ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం..
గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, గజ్వేల్ రూరల్ : గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భార్యాభర్తలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే సిద్దిపేట వైపు నుంచి వస్తున్న లారీ గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ బ్రాహ్మణ బంజేరుపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు సుతారి కిష్టయ్య, సుతారి సత్తవ్వలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. అనంతరం వారి పై నుంచి లారీ వెళ్లిపోవడంతో సుతారి సత్తవ్వ అక్కడికక్కడే మృతి చెందింది.
భర్త సుతారి కిష్టయ్యకు కాళ్ళు, చేతులు విరిగి తీవ్రగాయాలయ్యాయి. సుతారి కిష్టయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం స్థానికులు క్షతగాత్రున్ని 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గజ్వేల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి పెళ్ళైన కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనా స్థలంలో మృతురాలి కుమారుడు విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనతో బ్రాహ్మణ బంజేరుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటన పై కేసు నమోదు చేసుకున్న గజ్వేల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.