కరోనా నుంచి కోలుకునేదెన్నడు!?
దిశ, వెబ్‌డెస్క్: కేవలం మూడు నెలల్లో ప్రపంచాన్ని చాపలా చుట్టేసింది కరోనావైరస్. కుడి ఎడమా లేదు..అలా అల్లుకుంటూనే అన్ని దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుంది ఈ మహమ్మారి. లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన వారిలో కూడా కరోనా ఆందోళన పెంచుతోంది. అయితే, వ్యాధిని అదుపులో ఉంచి బయటపడినప్పటికీ…దీనితో ఎదురయ్యే ప్రతికూల ప్రభావాల నుంచి కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో అనే సందేహాలకు సమాధానం వెతకడంలో విశ్లేషకులు తలమునకలయ్యారు. క్షేత్ర స్థాయిలో ప్రజల ముందు ఈ సందేహాన్ని ఉంచగా..కరోనా తర్వాత కోలుకోవడానికి […]
దిశ, వెబ్‌డెస్క్: కేవలం మూడు నెలల్లో ప్రపంచాన్ని చాపలా చుట్టేసింది కరోనావైరస్. కుడి ఎడమా లేదు..అలా అల్లుకుంటూనే అన్ని దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుంది ఈ మహమ్మారి. లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన వారిలో కూడా కరోనా ఆందోళన పెంచుతోంది. అయితే, వ్యాధిని అదుపులో ఉంచి బయటపడినప్పటికీ…దీనితో ఎదురయ్యే ప్రతికూల ప్రభావాల నుంచి కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో అనే సందేహాలకు సమాధానం వెతకడంలో విశ్లేషకులు తలమునకలయ్యారు. క్షేత్ర స్థాయిలో ప్రజల ముందు ఈ సందేహాన్ని ఉంచగా..కరోనా తర్వాత కోలుకోవడానికి కనీసం సంవత్సరం పట్టొచ్చని, అదనంగా మానసిక భయాలు ఇప్పట్లో తొలిగేలా లేవని అభిప్రాయపడుతున్నారు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం…గతంలో మానవాళిపై విరుచుకుపడిన క్యాన్సర్, ఎయిడ్స్ వ్యాధులను దాటి కోవిడ్-19 విజృంభిస్తోందని చెబుతున్నారు.
ఇటీవల ప్రైవేట్ సంస్థలు జరిపిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు తెలిసినట్టు సమాచారం. ప్రధాన నగరాల్లో ఈ సర్వే నిర్వహించగా మరిన్ని విషయాలు అవగాహనలోకి వచ్చాయి. ముఖ్యంగా..కరోనా వల్ల వ్యక్తిగత పరిశుభ్రత పెరిగిందని, ఇళ్లలో కానీ, పరిసరాల్లో కానీ శుభ్రత ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవి పాటిస్తే కరోనానే కాకుండా ఇతర వ్యాధులు సోకే ప్రమాదం తప్పుతుందని 63 శాతం మంది చెబుతున్నారు.
