దిగొచ్చిన కూరగాయలు!
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో రెండు రోజులపాటు సామాన్యులకు చుక్కలు చూపించిన కూరగాయలు మంగళవారం కాస్త కరుణించాయి. నిత్యవసరాలను మినహాయించడంతోపాటు మాంసం విక్రయ కేంద్రాలను కూడా తెరవడంతో కూరగాయల ధరలు కొంచెం తగ్గాయి. ఉగాది, తెలంగాణ లాక్‌డౌన్ ప్రభావం నేపథ్యంలో కూరగాయల మార్కెట్లు కళకళడాయి. లాక్‌డౌన్ ప్రకటించిన వెంటనే కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజులకు సరిపడా కూరగాయలు, నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపడంతో వ్యాపారులు సైతం ధరలు […]
దిశ, న్యూస్ బ్యూరో:
కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో రెండు రోజులపాటు సామాన్యులకు చుక్కలు చూపించిన కూరగాయలు మంగళవారం కాస్త కరుణించాయి. నిత్యవసరాలను మినహాయించడంతోపాటు మాంసం విక్రయ కేంద్రాలను కూడా తెరవడంతో కూరగాయల ధరలు కొంచెం తగ్గాయి. ఉగాది, తెలంగాణ లాక్‌డౌన్ ప్రభావం నేపథ్యంలో కూరగాయల మార్కెట్లు కళకళడాయి. లాక్‌డౌన్ ప్రకటించిన వెంటనే కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజులకు సరిపడా కూరగాయలు, నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపడంతో వ్యాపారులు సైతం ధరలు పెంచేశారు. అధిక ధరలకు ఎవరైనా విక్రయిస్తే 100 నంబర్‌కు డయల్ చేసి కంప్లయింట్ చేయాలని ప్రభుత్వం సూచించింది. అయినా సోమవారం కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. టమాటా కిలో రూ.80 వరకు పలికింది. క్యాప్సికం, క్యారెట్ వంటివి రూ.వందకు పైగానే. బెండకాయ, గోకరకాయ ధరలు 60-100 వరకూ వెళ్లాయి. వారం రోజులు కొనుగోళ్లకు అవకాశం ఉండదనే భయాలు, ప్రచారాలతో ధరలు పెంచినా సరే కొనుగోళ్లు ఆగలేదు. మంగళవారం రైతుల నుంచి ఎక్కువగా కూరగాయలు మార్కెట్లకు వచ్చాయి. అత్యవసర, నిత్యవసర వస్తువులకు మినహాయింపులు ఇచ్చినట్టు ప్రభుత్వం ఎక్కువగా ప్రచారం చేయడంతో కూరగాయల మార్కెట్లకు కళ వచ్చింది. ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఉప్పల్ కూరగాయల మార్కెట్లో టమాటా నాణ్యతను బట్టి రూ.20-30 కిలో అమ్ముడుపోయింది. కొత్తపేట, ఎల్బీ నగర్ ఏరియాల్లోని మార్కెట్లలో రూ.40 ధర ఉంది. బెండకాయ, గోకరకాయలను రూ.30 పావు కిలో, కిలో తీసుకున్నవారికి రూ.80 వరకూ విక్రయించారు. క్యారెట్ ధర కూడా రూ.80 వరకు పలికింది. సోమవారం రూ.120 వరకూ అమ్మినట్టు కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.
భలే మంచి పండగ బేరం
కూరగాయలు ధరలు నిన్నటితో పోలిస్తే మంగళవారం కొంత మేర తగ్గడంతో వినియోగదారులు ఎక్కువ మోతాదులో కొనుక్కుని పోతున్నారు. ఉగాది పండగకు కావాల్సిన సరుకులతోపాటు మరో వారానికి కావాల్సిన వస్తువులను ఒకేసారి కొనుక్కుంటున్నారు. ఒక్కో మామిడి కాయ రూ.25-30 మేర విక్రయిస్తున్నారు. ఎక్కువ మోతాదుల్లో కొనుక్కుంటే ధరను తగ్గించి ఇస్తున్నారు. కూరగాయలు, పూల అమ్మకాల్లోనూ ఇదేవిధంగా వ్యవహరిస్తున్నారు.
ధరలు పెంచి అమ్మితే 100కి డయల్ చేయాలని సూచించినా, కూరగాయల మార్కెట్లలో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినా ఆ ప్రభావం కనిపించడం లేదు. నగరంలోని పలు మార్కెట్లలో ధరలు సూచించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలున్నా అమలు కావడం లేదు. కూరగాయల వ్యాపారులు కూడా కొన్నిచోట్ల అసత్య ప్రచారాలు చేస్తుండటం కనిపించింది. కూరగాయల లోడ్లు రావడం లేదని, రేపటి నుంచి ఈ మార్కెట్లను సైతం మూసివేస్తున్నారని ప్రచారం చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అత్యవసర సేవలను, కూరగాయలను, నిత్యావసర కొనుగోళ్లు చేయడంపై ఎలాంటి నిషేధం లేదని, ప్రజలు భయపడొద్దని పోలీసులు సూచిస్తున్నారు. అవసరమైన మేరకు కుటుంబానికి ఒక వ్యక్తి మాత్రమే బయటకు వచ్చి అవసరమైన సరుకులు తీసుకెళ్లి, నిబంధనలు పాటించాలని వారు కోరుతున్నారు.
Tags: Vegetables, hyderabad, rates, corona, effect, markets, police, 100