జానీ మాస్టర్‌కి 4 రోజుల కస్టడీ విధించిన కోర్టు
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి 4 రోజుల కస్టడీ విధిస్తూ జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టు ఈ రోజు (బుధవారం) ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి 4 రోజుల కస్టడీ విధిస్తూ రంగారెడ్డి కోర్టు ఈ రోజు (బుధవారం) ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించిన కేసులో అరెస్టైన జానీ మాస్టర్‌ని విచారించేందుకు తమకు 5 రోజుల కస్టడీ కావాలంటూ నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే నేడు నార్సింగ్ పోలీసులు కోరినట్లు 5 రోజులు కాకుండా 4 రోజుల పాటు జానీ మాస్టర్ కస్టడీని వారికి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని, న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. కాగా.. ఇప్పటికే జానీ మాస్టర్‌కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించగా, ప్రస్తుతం నిందితుడు చంచల్ గూడ జైల్లో ఉన్నాడు.
ఇదిలా ఉంటే జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఓ యువతి తనను జానీ ఐదేళ్లుగా బెదిరించి అత్యాచారం చేస్తున్నాడని, విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని సెప్టెంబర్ 15న రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో జానీ మాస్టర్ అయియాజ్ షేక్ జానీపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. ఆ తర్వాత కేసును నార్సింగి ఠాణాకు బదిలీ చేశారు. ఈ క్రమంలోనే బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు యువతి మైనర్‌గా ఉన్నప్పటి నుంచి జానీ లైంగిక దాడి చేస్తున్నట్లు నిర్థారించుకుని ఎఫ్‌ఐఆర్‌లో అదనంగా పోక్సో సెక్షన్‌ను చేర్చారు.
అయితే అప్పటికే తనపై అత్యాచారం కేసు నమోదైందని తెలుసుకున్న జానీ మాస్టర్ పరారైపోయాడు. దీంతో అతడిని అన్ని చోట్లా వెతికిన తర్వాత గోవాలో ఉన్నాడని ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పక్కా ఆధారాలు సేకరించిన రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీస్ టీం 18వ తేదీ సాయంత్రం హైదరాబాద్ నుంచి గోవాకు బయల్దేరి వెళ్లి.. 19వ తేదీ తెల్లవారుజామున జానీని అరెస్ట్ చేసింది. స్థానిక కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్న పోలీసులు రోడ్డు మార్గంలో హైదరాబాద్ తీసుకువచ్చి ఇక్కడ ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.