అవినీతికి కేరాఫ్‌గా జిల్లా పోలీసు శాఖ
దిశ, కామారెడ్డి: ఫ్రెండ్లి పోలీస్ పేరుతో పోలీసులు ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రజలకు అండగా నిలబడి న్యాయం చేయాల్సిన పోలీసులే వారికి శాపంగా మారుతున్నారు. తాజాగా ఓ సీఐ, ఎస్సైలపై వచ్చిన ఆరోపణలు కామారెడ్డి జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే అవినీతి ఆరోపణల్లో ఉన్నతాధికారి సహా పలువురు పోలీసులు జైలు ఊచలు లెక్కించారు. అయినా పోలీసుల తీరుమారడం లేదు. తాజాగా ఓ సీఐ, ఎస్సైపై డబ్బులు డిమాండ్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. […]
దిశ, కామారెడ్డి: ఫ్రెండ్లి పోలీస్ పేరుతో పోలీసులు ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రజలకు అండగా నిలబడి న్యాయం చేయాల్సిన పోలీసులే వారికి శాపంగా మారుతున్నారు. తాజాగా ఓ సీఐ, ఎస్సైలపై వచ్చిన ఆరోపణలు కామారెడ్డి జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే అవినీతి ఆరోపణల్లో ఉన్నతాధికారి సహా పలువురు పోలీసులు జైలు ఊచలు లెక్కించారు. అయినా పోలీసుల తీరుమారడం లేదు. తాజాగా ఓ సీఐ, ఎస్సైపై డబ్బులు డిమాండ్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఆడియో టేపులు సైతం బహిర్గతం కావడంతో, మర్డర్ కేసు పోలీసుల మెడకు చుట్టుకుంటుంది.
అసలేం జరిగింది.?
గత సంవత్సరం సెప్టెంబర్ 30 న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. ఇటీవల ప్రధాన నిందితుడు కండిషన్ బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే హత్య కేసుతో తనకు సంబంధం లేదని బెయిల్‌పై వచ్చిన బాధితుడు ఆరోపిస్తున్నారు. కావాలనే ఇరికించారని, తన వద్ద పోలీసులు రూ. లక్షన్నర తీసుకుని కేసు కొట్టేస్తామని చెప్పారని, అయినా కేసు కొనసాగుతుందని బాధితుడు వాపోతున్నాడు. తనకు మృతుడి భార్యకు పోలీసులు అక్రమ సంబంధం అంటకట్టారని ఆరోపిస్తున్నాడు. పోలీసుల తీరుపై బాధితుడు హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది.
ఆడియో టేపు కలకలం
బెయిల్‌పై వచ్చిన నిందితుడు స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టి వెళ్లే సమయంలో పోలీసులకు, అతడికి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆడియో టేపులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ‘మృతుడి భార్య జైలుకు వెళ్తుందేమోనని కేసు తనపై వేశారని, దాని నుంచి బయట పడటానికి మీరు అడిగిన రూ. రెండు లక్షల్లో రూ. లక్షన్నర ఇచ్చాను కదా సార్.. మళ్లీ నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు’ . అంటూ బాధితుడు తన బాధను పోలీసులతో వెల్లబోసుకున్నాడు. అయితే ‘రూ. లక్షన్నరలో రూ.లక్ష మాత్రమే మాకు వచ్చాయి.. మిగతా రూ. 50 వేలు రాలేదు. అందులో మీ సర్పంచ్ కూడా తీసుకున్నాడు కదా.’ అని పోలీసు అధికారి బదులిచ్చారని అందులో ఉంది.
సాక్షం లేదు.. కేసు నిలువదు
అయితే ‘హత్య విషయంలో ప్రత్యక్షంగా చూసిన వాళ్లు లేరు.. ఈ కేసు నిలబడదు’ అంటూ పోలీస్ అధికారి మాట్లాడిన మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా డబ్బులు ఇచ్చినా తనను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని, ఇంత ఇబ్బంది పెట్టే కంటే తనపై కేసు నమోదు చేయండి అంటూ బాధితుడు తీవ్ర స్వరంతో మాట్లాడగా ఆ పోలీసు అధికారి అంతెత్తు ఎగిరినట్టుగా తెలుస్తోంది. పోలీసు అధికారి కోపంతో బాధితుడిపై రాయలేని భాషలో బూతు పురాణం అందుకున్నాడు. ‘వీన్ని అక్కడ కూర్చోబెట్టండి కేసు చేద్దాం’ అన్న మాటలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.
అవినీతి ఊబిలో పోలీసులు
జిల్లా పోలీసు శాఖ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. ఇందుకు వరుసగా జరిగిన ఘటనలు నిదర్శనం. కొద్దిరోజుల క్రితం ఐపీఎల్ బెట్టింగ్ విషయంలో కామారెడ్డి టౌన్‌సీఐ జగదీశ్ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ విషయంలో పలు ఆరోపణలపై ఏసీబీ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టగా అక్రమాస్తుల కేసులో డీఎస్పీ లక్ష్మీనారాయణ సైతం అధికారులకు చిక్కారు. అలాగే మధ్యవర్తిగా వ్యవహరించి డబ్బులు డిమాండ్ చేసిన కామారెడ్డి ఎస్సై గోవింద్ పై కూడా కేసు నమోదైంది. ఈ ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ కూడా చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతకు ముందు బాన్సువాడ రూరల్ సీఐ టాటాబాబు రూ.50 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దాంతో వారిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
సీఐ, ఎస్సైపై ఆరోపణలు
ప్రస్తుతం హత్యకేసు విషయంలో రూ.రెండు లక్షలు డిమాండ్ చేసి రూ. లక్షన్నర తీసుకున్నట్టుగా సీఐ, ఎస్సైపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసు ఎటువైపు తిరుగుతుందోనని ఇందులో కిందిస్థాయి సిబ్బంది మెడకు ఏమైనా చుట్టుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో వరుసగా పోలీసులపై వస్తున్న ఆరోపణలతో జిల్లా పోలీసు శాఖ మసక బారుతోంది. ఇందుకు బాధ్యులపై చర్యలు తప్పవని పోలీసులు చెప్తున్నారు.