శ్మశానాల్లో జాగ లేదు.. కాలుతూనే ఉన్న శవాలు
దిశ, తెలంగాణ బ్యూరో: శ్మశానం నిండిపోయింది. ఎక్కడ అడుగు తీసి అడుగు పెట్టినా మనుషుల కళేబరాలు, ఎముకలే దర్శనమిస్తున్నాయి. కాల్చేందుకు జాగ లేదు. ఒక దాని పక్కనే మరొక చితి పేర్చడం అనివార్యమైంది. అక్కడికి రెండు రోజులకో శవం వస్తే వింత. నెలకో 15 వస్తే చర్చనీయాంశమే. కానీ ఇప్పుడు అంబులెన్సుల హారన్ శబ్దాలు ఆగడం లేదు. ఒకటి వెళ్లకముందే మరొకటి వస్తూనే ఉన్నాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే పది శవాలు […]
దిశ, తెలంగాణ బ్యూరో: శ్మశానం నిండిపోయింది. ఎక్కడ అడుగు తీసి అడుగు పెట్టినా మనుషుల కళేబరాలు, ఎముకలే దర్శనమిస్తున్నాయి. కాల్చేందుకు జాగ లేదు. ఒక దాని పక్కనే మరొక చితి పేర్చడం అనివార్యమైంది. అక్కడికి రెండు రోజులకో శవం వస్తే వింత. నెలకో 15 వస్తే చర్చనీయాంశమే. కానీ ఇప్పుడు అంబులెన్సుల హారన్ శబ్దాలు ఆగడం లేదు. ఒకటి వెళ్లకముందే మరొకటి వస్తూనే ఉన్నాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే పది శవాలు వచ్చాయి. ఇదీ హైదరాబాద్ లోని సాహేబ్ నగర్ శ్మశానవాటికలో ఆదివారం సంగతి. ఇక్కడికే గంటన్నర వ్యవధిలో పది శవాలు వచ్చాయంటే మిగతా శ్మశాన వాటికల లెక్క ఏ స్థాయిలో ఉందో అంచనా వేసుకోవచ్చు. కరోనా వైరస్ కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చెప్పడానికి ఏదైనా శ్మశానవాటిక దగ్గర ఓ గంట సేపు కూర్చుంటే తెలిసిపోతుంది.
చచ్చినా వేదనే
గాంధీ ఆసుపత్రిలో ఓ వ్యక్తి శనివారం సాయంత్రం 5.30 గంటలకే చనిపోయాడు. ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేసి మీ నాన్న చనిపోయాడంటూ సమాచారం ఇచ్చారు. అప్పటికే 14 రోజుల నుంచి ఆసుపత్రిలోనే ఉండడంతో మానసిక వేదనకు గురయ్యారు. చనిపోయాడన్న వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు లాక్ డౌన్ నిబంధనల మధ్య గాంధీ ఆసుపత్రికి చేరడానికి ఆపసోపాలు పడ్డారు. వెంటనే శవాన్ని చూడొచ్చునని, తీసుకెళ్లొచ్చునని భావించారు. కానీ తెల్లారి రావాలంటూ సూచించారు. అర్ధరాత్రి ఇంటికి వచ్చారు. ఆదివారం ఉదయం 5 గంటలకే వెళ్లి ఆసుపత్రి దగ్గర పడిగాపులు గాసారు. ఎప్పుడెప్పుడు లోపలికి పిలుస్తారోనని ఎదురుచూశారు.
ఫోన్ చేసి అడిగితే ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ప్రాసెస్ చేసి ఇస్తామన్నారు. అతడి కంటే ముందు మరో 20 మంది శవాలను స్వీకరించేందుకు ఉన్నారని తెలిసి అవాక్కయ్యారు. వీళ్ల వంతు వచ్చేసరికి మధ్యాహ్నం 12 గంటలైంది. అంబులెన్సులో సాహెబ్ నగర్ శ్మశానవాటిక చేరేందుకు మరో అరగంట సమయం పట్టింది. అంటే చనిపోయిన 18 గంటలకు శవాన్ని అప్పగిస్తున్నారని స్పష్టమైంది. ఒక్క గాంధీ ఆసుపత్రిలో శనివారం మరణించిన వారి సంఖ్య 20కి పైగానే ఉంది. దీంతో శవాల రికార్డులను నమోదు చేసుకోవడం, సంతకాలు చేయించుకోవడానికి గంటలకొద్ది సమయం పడుతున్నట్లు అర్ధమవుతుంది.
శవాల వరుస
శ్మశానవాటికల్లో దహన సంస్కారాల కోసం శవాలు క్యూ కట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. అక్కడ మరో గంట సేపు వేచి ఉండాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. సాహెబ్ నగర్ శ్మశానవాటికలో ఎక్కడైనా చితి పేర్చని, శవాన్ని కాల్చని ఆరడుగుల స్థలం కనిపించలేదు. ప్రతి చోటా బూడిద కనిపించింది. ఏకకాలంలో ఏడెనిమిది చితి మంటలు కనిపించాయి. ఒక దగ్గర మంటలు ఆరకముందే దాని పక్కనే మరో చితిని పేరుస్తున్నారు. కనీసం బంధుమిత్రులు ఆఖరి చూపు చూసుకోవడానికి కూడా వీల్లేకుండా పక్కనున్న చితి మంటల వేడి తగులుతోంది. వీళ్ల ప్రక్రియ పూర్తి కాకముందే మరో అంబులెన్సు రావడంతో త్వరపడడం తప్పనిసరి అవుతోంది. ఒక్క శ్మశానవాటికలోని సన్నివేశాలే ఇలా ఉంటే నగర వ్యాప్తంగా ఉన్న వాటిల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అంచనా వేయొచ్చు. కరోనా సెకండ్ వేవ్‌లో పాజిటివ్ సంఖ్యతో పాటు మరణాల రేటు కూడా అత్యధికంగానే ఉంది. లాక్ డౌన్ విధించినా కరోనా వైరస్ వ్యాప్తి ఆశించిన స్థాయిలో అదుపులోకి రాలేదని తెలుస్తోంది. ప్రతి రోజూకు లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే లెక్కలకు, వాస్తవానికి మధ్య అంతులేని తేడా ఉన్నట్లు స్పష్టమవుతోంది.