వీటికి తోడు… 2019-20 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడిదారులు ఏకంగా రూ. 53.59 లక్షల కోట్లను నష్టపోయారు. ఈ ఏడాది మార్చి నెలలో దేశీయ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ అత్యధిక నష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ మూలధనం గత ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 37.59 లక్షల కోట్లు తగ్గి రూ. 113.48 లక్షల కోట్లకు చేరింది. 2019 మార్చి 31 నాటికి మార్కెట్ మూలధనం రూ. 151.07 లక్షల కోట్లుగా ఉంది. సెన్సెక్స్ మార్చిలో 23.05 శాతం నష్టాన్ని నమోదు చేయడంతో మదుపర్లకు ఈ నెల పీడకలగా మారింది. నిఫ్టీ సైతం 23.24 శాతాన్ని కోల్పోయి భయాన్ని పెంచింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు ఉండటం కూడా నష్టాలు పెరగడానికి కారణమయ్యాయి. కరోనా ప్రారంభమైన దగ్గరి నుంచి దేశీయ మార్కెట్లలో పెట్టుబడిదారులు రూ. 23.39 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
ఇప్పటికే అనేక రంగాలు కరోనా ధాటికి కుదేలయ్యాయి. మార్కెట్లతో సంబంధం లేకుండా, ఎప్పుడూ డిమాండ్‌లో ఉండే రియల్ ఎస్టేట్ రంగానికి కూడా కరోనా కష్టాలు తప్పేలా లేదు. దేశ జీడీపీలో సుమారు 6 శాతం వాటా అందిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం రానున్న ఆర్థిక సంవత్సరానికి ఆరు ప్రధాన నగరాల్లో 10 నుంచి 15 శాతం డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ విధింపు మూడు నెలలు గనక కొనసాగితే రియల్ ఎస్టేట్ రంగానికి భారీ నష్టాలు తప్పవని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్స్ వెల్లడించింది. రేటింగ్ ఏజెన్సీ వివరాల ప్రకారం ప్రధానమైన ఆరు నగరాల్లో 2019-20 ఆర్థిక సంవత్సరంలో నివాసాల డిమాండ్ 7 నుంచి 10 శాతం తగ్గనుంది.
ఇటీవల కరోనా ప్రభావం తర్వాత ఈ రంగంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశంపై అనరాక్ సంస్థ 32 పేజీల నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. 2019లో కార్యాలయ సముదాయాలకు 40 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజ్‌కు వెల్లగా, ఈ ఏడాది 28 మిలియన్ చదరపు అడుగులకు పడిపోవచ్చని అనరాక్ నివేదికలో పేర్కొంది. రియల్ ఎస్టేట్ రంగానికి తోడు రిటైల్ రంగం కూడా సుమ్మారు 65 శాతం వరకూ క్షీణించిందని నివేదిక స్పష్టం చేసింది. కరోనా వల్ల ప్రధానంగా నగదు లభ్యత ఉండకపోవచ్చు, ఇది కూడా రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రమైన ప్రభావాం చూపించే అవకాశముందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కీలకమైన నగరాల్లో నివాస గృహాల విక్రయాలు ఏకంగా 37 శాతం పతనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక అభిప్రాయపడింది.
వీటితో పాటు ఆటో రంగం, మెటల్ రంగ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు అన్నీ మూత పడటంతో అన్ని రకాల వర్గాలకు తీవ్ర నష్టం తప్పేలా లేదు. నిత్యావసర సరఫరా కింద దుకాణాలను, రిటైల్ షాపులను తెరిపించినప్పటికీ నష్టాలను అధిగమించడం మాత్రం తప్పదనే భావన వారిలో ఉంది. పూర్తీ స్థాయిలో రవాణా నిలిచిపోవడం, సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటం ఈ నష్టం లెక్కలను అంచనా వేయడం కూడా కష్టంగా ఉందని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. అన్ని రకాల జీవనం నిలిచిపోవడంతో ప్రజలకు ఆదాయం నిలిచిపోయింది, కంపెనీలకు అమ్మకాలు స్తంభించిపోయాయి. ఇదివరకే దేశీయంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతున్న సమయంలో కరోనా రావడంతో ప్రభుత్వాలకు ఈ నష్టం భరించడం మరింత కష్టంగా మారనుంది. దీన్నుంచి కోలుకోవడం అంత సులభమైన విషయమేమీ కాదు. సామాన్య ప్రజల నుంచి మధ్య తరగతి పరిశ్రమల వరకూ అందరినీ ప్రభుత్వమే ఆదుకోవాల్సి రావడం తప్పనిసరి అయింది. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడానికి కనీసం ఏడాది పడుతుందనే అంశం కూడా ఆర్థిక వ్యవస్థపై పరోక్ష ప్రభావాన్ని చూపించగలదు. అప్పటివరకూ కరోనాతో పోరాడటమే కానీ పోరాడి గెలవడానికి కృషి చేస్తూ ఉండటమే.
Tags: covid-19, coronavirus, ecconomy, real estate, market capitalization, investers