Haryana violence: 'బాధ్యులను వదిలిపెట్టబోం'.. మత ఘర్షణలపై ప్రభుత్వం హెచ్చరిక

హర్యానా మత ఘర్షణలకు కారకులైనవారిని వదిలిపెట్టబోమని, చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హెచ్చరించింది.

Update: 2023-08-03 16:44 GMT

చండీగఢ్: హర్యానా మత ఘర్షణలకు కారకులైనవారిని వదిలిపెట్టబోమని, చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హెచ్చరించింది. ఈ మేరకు హర్యానా అదనపు ముఖ్య కార్యదర్శి టీవీఎస్ఎన్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, మతహింస కేసులో ఇప్పటివరకు 93 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని, ఘటనకు సంబంధమున్న 176 మందిని పోలీసులు అరెస్టు చేశారని, మరో 78మందిని నిర్బంధించారని వివరించారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే, తప్పుడు వార్తలు పోస్టు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వెల్లడించారు. నూహ్ జిల్లాతోపాటు ఫరిదాబాద్‌లో ఈ నెల 5వరకు ఇంటర్నెట్‌ను నిలిపివేశామని స్పష్టం చేశారు.

కాగా, గత నెల 31న విశ్వహిందూ పరిషద్(వీహెచ్‌పీ) నిర్వహించిన ఓ ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వడంతో అవి మత ఘర్షణలకు దారితీసిన విషయం తెలిసిందే. పరస్పర దాడుల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మత గురువు సహా ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వంద మంది గాయపడ్డారు.


Similar News