ఢిల్లీ స్కూలుకు బెదిరింపు కాల్
దేశ రాజధాని ఢిల్లీలో ఓ స్కూల్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో ఓ స్కూల్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. బుధవారం ఉదయం సాదిఖ్ నగర్‌లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌కు బాంబు ఉందంటూ ఓ ఈ-మెయిల్ వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన యాజమాన్యం..విద్యార్థులు, టీచర్లను బయటకు పంపించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వస్తున్నారు. స్కూల్ భవనం నుంచి విద్యార్థులను బయటకు పంపించి బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్వ్కాడ్‌ను రప్పించి తనిఖీలు చేస్తున్నారు.
అయితే ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఈమెయిల్ ఎవరు పంపారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గతంలో కూడా ఇదే స్కూల్‌కి బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం.