కళ్ల ముందే కాజేస్తున్నరు.. గొర్రెల కొనుగోళ్లలో అక్రమాలు
దిశ ప్రతినిధి, వరంగల్ : హుజురాబాద్ ఉపఎన్నికనే లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన మలి విడత గొర్రెల పంపిణీ అవినీతి అధికారులు, ప్రజాప్రతినిధులకు వరంగా మారింది. ఈ పథకం గొల్లకురుమల కన్నా అధికారులు దండుకోవడానికి ఉపయోగపడుతున్నట్లుగా స్పష్టమవుతోంది. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలోని కొంతమంది బ్రోకర్లనే అమ్మకందారులుగా చూపిస్తున్న అధికారులు ప్రభుత్వం పెంచిన యూనిట్ మొత్తాన్ని లబ్ధిదారుల కళ్ల ముందే కాజేస్తున్నారు. ఇప్పటికే వందల యూనిట్ల డబ్బులు బ్రోకర్ల సాయంతో అధికారుల జేబుల్లోకి చేరిపోయాయి. ఇదేంది […]
దిశ ప్రతినిధి, వరంగల్ : హుజురాబాద్ ఉపఎన్నికనే లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన మలి విడత గొర్రెల పంపిణీ అవినీతి అధికారులు, ప్రజాప్రతినిధులకు వరంగా మారింది. ఈ పథకం గొల్లకురుమల కన్నా అధికారులు దండుకోవడానికి ఉపయోగపడుతున్నట్లుగా స్పష్టమవుతోంది. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలోని కొంతమంది బ్రోకర్లనే అమ్మకందారులుగా చూపిస్తున్న అధికారులు ప్రభుత్వం పెంచిన యూనిట్ మొత్తాన్ని లబ్ధిదారుల కళ్ల ముందే కాజేస్తున్నారు. ఇప్పటికే వందల యూనిట్ల డబ్బులు బ్రోకర్ల సాయంతో అధికారుల జేబుల్లోకి చేరిపోయాయి. ఇదేంది సారూ అని అడిగిన రైతులకు మాకు మిగిలేదెంత చివరికి వెయ్యి.. పైన మంత్రులకు ఇవ్వొద్దా అంటూ చెబుతున్నారంటూ అనంతపురంలో గొర్ల కొనుగోలుకు వెళ్లిన యాదవ యువకుడు దిశ ప్రతినిధికి ఫోన్ చేసి చెప్పడం గమనార్హం. గొర్రెల కొనుగోలులో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పెద్ద మొత్తంలో దోపిడీకి తెరలేపినట్లుగా అక్కడికి వెళ్లి ఆరోపిస్తున్నారు.
యూనిట్ గొర్రెలకు రూ.1లక్షా 20వేలేనట..
ప్రభుత్వం గొర్రెల యూనిట్ ధరను రూ. రూ.1లక్ష 75వేలకు పెంచుతూ మార్గదర్శకాలను విడుదల చేసింది. సంబంధిత రైతుల పేర చెక్కులను కూడా మంజూరు చేసింది. ఈమేరకు హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని వీణవంక, హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమాలాపూర్ మండలాలకు చెందిన వందలాది మంది గొల్ల కురుమలను పథకానికి అధికారులు ఎంపిక చేశారు. ఎంపిక చేసిన వారిని నాలుగైదు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూల్, అనంతపురం జిల్లాలకు అధికారులతో పంపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం అందజేస్తున్న రూ.1.75వేలల్లో 25వేలను రవాణా చార్జీలకు, ఇతరత్రా ఖర్చులకు వెళ్లిన మిగిలిన రూ.1లక్ష 50వేలతో యూనిట్(21)గొర్రెలను కొనుగోలు చేయాలి. అయితే ఇక్కడే అధికారులు చేతి వాటానికి తెరలేపారు. రూ.1లక్ష రూ.20వేలకే యూనిట్ గొర్రెలను కొనుగోలు