బంధాలను ‘బంధిస్తున్న’ కరోనా

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ పెట్టిన చిచ్చు శరీరానికే కాదు.. బంధాలకూ సోకుతోంది. ఏ మందు వేసినా కుదుటపడేటట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే కరోనా లక్షణాలు ఉన్నాయంటూ కన్నతల్లిని గెంటేసిన ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరికైనా పాజిటివ్ అని తేలినా లేదా వారి ఇల్లు క్వారంటైన్‌లో ఉందని స్టిక్కర్ అంటించినా చాలు.. వివక్షతకు గురికావల్సి వస్తోంది. కొందరు తమ ఊళ్లోకి పక్క ఊరివాళ్లను రానివ్వడం లేదు. మొన్నటి దాకా కాలనీలకు తాళాలేశారు. ఊరెళ్లే దారులకు […]

Update: 2020-06-13 21:54 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ పెట్టిన చిచ్చు శరీరానికే కాదు.. బంధాలకూ సోకుతోంది. ఏ మందు వేసినా కుదుటపడేటట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే కరోనా లక్షణాలు ఉన్నాయంటూ కన్నతల్లిని గెంటేసిన ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరికైనా పాజిటివ్ అని తేలినా లేదా వారి ఇల్లు క్వారంటైన్‌లో ఉందని స్టిక్కర్ అంటించినా చాలు.. వివక్షతకు గురికావల్సి వస్తోంది. కొందరు తమ ఊళ్లోకి పక్క ఊరివాళ్లను రానివ్వడం లేదు. మొన్నటి దాకా కాలనీలకు తాళాలేశారు. ఊరెళ్లే దారులకు గోడలు కట్టారు. ఎంత కోటీశ్వరుడి అంత్యక్రియలకైనా నలుగురంటే నలుగురు కూడా వచ్చే చాన్స్ లేదు. ఇదిలా ఉంటే, కరోనా వారియర్స్‌కూ కష్టాలు తప్పడం లేదు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు.. ఇప్పుడు జర్నలిస్టులు కూడా కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇంటి యజమానులు కూడా మీరు డ్యూటీ చేసుకునేటట్లయితే ఇంటికి రావద్దంటూ సూచిస్తున్నారు. దాంతో పని ప్రాంతాలకు దగ్గరలోని లాడ్జీలు, రీసార్టుల్లో గదులు తీసుకున్న అధికారులు లేకపోలేదు. పోలీసులైతే.. స్టేషన్లోనే వంటావార్పు చేసుకుంటూ నెలల తరబడి కుటుంబాలను వీడి విధులు నిర్వర్తిస్తున్నారు.

కరోనా వైరస్‌ సోకిన వారికి వైద్యం చేయడం ఒక ఎత్తయితే చనిపోయే ముందు వీరి బాధను చూసి భరించడం వైద్యులకు, సిబ్బందికి మరో ఎత్తులా పరిణమించింది. ఏళ్ల తరబడి వైద్య వృత్తిలో ఉన్న వారు కూడా చివరి సమయంలో కరోనా రోగులు అనుభవిస్తున్న బాధను చూసి తట్టుకోలేక పోతున్నారు. కాగా మరణానంతరం మృతదేహాన్ని దహనం చేయడం మరింత హృదయవిదారకంగా ఉంటోంది. గాలిచొరబడని, రసాయనాలతో నింపబడ్డ ప్లాస్టిక్‌ సంచుల్లో మృతదేహాన్ని పెట్టి కేవలం ప్రభుత్వం నిర్దేశించిన సిబ్బంది మాత్రమే శ్మశానవాటికకు తరలించి విద్యుత్‌దహన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడా బంధుమిత్రుల్ని, కుటుంబ సభ్యుల్ని, ఆఖరికి భార్యాపిల్లల్ని కూడా అనుమతించడంలేదు. ఆస్పత్రి లోపల చనిపోయే స్థితిలో కన్నతండ్రి ఇబ్బందులు పడుతున్నాడన్న విషయం తెలిసి కూడా ఏం చేయలేని దుస్థితితో కొడుకులు, కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు. ఇదిలాగే కొనసాగితే మున్ముందు మనిషికి మనిషికి మధ్య బంధాలనేవేవీ ఉండవేమోనన్న ఆందోళన కలుగుతోంది.

