దారుణం.. అనుమానంతో భార్యను అతి కిరాతకంగా చంపిన భర్త

కట్టుకున్న మొగుడే కాలయముడయ్యాడు.

Update: 2024-11-12 08:10 GMT

దిశ, చార్మినార్ : కట్టుకున్న మొగుడే కాలయముడయ్యాడు. అనుమానం కారణంగా భార్యపై అర్ధరాత్రి కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అగ్ని ప్రమాదంగా చిత్రీకరించడానికి భార్య మృతదేహం పై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి తీవ్ర కలకలం రేపింది. బండ్లగూడ హషమాబాద్ కు చెందిన ఫయాజ్ ఖురేషి (25), ఖమర్ బేగం (23) లు దంపతులు. వీరికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. హాది ఉన్నీసా (5), జునైద్ (3) లు ఉన్నారు. వృత్తి రీత్యా లేబర్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురంలో రాను రాను కలతలు చెలరేగాయి. భార్య ఖమర్ బేగంపై భర్త అనుమానం పెంచుకొని తరచు గొడవకు దిగేవారు. ఈ నేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి మరో భార్య భర్తల మధ్య గొడవలు చెలరేగాయి.

అదే ఇంట్లో పక్క పోర్షన్ లోనే ఉండే నానమ్మ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య మాట మాట పెరగడంతో కోపోద్రిక్తుడైన భర్త ఫయాజ్ ఖురేషి చాకుతో భార్య గొంతు కోశాడు. ఆపై కడుపులో విచక్షణ రహితంగా దాడి చేశారు. వెంటనే బయట పార్క్ చేసి ఉన్న చేతక్ స్కూటర్ లోంచి పెట్రోల్ తీసుకు వచ్చి భార్య పై పోసి తగులబెట్టాడు. ఒక్కసారిగా బెడ్ రూమ్ లో మంటలు ఎగిసి పడడంతో భర్త పరారయ్యాడు. స్థానికులు నీళ్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. గమనించిన స్థానికులు బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న బండ్లగూడ పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. కాలిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పరారీలో ఉన్న భర్త ఫయాజ్ ఖురేషి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News