మేడ్చల్ జిల్లాలో దారుణం: ద్విచక్ర వాహనంతో సహా కాలి బూడిదైన వ్యక్తి.. ఏం జరిగిందంటే..?
మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనంతో సహా కాలిబూడిదైన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
దిశ, దుండిగల్: మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనంతో సహా కాలి బూడిదైన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐడీఏ బొల్లారంకు చెందిన తారకేశ్వర్(45) స్విగ్గి సంస్థలో పని చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు. కాగా శనివారం రాత్రి సుమారు 8గంటల 30 నిమిషాల ప్రాంతంలో తారకేశ్వర్ ఇంటికెళ్లాడు.
ఇంట్లో బ్యాగ్ పెట్టి తన ద్విచచక్ర వాహనంపై బయటికి వెళ్లాడని అతని కుమారుడు చింటూ తెలిపాడు. కాగా ఆదివారం ఉదయం వాకర్స్ ద్వారా సాయినాథ్ సొసైటీలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంతో సహా కాలిపోయి బూడిదైనట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంఘటన స్థలాన్ని సందర్శించిన ఏసీపీ..
విషయం తెలుసుకున్న ఏసీపీ వెంకట్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మృతదేహం ఆనవాళ్లు ప్రకారం ఒంటిపై పెట్రోల్ పోసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. పూర్తిగా కాలి బూడిద అవ్వడంతో గుర్తుపట్టలేనంతగా ఉందని, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మహత్యే అయి ఉండవచ్చని పేర్కొన్నారు.