అలీ (51) హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
దిశ, ఆత్మకూర్ ఎస్ : గ్రామపంచాయతీ పరిధిలో హరితహారం కార్యక్రమం మొక్కలు నాటేందుకు శనివారం స్థలసేకరణ పరిశీలించి ఇంటికి వెళుతున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రగాయాల పాలైన ఆత్మకూర్ ఎస్ మండల దాచారం గ్రామ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సయ్యద్ మహ్మద్ అలీ (51) హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు మహమ్మద్ అలీ గత కొంతకాలంగా సూర్యాపేటలో నివాసమంటు గ్రామపంచాయతీ రోజు వచ్చి వెళ్తుంటారు. జూన్ లో ప్రారంభమయ్యే హరితహారం కార్యక్రమానికి మొక్కలు నాటేందుకు గాను కాల్వగట్లు, ప్రభుత్వ భూములు పరిశీలించి ఇంటికి వెళుతుండగా చివ్వేంల మండలం లక్ష్మీ నాయక్ తండ సమీపంలో పెట్రోల్ కోసం తన స్కూటీతో బంకులోకి వెళ్తుండగా సూర్యాపేట నుండి పల్సర్ బైక్ పై వస్తున్న ముగ్గురు యువకులు అతివేగంగా వచ్చి సర్పంచ్ మహమ్మద్ అలీ స్కూటీని డీ కొట్టారు. ఈ ప్రమాదంలో సర్పంచ్ మహమ్మద్ ఆలీతో పాటు పల్సర్ బైక్ పై ఉన్న బానోత్ తరుణ్ ఆకాష్ ధరావత్ విష్ణులకు గాయాలయ్యాయి.
గాయాలైన నలుగురిని సూర్యాపేట ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నలుగురిని హైదరాబాద్ కు తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న సర్పంచ్ మహమ్మద్ అలీ ఆదివారం ఉదయం మృతి చెందాడు. బైక్ పై యువకులు బానోత్ తరుణ్ ఆకాశ్ లు హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్ చికిత్స పొందుతుండగా విష్ణు ఎల్బీనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పల్సర్ బైక్ పై వస్తున్న ముగ్గురు యువకులలో బానోతుతరుణ్ ఆకాశ్ లు మిర్యాలగూడ మండలం బొట్య నాయక్ తండా కు చెందిన వారు కాగా ధరావత్ విష్ణు పెన్ పహాడ్ మండలం జగ్గుతండా చెందిన వాడు. వీరు ముగ్గురు మిత్రుడి వివాహం కోసం శుభలేఖలు పంచుతూ ఆత్మకూరు ఎస్ మండలం రామోజీ తండాలో భానోతు రమేష్ ఇంట్లో శుభకార్యంకు హాజరై అక్కడి బందువులకు శుభలేఖలు పంపిణీ చేసేందుకు వస్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం సంబవించింది. పల్సర్ బైక్ పై ఉన్న యువకులు ముగ్గురు తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు.
కమ్యూనిస్టు ఉద్యమాల్లో సుమారు 25 ఏళ్లు పనిచేసి చంద్రబాబునాయుడు హయాంలో టీడీపీలో 10ఏళ్లు ఉన్నారు. అనంతరం మహమ్మద్ అలీ గత ఎనిమిదేళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామంలో అత్యధిక ఓట్లతో విజయం సాధించారు. సొంత పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలోనూ మంచి గుర్తింపు ఉన్న మహమ్మద్ అలీ మూడేళ్లలోనే నాలుగుసార్లు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. ఏడాది క్రితంరోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన మహమ్మద్ అలీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. రోడ్డు పై ప్రయాణం చేసేటప్పుడు అతిజాగ్రత్తగా ఉండే మహమ్మద్ అలీ రోడ్డుప్రమాదంలో మృతి చెందడం దారుణం. దాచారం గ్రామపంచాయతీ అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో తనకున్న విలువైన వ్యవసాయ భూమినీ అమ్మి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు.
పలువురి పరామర్శ..
సింగర్ కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ మహమ్మద్ అలీ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు చెవిటి వెంకన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, కుటుంబానికి సంతాపం తెలిపారు. మృతుడు మహమ్మద్ అలీకి భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.