లక్షణాలతోనే ఆమడ దూరం..

సరూర్ నగర్‌లోని ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంతే ఆమె ఉంటోన్న అపార్టుమెంటులోని చాలా ఇండ్లు ఖాళీ అయ్యాయి. పక్కవారంతా ఊర్లకు వెళ్లిపోయారు. అల్మాస్ గూడలో ఓ ఇంటికి క్వారంటైన్ స్టిక్కర్ వేశారు. అంతే.. ఆ కాలనీ అంతా కుటుంబాన్నిసాంఘిక బహిష్కరణ చేసింది. కనీసం సాయమందించేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఆఖరికి ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే చాలు.. దూరం దూరం అంటూ కేకలు పెడుతున్నారు. రాంగోపాల్ వర్మ ఇటీవల విడుదల చేసిన తన ‘కరోనా వైరస్’ సినిమా ట్రయల్‌లోనూ ఒకింట్లో చోటు చేసుకుంటోన్న వాస్తవాన్ని చూపారు. ఉద్యోగాలు మానేయాలంటూ ఒత్తిడి చేస్తోన్న కుటుంబాలు ఉన్నాయి. త్వరలోనే రిటైర్మెంట్ తీసుకోబోయే ఉద్యోగులు, అధికారులను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు సూచించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.

ప్రాణం విలవిలలాడే ఘటనలు..

కరోనా భయం మానవత్వం మంటగలిసేలా చేసిన ఘటన ఒకటి సిద్దిపేట జిల్లా చేగుంట ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో చోటు చేసుకుంది. రామాయంపేట నుంచి సికింద్రాబాద్‌కు ఆర్టీసీ బస్సులో వెళ్తున్న శ్రీనివాస్ బాబు (50)కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో చేగుంట ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో బస్సులోంచి కిందికి దిగి అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. ఇది గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అతని వద్దకు ఎవరూ వెళ్లలేదు. దీంతో శ్రీనివాస్ బాబు అక్కడే విలవిల్లాడుతూ మృతి చెందాడు. మృతుడికి కరోనా లక్షణాలు ఉండవచ్చుననే అనుమానంతో బస్సులోంచి దింపేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే అతన్ని తరలించేందుకు అంబులెన్స్ వచ్చినా తీసుకెళ్లేందుకు నిరాకరించారు. నిజానికి అతడు ఆస్తమా సమస్యతో బాధపడుతున్నాడని బంధువుల ద్వారా తెలిసింది. కాస్త సాయమందించి ఉంటే మనిషి బతికేవాడేమో కదా..

తల్లిని మరిచిన తనయులు..

మానవత్వానికి మచ్చ తెచ్చే మరో ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. కరోనా వైరస్ మహమ్మారి సాకుతో తల్లిని వదిలించుకోవాలని కన్న కొడుకులే ప్రయత్నించారు. కిసాన్‌నగర్‌లోని ఓ వృద్ధురాలు కొంతకాలం కిందట షోలాపూర్ వెళ్లింది. ఈ మధ్యే తిరిగి కొడుకుల ఇంటికి వచ్చింది. అయితే, తల్లికి కరోనా సోకిందని కొడుకులు ఆమెను కనీసం ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో చేసేది లేక తల్లి శ్యామల ఎర్రటి ఎండలో రోడ్డు పైనే కూర్చుండిపోయింది. అందరూ మందలిస్తే గానీ ఇంట్లోకి తీసుకెళ్లలేదు.

డాక్టరుకూ తప్పని ఇబ్బంది..