చేసేలా కుయుక్తులు పన్నుతున్నారు. గొర్రెల కొనుగోళ్లలో తమకేంటి అనే ఆలోచనతో రూ.25వేల నుంచి రూ.30వేలను కాజేసే అవినీతి ఎత్తుగడ వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పథకానికి వర్తింపజేసిన పూర్తి మొత్తాన్ని అందజేస్తే నాణ్యమైన గొర్రెలు వచ్చే అవకాశం ఉన్నా.. అధికారులు ఆ విధంగా చేయడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
బ్రోకర్లతో చేతులు కలిపిన అధికారులు
గొర్రెల కొనుగోలు ప్రక్రియలో లబ్ధిదారుల సొమ్ము కాజేయడానికి అధికారులు బ్రోకర్లను అమ్మకందారులుగా చూపిస్తున్నారు. బ్రోకర్లకే అధికారులు చెక్కులు అందజేస్తున్నారు. హుజురాబాద్ నుంచి వెళ్లిన లబ్ధిదారులను అధికారులు బ్రోకర్లకు అప్పగిస్తున్నారు. నిజమైన అమ్మకందారుల వద్దకు తీసుకెళ్తున్న బ్రోకర్లు.. గొర్రెల కొనుగోలు ప్రక్రియంతా వారికే అప్పగిస్తుండటం గమనార్హం. అధికారులు సూచించిన విధంగా రూ.1లక్ష 20వేల లోపే కొనుగోళ్లు జరిగేలా బ్రోకర్లు చేస్తున్నారు.
అమ్మకందారులకు బ్రోకర్లు ముందే డబ్బు చెల్లింపు చేస్తున్నారు. ఒక్కో యూనిట్ మీద రూ.30వేల వరకు మిగుల్చుకుంటున్నారు. ఈ మొత్తం కూడా బ్రోకర్లు, అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య పంపకం జరుగుతోందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
కొన్న గొర్రెలు చనిపోతున్నాయ్..
అధికారుల అక్రమాలతో నాణ్యమైన గొర్రెలు రావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. అధికారులను నిలదీసిన ఫలితం ఉండటం లేదని, కొంటే కొనండి లేదంటే వెళ్ళిపోండంటూ తెగేసి చెబుతుండటం గమనార్హం. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బక్కచిక్కినవి, చిన్నవి, రోగాలతో బాధపడుతున్నవని తెలిసి కూడా తీసుకుంటున్నామని చెబుతున్నారు. అయితే కొనుగోలు చేస్తూ వస్తుంటేనే కొన్ని మృతిచెందుతుండటం గమనార్హం. జమ్మికుంట మండలం పాపక్కపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులు మెరుగు శ్రీనివాస్ కు చెందిన మూడు గొర్రెలు మార్గ మధ్యలోనే మృతి చెందడం పరిస్థితికి అద్దం పడుతోంది.
అనంతపురంలో ఐదు రోజులుగా అవస్తలు..
గొర్రెల కొనుగోలు కోసమని ఐదురోజుల క్రితం అధికారులు అనంతపురం తీసుకువచ్చారు. ప్రభుత్వం కేటాయించిన పూర్తి స్థాయి మొత్తం కాకుండా రూ.1లక్ష 20వేలే ఇస్తామని చెబుతుండటంతో ఇక్కడి గొల్లకాపారులు అమ్మడం లేదు. ఇవ్వజూపిన గొర్రెలు నాణ్యత ఉండటం లేదు. రోగాలతో ఉన్నవి ఉంటున్నాయి. రోజూ ఆటోలో బ్రోకర్లతో తిరగాల్సి వస్తోంది. ఆటో ఖర్చు రూ.3వేలు. ఐదురోజులకు అందరికీ కలిపి రూ.15వేల వరకు ఖర్చయింది. ఇంకా కొనుగోళ్లు కాలే. తిండికి, నిద్రకు దూరమవుతున్నాం.
భిక్షపతి, లబ్ధిదారుడు, పాపక్కపల్లి
Follow Disha daily on Facebook : https://www.facebook.com/dishatelugunews