ఆవు కౌగిట్లో.. ఒత్తిడి హుష్‌కాకి
దిశ, వెబ్‌డెస్క్: ఆవును దేవతగా పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇక నూతన గృహ ప్రవేశ వేళ.. మొదటి అడుగు ఆవుతోనే వేయించడమూ తెలిసిందే. ఆవు పాలు, పేడ, మూత్రం కూడా ఔషధమయమని వైద్యులు చెప్పడమే కాక పలు పరిశోధనల్లోనూ నిరూపితమైంది. అయితే, ఇప్పుడు ఆవును కౌగిలించుకున్నా మనిషికి ఒత్తిడి తగ్గి చాలా ప్రశాంతంగా ఉంటుందని నెదర్లాండ్ వాసులతో పాటు నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో ‘కౌ హగ్ థెరపీ’ ట్రెండింగ్‌లో ఉంది. మనిషిని […]
దిశ, వెబ్‌డెస్క్: ఆవును దేవతగా పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇక నూతన గృహ ప్రవేశ వేళ.. మొదటి అడుగు ఆవుతోనే వేయించడమూ తెలిసిందే. ఆవు పాలు, పేడ, మూత్రం కూడా ఔషధమయమని వైద్యులు చెప్పడమే కాక పలు పరిశోధనల్లోనూ నిరూపితమైంది. అయితే, ఇప్పుడు ఆవును కౌగిలించుకున్నా మనిషికి ఒత్తిడి తగ్గి చాలా ప్రశాంతంగా ఉంటుందని నెదర్లాండ్ వాసులతో పాటు నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో ‘కౌ హగ్ థెరపీ’ ట్రెండింగ్‌లో ఉంది.
మనిషిని ఆలింగనం చేసుకుంటే.. మనసుకు సాంత్వన చేకూరుతుందన్నది తెలిసిన విషయమే. కానీ ఆవును హత్తుకున్నా కూడా ఒత్తిడి దూరమై ఆనంద భావనలు కలుగుతాయని సరికొత్త అధ్యయనాలు తెలుపుతున్నాయి. దీంతో ‘కౌ హగ్గింగ్’ ట్రెండ్ మొదలైంది. నెదర్లాండ్‌లోని రీవర్ ప్రాంతంలో నివసించే జోస్ వన్ స్ట్రాలెన్‌ను ‘కౌ హగ్గింగ్ థెరపీ’కి ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. తన వ్యవసాయ క్షేత్రంలోనే ఆరేళ్ల కిందటే ‘వెల్‌నెస్ సెంటర్’ ప్రారంభించి ఈ థెరపీని ప్రారంభించాడు. అంతకుముందు దాదాపు పదేళ్ల క్రితం నుంచే స్ట్రాలెన్.. స్విస్ వాసులకు కౌ హగ్గింగ్ థెరపీ గురించి అవగాహన కల్పిస్తూ ఒత్తిడిని దూరం చేస్తుండగా.. ప్రపంచదేశాల్లో ఇప్పుడిది ట్రెండ్‌గా మారింది.
ఆవును మనిషి హత్తుకున్నప్పుడు.. ఆవుతో పాటు మనిషి కూడా అనిర్వచనీయమైన ఆనందానికి లోనవుతాడు. దాంతో మనిషికి, ఆవుకు మధ్య పాజిటివ్ వైబ్స్ కలిగి సోషల్ బాండింగ్ ఏర్పడుతుంది. ఆ పాజిటివిటీ పరస్పరం మార్పిడి అవ్వడమే కాకుండా.. ఆక్సిటోసిన్ హర్మోన్ విడుదలను ప్రేరేపిస్తుంది. దాంతో మనసులో ఆందోళన తగ్గి, ప్రశాంతత వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆవులను మచ్చిక చేసుకుంటే అవి మనుషులను నమ్ముతాయి. మనల్ని మరింత ఆప్తుడిలా భావించి మన చేతుల్ని, ముఖాన్ని నాకుతాయి. ఇది కూడా ఓ థెరపీనే. దీనివల్ల కూడా మనిషికి ఆనంద భావన కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
స్విట్జర్లాండ్, యూఎస్ఏలో కౌ హగ్గింగ్ సెషన్స్ నిర్వహిస్తుండగా, చాలా దేశాల్లో కౌ హగ్గింగ్ వెల్‌నెస్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. అయితే ఈ కౌ హగ్గింగ్ వల్ల మనుషులే లాభం పడటం లేదు. ఆవులు కూడా చాలా ఆనందాన్ని పొందుతున్నాయని అధ్యయనంలో తేలింది. ఇటీవలే యానిమల్ బిహేవియర్ సైన్స్ జర్నల్‌లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు పబ్లిష్ అయ్యాయి.