రూ. 5 లక్షల దోపిడీ కేసులో ఫిర్యాదుదారుడే సూత్రధారి
పోలీస్ దుస్తులు ధరించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తనిఖీల పేరుతో ఓ సంస్థకు చెందిన ఆఫీస్ బాయ్ అరుణ్ తన బ్యాగులో తీసుకెళ్తున్న రూ. 5 లక్షల నగదు దోపిడీ చేసిన ఘటన గత ఆదివారం బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

దిశ, తిరుమలగిరి : పోలీస్ దుస్తులు ధరించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తనిఖీల పేరుతో ఓ సంస్థకు చెందిన ఆఫీస్ బాయ్ అరుణ్ తన బ్యాగులో తీసుకెళ్తున్న రూ. 5 లక్షల నగదు దోపిడీ చేసిన ఘటన గత ఆదివారం బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ దోపిడీలో ఆఫీస్ బాయ్ అని అతనికి వారి కార్యాలయంలో పనిచేసే అకౌంటెంట్ సమరేంద్ర దాస్ పూర్తి సహకారం అందించాడని బేగంపేట్ ఏసీపీ గోపాలకృష్ణ తెలిపారు. మంగళవారం బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దోపిడీకి సంబంధించిన పూర్తి వివరాలు ఆయన వెల్లడించారు. పోలీసులమని తనిఖీల పేరుతో తన వద్ద రూ.5 లక్షలను ఇద్దరు వ్యక్తులు దోచుకెళ్లారని నిందితుడు తప్పుడు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న సీఐ లక్ష్మీనారాయణ రెడ్డి, డీఐ సర్దార్ నాయక్ లు వెంటనే అప్రమత్తమై తమ సిబ్బందితో విచారణ ప్రారంభించారు.
దోపిడీ జరిగిన ప్రాంతంలో, అదే విధంగా ఫిర్యాదుదారుడి కదలికలను పూర్తిస్థాయిలో గమనించగా అతడే అసలు సూత్రధారి అని తేలిందని ఏసీపీ తెలిపారు. ఈ మేరకు నిందితుల వద్ద నుండి 5 లక్షల రూపాయలు రికవరీ చేసి వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చనున్నట్లు ఏసీపీ తెలిపారు. గతంలోను బోయినపల్లికి చెందిన సత్తు శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా తన ఇంట్లో 3 తులాల బంగారం, 3 లక్షల రూపాయలు, ఒక స్మార్ట్ వాచ్ దొంగతనం జరిగిందని తప్పుడు ఫిర్యాదు చేశాడని, అతను కూడా తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తేలడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. తప్పుడు ఫిర్యాదులు చేసి పోలీసులను తప్పుదోవ పట్టించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దోపిడీ కేసును 30 గంటలలో ఛేదించిన సిబ్బంది మురళి, రాజేష్, మనోహర్, శ్రీనివాస్, తులసిదాస్ లను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు.