దిక్కుతోచని స్థితిలో మేమున్నాం

దిశ ప్రతినిధి, మెదక్: కౌలు రైతు పరిస్థితి ఏటికేడు దుర్భరంగా తయారవుతోంది. పెరిగిన కౌలు ధరలు కడుతూ.. పెట్టుబడికి అప్పులు చేస్తూ తిప్పలు పడుతున్నారు. రైతుబంధు సాయం అందుతున్నా కౌలుకిచ్చే వారు ధరలను తగ్గించకపోవడంతో కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటకు వాతావరణం అనుకూలించకపోయినా.. దిగుబడి రాకపోయినా అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నో ఏండ్లుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకు వెళ్లదీ‌స్తూ.. ఇతరుల పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా […]

Update: 2020-07-03 20:27 GMT

దిశ ప్రతినిధి, మెదక్: కౌలు రైతు పరిస్థితి ఏటికేడు దుర్భరంగా తయారవుతోంది. పెరిగిన కౌలు ధరలు కడుతూ.. పెట్టుబడికి అప్పులు చేస్తూ తిప్పలు పడుతున్నారు. రైతుబంధు సాయం అందుతున్నా కౌలుకిచ్చే వారు ధరలను తగ్గించకపోవడంతో కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటకు వాతావరణం అనుకూలించకపోయినా.. దిగుబడి రాకపోయినా అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నో ఏండ్లుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకు వెళ్లదీ‌స్తూ.. ఇతరుల పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు కౌలు రైతులను చిత్తు చేసున్నాయి. రైతులను ఆదుకునేందు‌కు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. కౌలు రైతులను విస్మరించడంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వాతావరణం అనుకూలించకపోయినా, పంట దిగుబడి రాకపోయినా కౌలు తప్పనిసరిగా చెల్లించాల్సిందే. రైతుబంధుతో పేరుతో రైతులకు (పట్టాదారులకు) ప్రభుత్వాలు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నాయి. కానీ కౌలు రైతులకు ఏవిధమైనా సాయం అందించడం లేదు. కౌలు ధరలు సైతం ఏటికేడు పెరుగుతున్నా వ్యవసాయం చేయక తప్పడం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. జిల్లాలో సుమారు 3 లక్షల 13 వేల మంది రైతులున్నారు. వీరిలో సుమారు 38 వేల మంది కౌలు రైతులు ఉన్నట్టు వ్యవసాయశాఖ అధికారుల అంచనా. సాగుపనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో భూ యజమానులతో కౌలు రైతులు ధరలు మాట్లాడుకుంటున్నారు. రైతుబంధు కింద భూయజమానులకు పెట్టుబడి సాయం వస్తున్నా కౌలు మాత్రం తగ్గించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న పథకాలతో కౌలు రైతులకు లబ్ధి చేకూరడం లేదు.

పెరుగుతున్న కౌలు ధరలు..

జిల్లాలో పత్తి సాగుకు అనుకూలమైన నల్లరేగడి భూములు అధికంగా ఉన్నాయి. గతేడాది వానాకాలంలో సాగుచేసిన పత్తి పంటలో చాలా మంది రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయారు. అయినా జిల్లా రైతులు ఈ ఏడు సైతం అధికంగా పత్తి సాగుకే రైతులు మొగ్గుచూపుతున్నారు. భూమి రకాన్ని బట్టి కౌలు ధర నిర్ణయిస్తున్నారు యజమానులు. ప్రస్తుతం జిల్లాలో కౌలు ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలుకుతోంది. గతేడాది ఎకరానికి రూ.9 వేల నుంచి రూ.12 వేల వరకు ధర ఉంది. వరి పొలాలకు ఎకరానికి రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు చెల్లిస్తున్నారు. కానీ పత్తి పంట సాగుకు మాత్రం ధర ఎక్కువగానే పలుకుతోంది.

కరోనా ప్రభావంతో పెరిగిన కౌలు..

జిల్లాలోని అందోల్, వట్‌పల్లి, రేగోడ్, హత్నూర, రాయికోడ్, పుల్కల్, మునిపల్లి, గజ్వేల్, జగదేవపూర్, మెదక్, చిన్నకోడూర్, బెజ్జంకి తదితర మండలాల్లో సాగు అధికంగా ఉంది. ఇక్కడ చాలా మంది రైతులు భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానికులు ఇతర ప్రాంతాలకు పనుల కోసం వెళ్లడం లేదు. గ్రామాల్లోనే వ్యవసాయం చేయాలని అనుకుంటున్నారు. దీంతో భూ యజమానులు కౌలు ధర మరింత పెంచేశారు. కొన్ని గ్రామాల్లో ఎకరాకు రూ.18 వేలు ధర చెల్లించి భూములను కౌలుకు తీసుకుంటుండటం గమనార్హం.

2011 భూఆధీకృత సాగుదారుల చట్టం ప్రకారం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి భూయజమానులకు అవగాహన కల్పించి, కౌలు రైతుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలి. కానీ, ఇలాంటి చర్యలు తీసుకున్నట్టు కనపించడం లేదు. కౌలు ధరలు అదుపు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు.

Tags:    

Similar News