ఒంటరవుతున్న 'ఖాకీ'లు.. కారణమేమంటే..?
కరోనా మహమ్మారి సమాజంలోని అనేక రంగాలను చిన్నాభిన్నం చేస్తున్నది. రోజురోజుకు కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ఫ్రంట్లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసులనూ మహమ్మారి కాటేస్తోంది. కరోనా కట్టడిలో తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఈ నేపథ్యంలో భార్యా పిల్లలు, పేరెంట్స్ కు కరోనా సోకుతుందనే భయంతో వారిని సొంతూర్లకు పంపి, ఒంటరి జీవితాన్నిగడిపేస్తున్నారు. ఫలితంగా కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలకు దూరం కావాల్సిన దుస్థితి పోలీసులకు నెలకొంది. దిశ, క్రైమ్ బ్యూరో : కరోనా నివారణ చర్యల్లో […]
కరోనా మహమ్మారి సమాజంలోని అనేక రంగాలను చిన్నాభిన్నం చేస్తున్నది. రోజురోజుకు కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ఫ్రంట్లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసులనూ మహమ్మారి కాటేస్తోంది. కరోనా కట్టడిలో తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఈ నేపథ్యంలో భార్యా పిల్లలు, పేరెంట్స్ కు కరోనా సోకుతుందనే భయంతో వారిని సొంతూర్లకు పంపి, ఒంటరి జీవితాన్నిగడిపేస్తున్నారు. ఫలితంగా కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలకు దూరం కావాల్సిన దుస్థితి పోలీసులకు నెలకొంది.
దిశ, క్రైమ్ బ్యూరో : కరోనా నివారణ చర్యల్లో భాగంగా పోలీస్ శాఖ రేయింబవళ్లు విధుల్లో మునిగి తేలుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలలో అనేక పోలీస్ స్టేషన్లలో సిబ్బందికి పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పోలీసులు డ్యూటీ ముగించుకుని ఇంటికి రాగానే, భార్యా పిల్లలతో ఎడబాటును పాటించాల్సి వస్తోంది. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా.. కుటుంబంలోని భార్యతో పాటు చిన్న వయస్సు కలిగిన పిల్లలకు, వయస్సులో పెద్దవారైన తల్లిదండ్రులకు ఎక్కడ కరోనా వ్యాపించే అవకాశం ఉందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కష్టమైనా.. కరోనా కట్టడి అయ్యే వరకూ భారమైనా.. కొన్నాళ్ల పాటు బంధాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. దీంతో భార్యా పిల్లలను సొంతూర్లకు పంపేస్తున్నారు. నగరంలో ఇప్పటికే దాదాపుగా 90 శాతం పోలీసులు తమ కుటుంబాలను సొంత గ్రామాలకు పంపినట్టు ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం హోటల్ ఫుడ్ కూడా అంత శ్రేయేస్కరం కాకపోవడంతో వీరంతా స్వయంగా ఇంటి పని, వంట పనులు చేసుకుంటూ డ్యూటీలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఎవరూ ఊహించనివిధంగా పోలీసులకు మళ్ళీ బ్యాచ్ లర్ లైఫ్ లో వచ్చే కష్టాలన్నీ ప్రారంభమయ్యాయి.
అద్దె ఇండ్ల వారికి కష్టాలు..
సాధారణ రోజుల్లో డ్యూటీ ముగించుకొని ఇంటికి రాగానే.. ఇంటి యజమానులు, పక్కింటి వ్యక్తులు మర్యాద పూర్వకంగా పలకరించే వారు. కానీ ఈ కరోనా విధులకు హాజరై ఇంటికి తిరిగెళ్తే కనీసం పలకరించే దిక్కు కూడా కరువవుతోంది. కరోనాతో యుద్ధం చేస్తున్న పోలీసులను అంటరాని వాళ్లుగా చూడడంతో వారి మనసులు గాయపడుతున్నట్టు ఓ అధికారి తన ఆవేదనను వ్యక్తం చేశారు. కొందరు ఇంటి ఓనర్లతే ఏకంగా అద్దెకు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఓ పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక ఎస్ఐ కరోనాతో చికిత్స పొందుతుండగా, సదరు ఇంటి యజమాని ఫోన్ చేసి వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో చేసేదేమీ లేక, తన మిత్రుల ద్వారా మరో అద్దె ఇల్లును వెతికే పనిలో ఉన్నారంటే పోలీసుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోంది.