సెప్టెంబరు 7 నుంచి ప్రత్యక్ష కోర్టులు
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా విస్తృతవ్యాప్తి మూలంగా ఇంతకాలం వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పనిచేసిన కోర్టులు, ప్రయోగాత్మకంగా వచ్చే వారమంతా ఫిజికల్‌గా పనిచేస్తాయి. ప్రస్తుతానికి హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సహా మరో నాలుగు సింగిల్ బెంచ్‌లు ఫిజికల్‌గా పనిచేయనున్నాయి. సెప్టెంబరు 7 నుంచి 11వ తేదీ వరకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు తదుపరి కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది. అయితే కోర్టులు ఫిజికల్‌గా పనిచేసే క్రమంలో దాఖలయ్యే పిటిషన్లను 48 గంటల […]
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా విస్తృతవ్యాప్తి మూలంగా ఇంతకాలం వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పనిచేసిన కోర్టులు, ప్రయోగాత్మకంగా వచ్చే వారమంతా ఫిజికల్‌గా పనిచేస్తాయి. ప్రస్తుతానికి హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సహా మరో నాలుగు సింగిల్ బెంచ్‌లు ఫిజికల్‌గా పనిచేయనున్నాయి. సెప్టెంబరు 7 నుంచి 11వ తేదీ వరకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు తదుపరి కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది. అయితే కోర్టులు ఫిజికల్‌గా పనిచేసే క్రమంలో దాఖలయ్యే పిటిషన్లను 48 గంటల పాటు ముట్టుకోబోమని, రెండ్రోజుల క్వారంటైన్ ముగిసిన తర్వాత మాత్రమే వాటి జోలికి వెళ్ళేలా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టులోని ఐదు బెంచ్‌లు ఫిజికల్‌గా పనిచేయనున్నందున లాయర్ల మొదలు క్లయింట్ల వరకు పాటించిన నిబంధనలపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు.
ప్రతీరోజూ ఉదయం రెండు గంటల పాటు అన్ని కోర్టు హాళ్ళను శానిటైజ్ చేసే ప్రక్రియ కొనసాగుతుందని, అనంతరం సాయంత్రం ఐదు గంటలకు కూడా మరోసారి జరుగుతుందని తెలిపారు. ఐదు బెంచ్‌లు ఫిజికల్‌గా పనిచేస్తున్నప్పటికీ భోజన సమయం వరకు వీడియో కాన్ఫరెన్సు ద్వారానే పిటిషన్ల విచారణ జరుగుతుందని, మధ్యాహ్నం సెషన్‌లో మాత్రం ముగింపుకు వచ్చే కేసుల విచారణ జరుగుతుందన్నారు. ఉదయం మొదలు మధ్యాహ్నం వరకు కొత్త పిటిషన్ల అడ్మిషన్ ప్రక్రియ వీడియో కాన్ఫరెన్సు ద్వారానే ఉంటుందని వెల్లడించారు. కోర్టు ఆవరణలోకి ప్రవేశించే లాయర్లు, క్లయింట్లు వారికి సంబంధించిన కేసుల విచారణ ఉంటే మాత్రమే అనుమతిస్తామని, కరోనా లక్షణాలు లేకుంటే మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. ప్రతీఒక్కరూ విధిగా మాస్కు ధరించాల్సిందేనని, శానిటైజేషన్ ప్రక్రియను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
హైకోర్టు ఆవరణలోకి వచ్చిన తర్వాత ఏయే గేట్ల ద్వారా లోపలికి వెళ్ళాలో స్పష్టమైన ఆదేశాలు ఉంటాయని, ఆ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కోర్టు హాల్‌లోకి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మాస్కు ధరించి అక్కడే ఉన్న శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని నొక్కిచెప్పారు. ఒకే సమయంలో విచారణ జరిగే కోర్టు హాలులో అందరూ కలిపి ఆరుగురికి మించరాదని స్పష్టం చేశారు. అక్కడ కూడా ఫిజికల్ డిస్టెన్స్ నిబంధన పాటించాలని తెలిపారు. ఒక కేసు విచారణ పూర్తయిన తర్వాత మరో కేసు విచారణ ఉంటుంది కాబట్టి అప్పటివరకూ ఆయా కేసులకు సంబంధించిన న్యాయవాదులు, క్లయింట్లు వెయిటింగ్ హాలులో మూడు అడుగుల దూరంలోని సీటింగ్‌లో ఉండాలని పేర్కొన్నారు.