అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యం..
అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి శవం చెరువులో లభ్యమైన ఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్లాపూర్ తండాలో చోటుచేసుకుంది.
దిశ, అల్లాదుర్గం : అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి శవం చెరువులో లభ్యమైన ఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్లాపూర్ తండాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన జగపతిబాబు (23) ఉపాధి కూలీ కోసం తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చారు. శుక్రవారం నాడు వట్టిపల్లి మండలం పోతులబోగుడ గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనులు ముగించుకొని ముస్లాపూర్ తండాలో మూడవత్ నంద్యా నాయక్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణ పనుల కోసం తండాకు వచ్చారు. శనివారం ఉదయం టిఫిన్ కోసం సమీపంలో ఉన్న గడి పెద్దాపూర్ చౌరస్తా వద్ద టిఫిన్ చేసేందుకు వెళ్లి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అతనితో వచ్చిన మేస్త్రి హరిబాబు వెతకగా అతడి ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు ఆదివారం ఉదయం గ్రామ శివారులోని దేవలకుంటలో ఓ వ్యక్తి శవం తేలియాడుతూ కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా మృతదేహం జగపతి బాబుదేనని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ జోగిపేట ఆసుపత్రికి తరలించారు.