వాళ్లిస్తే మీరు పంచుడేంది..? అయితే మీరేమిచ్చిన్రో ఇప్పుడు చెప్పండి..?
దిశ, నిజామాబాద్: కరోనా మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేయడమే కాకుండా ఇందూర్ లో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు కారణమైంది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో నిర్భాగ్యులను, నిరాశ్రయులను, పేదలను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం, ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. నాటి నుంచే కొవిడ్ -19 నియంత్రణ మొదలుకుని, సేవా కార్యక్రమాల చుట్టూ రాజకీయాలు షురూ అయ్యాయి. ప్రభుత్వం నుంచి వచ్చినవి, దాతల ద్వారా వచ్చినవాటిని పంపిణీ చేసే విషయంలో తమకే పేరు రావాలనేది […]
దిశ, నిజామాబాద్: కరోనా మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేయడమే కాకుండా ఇందూర్ లో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు కారణమైంది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో నిర్భాగ్యులను, నిరాశ్రయులను, పేదలను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం, ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. నాటి నుంచే కొవిడ్ -19 నియంత్రణ మొదలుకుని, సేవా కార్యక్రమాల చుట్టూ రాజకీయాలు షురూ అయ్యాయి. ప్రభుత్వం నుంచి వచ్చినవి, దాతల ద్వారా వచ్చినవాటిని పంపిణీ చేసే విషయంలో తమకే పేరు రావాలనేది రాజకీయ నాయకుల తాపత్రయం. ప్రచారం చేసుకోవడంలో రాజకీయ నేతలు ఎవరికి వారే సాటి అన్న చందంగా పరిస్థితి దాపురించింది.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రస్తుతం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో వేడెక్కుతోన్నది. అధికార పార్టీ, బీజేపీ నాయకుల మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ప్రత్యక్ష, పరోక్ష విమర్శలతో హోరెత్తుతోన్నది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కరోనా పేరు మీద జరుగుతున్న సేవా రాజకీయం చూసి ప్రజలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం మార్చి 23న లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నెపథ్యంలో చాలా మంది సామాన్యుల నుంచి ఉద్యోగుల వరకు, నేతల నుంచి వ్యాపార, వాణిజ్యవేత్తలు దాకా, విద్యావేత్తలు మొదలుకొని కర్షకులు సహాయం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. కొందరు ధనం రూపంలో, మరికొందరు నిత్యావసర వస్తువుల రూపంలో, ఇంకొందరు కొవిడ్-19 నియంత్రణకు ఉపయోగించే వస్తువులను పంపిణీ చేశారు. అయితే గుప్తదానం చేసిన వారిని పట్టించుకోలేదు కానీ, నిత్యం మీడియాలో వచ్చేవారిని మాత్రం పరిగణనలోకి తీసుకుని ‘అబ్బా ..ఇంతగనం దానం చేశారు… ఇంతే దానం చేశారా’ అనే చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తున్నారు.
అసలు విషయమేమిటంటే..
లాక్ డౌన్ మొదలైన తరువాత ఏప్రిల్ మొదటి వారంలో నిజామాబాద్ రైస్ మిల్లర్స అసోసియేషన్ కు చెందిన రాష్ర్ట స్థాయి నేతలు ముఖ్యమంత్రి కేసిఆర్ కు రూ.50 లక్షల నగదు చెక్ ను సీఎం సహాయ నిధికి అందచేశారు. ఆ తరువాత పేదల ఆకలి తీర్చడం కోసం 240 క్వింటాళ్ల బియ్యాన్ని జిల్లా అధికార యంత్రాంగానికి అందచేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆ బియ్యం పంపిణీకి సంకల్పించడంతో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. ఈ విషయానికి సంబంధించి తొలుత నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. దీంతో బీజేపీ- టీఆర్ఎస్ పార్టీల మధ్య తేనె తుట్టెను కదిపినట్టయింది. మంత్రితో పాటు శాసన సభ్యులు తమ తమ నియోజకవర్గాలలో పేదలకు మధ్యాహ్న భోజన కార్యక్రమం, బియ్యం పంపిణీని చేపట్టారు. రైస్ మిల్లర్లు ఇచ్చిన బియ్యాన్ని తాము తమ ప్రాంతంలో పంపిణీ చేస్తామని బీజేపీ నాయకులు అధికార యంత్రాంగానికి మొరపెట్టుకున్నారు. అందుకు గాను నిజామాబాద్ నగరంలోని అరవై డివిజన్ లలో డివిజన్ కు 4 క్వింటాళ్ల బియ్యాన్ని ఇస్తామని స్థానిక ప్రజా ప్రతినిధుల( కార్పొరేటర్ల)తో అధికారులు చెప్పుకొచ్చారు. కానీ, ఏం జరిగిందో తెలియదు కానీ అధికారులు చేతులెత్తేశారు. మిల్లర్లు ఇచ్చిన బియ్యం పంపిణీ వ్యవహారం మా చేతిలో లేదనడంతో కరోనా బియ్యం పంపిణీకి రాజకీయ రంగు పులుముకుంది. ఈ విషయంలో బీజేపీ పార్టీకి చెందిన నగర పాలక సంస్థ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికార పార్టీ నేతల తీరును ఎండకట్టారు. మిల్లర్లు ఇచ్చిన బియ్యాన్ని తమ సొంత ఖర్చులతో పేదలకు ఉచితంగా పంపిణీ, భోజనం అందిస్తునట్లు అధికార పార్టీ శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు సెల్ఫ్ డబ్బా కొడుతున్నారని ఆరోపించారు. దానికి ప్రతిగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ సైతం మీడియా సమావేశం ఏర్పాటు చేసి చిల్లర రాజకీయాలు మానుకోవాలని, నిజామాబాద్ ఎంపీ జిల్లాలో ఎంతమందికి సహాయం చేశారో చెప్పాలని విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో రైస్ మిల్లర్లు ఇచ్చిన బియ్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మిల్లర్లు ఇచ్చిన రూ. 2,67,000 విలువైన బియ్యాన్ని ఇప్పటికే మంత్రితోపాటు శాసన సభ్యులు పంపిణీ చేశారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుందోననేది వేచి చూడాలి.
Tags: Nizamabad, Corona, Rice Distribution, MP Arvind, TRS, BJP