మాయదారి మహమ్మారి పరిస్థితిని ఎంత కఠినంగా మార్చేసిందంటే.. నెల్లూరులో పేరుగాంచిన ఆర్థోపెడిక్ డాక్టర్ ఆస్తిపరుడు, స్థితిమంతుడు. బంధుగణానికి కొదువే లేదు. పేరున్న డాక్టర్ కావ‌డంతో ఆయ‌న క్లినిక్ ఎప్పుడూ రోగుల‌తో ర‌ద్దీగా ఉండేది. ఈ క్రమంలనే ఓ రోగి నుంచి ఆయ‌న‌కు క‌రోనా వ్యాపించింది. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాగా మృత‌దేహాన్ని నెల్లూరుకు తీసుకురావ‌డం వీలు కాలేదు. అందులోనూ డాక్టర్ భార్య, అన్న‌, అక్క‌, బావ‌ల‌కు అనుమానిత లక్షణాలు ఉండటంతో వాళ్లందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచారు. దీంతో భౌతికాయం చెన్నైలోనే ఉండిపోయింది. బంధువులు, స్నేహితులు, కావాల్సినంత సంపద‌ ఉన్నా చివరి రోజుల్లో అవేమీ అక్కరకు రాకుండా పోయాయి. అంతిమ సంస్కారాల బాధ్యత‌ను పొరుగు రాష్ట్రం త‌మిళ‌నాడులోని చెన్నై న‌గ‌ర‌పాల‌క సిబ్బంది చేప‌ట్టాల్సి వ‌చ్చిందంటే ఎంతటి దారుణమో చూడండి.

కారే ఇల్లు..

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ డాక్టర్.. పేరు సచిన్ నాయక్. కరోనా నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఏకంగా తన కారునే ఇల్లుగా మార్చుకున్నాడు. భోపాల్‌లో ఉన్న జేపీ హాస్పిటల్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం, ఆస్పత్రికి అనుమానితులు ఎక్కువగా వస్తుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ల్యాప్‌టాప్‌తో పాటు దుస్తులు, దుప్పటిని అందులోనే ఉంచుకున్నారు. ఇక ఆస్పత్రిలోనే భోజనం చేస్తూ.. డ్యూటీ పూర్తవగగానే తిరిగి కారు వద్దకు చేరుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా సచిన్ నాయక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అతిథులతోనూ సమస్య..

లాక్‌డౌన్ సమయంలో చాలా మంది ఇండ్లల్లో శాశ్వత అతిథులుగా మారిపోయారు. సగటు భాగ్యనగర జీవికి ఆ బంధువులు కూడా సమస్యగా మారారు. లాక్‌డౌన్‌కు ముందు పెళ్లిళ్లు పూర్తయిన తరువాత బంధు ప్రీతితో ‘అప్పుడే తొందరేముంది, మరో రెండు రోజులు ఆగి వెళ్ళవచ్చు కదా’ అంటూ చెప్పిన వారు.. ఇప్పుడు మింగలేక, కక్కలేక చస్తున్నారు. కూకట్ పల్లి, రాంనగర్ ప్రాంతాల్లో సగటు పేదవారి ఇంటికి పెళ్లి సమయంలో వచ్చిన బంధువులను లాక్‌డౌన్ కాలంలో పోషించలేక సతమతమైన సంఘటనలు కంటనీరు తెప్పించాయి. 20 మంది వరకు బంధువులు లాక్‌డౌన్‌లో చిక్కుకుపోవడంతో వారందరికీ చాకిరీ చేయలేక తమ ఇంట్లో పెళ్లి జరిగిందన్న ఆనందం ఆవిరైంది. అంతేకాదు ఇలా చిక్కుకున్న చుట్టాల సమస్యను అర్థం చేసుకుని సాయం చేయకపోగా, పక్కవారంటున్న సూటిపోటి మాటలు భరించలేక మూగరోధన అనుభవిస్తున్న వారి వ్యథలు భాగ్యనరంలో అక్కడక్కడా దర్శనమిస్తూనే ఉన్నాయి.

Tags:    

Similar News