అతి త్వరలో 'కొవిన్-2.0'

దిశ, తెలంగాణ బ్యూరో : దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు. 50 ఏళ్ల వయసు పైబడినవారికి మార్చి రెండో వారం నుంచి టీకాల పంపిణీ మొదలు కానుంది. పేర్లను నమోదు చేసుకోడానికి కేంద్ర వైద్యారోగ్య శాఖ త్వరలోనే ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను, వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్లకు ‘కొవిన్’ సాప్ట్‌వేర్ ద్వారా పేర్ల నమోదు పూర్తయింది. ఇప్పుడు ‘కొవిన్-2.0’ పేరుతో ఈ వారాంతానికి కొత్త వెబ్‌సైట్ ఉనికిలోకి రానుంది. పేర్లు నమోదు చేసుకునేవారు […]

Update: 2021-02-08 11:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు. 50 ఏళ్ల వయసు పైబడినవారికి మార్చి రెండో వారం నుంచి టీకాల పంపిణీ మొదలు కానుంది. పేర్లను నమోదు చేసుకోడానికి కేంద్ర వైద్యారోగ్య శాఖ త్వరలోనే ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను, వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్లకు ‘కొవిన్’ సాప్ట్‌వేర్ ద్వారా పేర్ల నమోదు పూర్తయింది. ఇప్పుడు ‘కొవిన్-2.0’ పేరుతో ఈ వారాంతానికి కొత్త వెబ్‌సైట్ ఉనికిలోకి రానుంది. పేర్లు నమోదు చేసుకునేవారు విధిగా రెండు గుర్తింపు కార్డుల వివరాలను ఇవ్వాలి.

50 ఏళ్ల వయసు పైబడినవారి పేర్లన్నీ ఓటర్ల జాబితాలో ఉన్నందున ఈ సాఫ్ట్‌వేర్‌లో ఆ జాబితాను పొందుపరుస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. జాబితాలో పేర్లు లేనట్లయితే ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుల ఆధారంగా వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 13 నుంచి లేదా 15 నుంచి హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోస్ పంపిణీ మొదలుకానుంది. దీనికి కనీసం మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. అప్పటికల్లా ‘కొవిన్-2.0’లో పేర్లను నమోదు చేసుకునేందుకు అవసరమైన మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం వీరికి ఉచితంగానే వ్యాక్సిన్ ఇస్తుందా లేక సబ్సిడీ ధరకు ఇస్తుందా అనేది తేలుతుంది.

‘కొవాగ్జిన్’ తీసుకున్న డైరెక్టర్

భారత్ బయోటెక్ తయారుచేసిన ‘కొవాగ్జిన్’పై రకరకాల సందేహాలు, విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లలో భయాందోళనలను పోగొట్టడానికి ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్వయంగా సోమవారం తొలి డోస్ తీసుకున్నారు. ‘కొవాగ్జిన్’తో వచ్చే ప్రమాదమేమీ లేదని, ఏ వ్యాక్సిన్ అయినా ఒకేలా పనిచేస్తుందని, ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేసిన ‘కొవిషీల్డ్’ టీకాలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వినియోగించింది. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మాత్రం దానితో పాటు ‘కొవాగ్జిన్’ను కూడా వినియోగిస్తోంది. మొదటి డోస్ ఏ కంపెనీకి చెందిన టీకా తీసుకుంటే రెండో డోస్ కూడా దాన్నే తీసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర పోలీసు బలగాలకు ‘కొవాగ్జిన్’

సోమవారం కేంద్ర పారామిలిటరీ బలగాలకు టీకాలు ఇచ్చారు. 584 కేంద్రాలలో టీకాల పంపిణీ జరగ్గా ఇరవై వేల మంది తీసుకున్నారు. మొత్తం యాభై వేల మందికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా 41% మంది మాత్రమే తీసుకున్నారు. 1.8 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు ఉండగా ఇప్పటివరకు 35,360 మంది తీసుకున్నారు. హెల్త్ కేర్ వర్కర్లతో కలిపితే ఇప్పటివరకు టీకాలు తీసుకున్నవారి సంఖ్య 2.28 లక్షలకు చేరుకుంది. మంగళవారం నుంచి రెవెన్యూ, పోలీసు సిబ్బందితో పాటు పంచాయతీరాజ్, పురపాలక శాఖలోని పారిశుద్య కార్మికులకు టీకాల పంపిణీ జరగనుంది.

Tags:    

Similar News